లాహోర్, మార్చి 1 (way2newstv.in)
సర్జికల్ స్ట్రైక్ తర్వాత భారత్‌తో కయ్యానికి కాలు దువ్విన పాకిస్థాన్ క్రమంగా దారికొస్తోంది. ఓ వైపు భారత్ ఎదురుదాడి, మరోవైపు అంతర్జాతీయ ఒత్తిడితో పాకిస్థాన్ శాంతి మంత్రం పఠిస్తోంది. దీనిలో భాగంగానే తమకు బందీగా చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్‌ను శుక్రవారం భారత్‌కు అప్పగిస్తోంది. దీంతో పాటు భారత్ ఎప్పటి నుంచో చేస్తున్న వాదనను సమర్థిస్తూ జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ అధినేత మసూద్ అజహర్ తమ దేశంలో ఉన్నాడని అంగీకరించింది.
దారిలోకి వస్తున్న పాకిస్తాన్
తాజాగా అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి.. మసూద్ విషయంపై స్పందించారు. మసూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడా? అని అడిగిన ప్రశ్నకు ఖురేషి బదులిస్తూ..‘‘మసూద్ పాక్‌లోనే ఉన్నాడు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంటిని విడిచి బయటకు వెళ్లలేని స్థితిలో ఉన్నాడు’’ అని తెలిపారు. మసూద్ అరెస్ట్ చేయాలంటే భారత్ సరైన ఆధారాలు ఇవ్వాలని ఆయన సూచించారు. భారత్‌తో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ఏం చేయడానికైనా పాకిస్థాన్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఫిబ్రవరి 14న 40 మంది భారత జవాన్ల ప్రాణాలను బలిగొన్న పుల్వామా ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. దీనికి అధినేత అయిన మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ ఎప్పట్నుంచో కోరుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఐరాసలో మరోసారి ప్రతిపాదించాయి.
No comments:
Post a Comment