విజయవాడ, మార్చి 8, (way2newstv.in)
రాజకీయ నాటకం ఆంధ్రప్రదేశ్ లో రంజుగా సాగుతోంది. ప్రజాస్వామ్యాన్ని పరిహాసాస్పదం చేసే విధంగా అధికారం కోసం పార్టీలు అర్రులు చాస్తున్నాయి. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ అడ్డదారులు వెదుకుతున్నాయి. ఏదో రకంగా అధికారం నిలబెట్టుకోవడమే పరమావధిగా అన్ని రకాల అధికార దుర్వినియోగానికి తెలుగుదేశం పార్టీ తెగిస్తోంది. గతంలో వచ్చినట్టే చేజారిన పవర్ పగ్గాలు ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని వైసీపీ వక్రమార్గాలను అన్వేషిస్తోంది. ఫలితంగా ప్రజల దృష్టిలో ఈ రెండు పార్టీలు పలచనైపోతున్నాయి. పవర్ పాలిటిక్స్ లో పక్క రాష్ట్రం అనవసర జోక్యానికి తావిస్తున్నాయి. ఈక్రీడలో చట్టపరమైన నిబంధనలు, మంచి చెడు వంటివన్నీ మంటగలిసిపోతున్నాయి. నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా బరితెగిస్తున్న రాజకీయ చదరంగంలో లక్షలాది ఓట్లకు ఎసరు పెట్టేందుకు ప్రధానపార్టీలు పూనుకోవడమే విషాదకరఘట్టంగా చెప్పుకోవాలి. టీడీపీ, వైసీపీల్లో ఎవరు సక్రమమార్గంలో నడుస్తున్నారనే ప్రశ్న వేసుకుంటే నెగటివ్ సమాధానమే వస్తుంది.
ఏపీలో రంజుగా పవర్ పాలిటిక్స్
తటస్థులు, మేధావి వర్గాలు, విద్యావేత్తలు ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయాలను చూసి నవ్వుకుంటున్నారు. ప్రత్యామ్నాయం లేని స్థితిలో ఈరెండు పార్టీల్లో ఏదో ఒక పక్షమే అధికారం సాధించడం ఖాయమని అందరికీ తెలుసు. బహుముఖ పోటీలు కనిపించినప్పటికీ ఆటలో అరటిపండు మాదిరిగానే చెప్పుకోవాలి. ఫలితంగా రాజకీయం ఈరెండు పార్టీల మధ్య కేంద్రీక్రుతమవుతోంది. ఏదోరకంగా పవర్ లోకి రావాలని టీడీపీ, వైసీపీలు సకలవిధాలుగా ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. ప్రజలను మెప్పించి అధికారంలోకి రావడంలో తప్పులేదు. అమలు సాధ్యంకాని హామీలతో తప్పుదారి పట్టించి అధికారంలో కొనసాగినా, కొత్తగా అధికారంలోకి వచ్చినా సరిపెట్టుకోవచ్చు. కానీ ఓట్లను గల్లంతు చేయడంలో పోటీ పడుతూ పవర్ గేమ్ ప్రారంభిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఎన్నికల సంఘం వంటి చట్టబద్ధ సంస్థలు చివరి క్షణాల్లో చేతులెత్తేసే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఆటలో ఎవరు పైచేయి సాధిస్తే వారికి కొంతమేరకు ప్రయోజనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.అధికారపార్టీకి అన్నిరకాల వనరులు అందుబాటులో ఉంటాయి. ఏది కోరినా ఏదో రూపంలో చేసి పెట్టే యంత్రాంగం అందుబాటులో ఉంటుంది. ఫలితంగా పార్టీకి , ప్రభుత్వానికి మద్య అడ్డుగీత చెరిగిపోయింది. ఓటర్ల జాబితాలు, ఆధార్ కార్డులు, వివిధ రకాల ప్రభుత్వ లబ్ధిదారుల సమాచారం ప్రయివేటు సంస్థ చేతిలో పెట్టేశారు. ఆ సంస్థ ప్రత్యేక యాప్ రూపొందించి దానిని తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా అందచేస్తోంది. అనుసంధానిస్తోంది. పార్టీని, ప్రభుత్వాన్ని, కార్యకర్తలను, ప్రజలను కలగాపులగం చేసి టీడీపీ లబ్ధికి అనుగుణంగా వ్యవస్థను తయారు చేసేశారు. ఇది చట్టబద్ధమా? కాదా? అంటే సరైన సమాధానం దొరకదు. అసలు దీనిని తప్పుగానే ప్రభుత్వం గుర్తించ నిరాకరిస్తోంది. ప్రభుత్వ ప్రయోజనం పొందిన ప్రతి ఒక్కరూ తమ పార్టీకే ఓటు వేసేలా చూసుకోవాలనే అత్యాశతో అడ్డదిడ్డంగా వ్యవహరిస్తోంది టీడీపీ.తెలుగుదేశం శ్రేణులు, వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించి వేస్తోందనే భావనతో వైసీపీ అడ్డదారి వెదుక్కొంటోంది. టీడీపీ సానుభూతిపరులుగా భావిస్తున్న వారి ఓట్లను తొలగించాలంటూ ఆన్ లైన్ లో వేలాది దరఖాస్తులను ఎన్నికల సంఘానికి పంపిస్తోంది. దాదాపు ఎనిమిది లక్షల ఓట్ల తొలగింపునకు సంబంధించి దరఖాస్తులు ఈ మేరకు ఎన్నికల సంఘం వద్దకు చేరాయి. వీటిలో చాలావరకూ హైదరాబాదులో నివాసముంటూ ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు ఉన్నవారే. హైదరాబాదులో ఉంటున్నప్పటికీ సొంతరాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు ఓటును తమ స్వస్థలాల్లో కొనసాగించుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో ఇటువంటి వారి వల్ల తమ పార్టీకి నష్టం చేకూరిందని వైసీపీ అంచనా. ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది . ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేస్తే ఎలాగూ సంబంధిత వ్యక్తులు హైదరాబాదులో ఉంటారు కాబట్టి కచ్చితంగా వారి ఓట్లు తీసేస్తారనేది వైసీపీ భావన. దీంతో తెలుగుదేశం పార్టీ అప్రమత్తమైపోయింది. రాయలసీమ జిల్లాలకు చెందిన వైసీపీ సానుభూతిపరులు, హైదరాబాదులో ఉంటున్నవారి వివరాలు సేకరించి తొలగింపునకు పెద్ద ఎత్తున దరఖాస్తులు అందచేస్తోంది టీడీపీ.ఆంధ్రప్రదేశ్ లో రెండు పార్టీల కొట్లాటలో ఫ్రాక్సీగా టీఆర్ఎస్ రంగప్రవేశం చేసింది. ఏపీలో అధికారంలో లేని వైసీపీ ఇబ్బందులు పడుతోంది. యంత్రాంగం సహకారం లేకపోవడం వల్ల టీడీపీని దీటుగా ఎదుర్కోలేకపోతోంది. ఈ లోటును పూరించేందుకు అధికారిక సహకారం అందించేందుకు టీఆర్ఎస్ పూనుకొంటోంది. డేటా చోరీ కేసు నిజానికి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన సీరియస్ వ్యవహారం కాదు. అయినప్పటికీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. తద్వారా ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు. సమాచారమూ ఏపీ ప్రజలకు సంబంధించినదే. అయినప్పటికీ టీఎస్ సర్కార్ ఈవిషయాన్ని అత్యంత ప్రాధాన్యం కలిగిన కేసుగా స్వీకరించడంలో పక్కా రాజకీయమే పనిచేస్తోంది. నయాదోస్త్ వైసీపీకి నజరానాగా ఈ మాత్రం చట్టబద్ద సహకారం అందించడం తనవంతు బాధ్యతగా టీఆర్ఎస్ భావిస్తోంది.
No comments:
Post a Comment