Breaking News

08/03/2019

పరిషత్ ఎన్నిలకు సిద్ధమౌతున్న ఈసీ

హైద్రాబాద్, మార్చి 8, (way2newstv.in)
జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది. మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు (జడ్‌పీటీసీ), మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ల రిజర్వేషన్ల జాబితాను ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందించాల్సి ఉంటుంది.జెడ్‌పీ చైర్‌పర్సన్ల స్థానాల రిజర్వేషన్లు బుధవారమే ఖరారు అయ్యాయి. మండల పరిషత్ అధ్యక్ష స్థానాల రిజర్వేషన్లతో పాటు జడ్‌పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేషన్ల వివరాలు జిల్లా కలెక్టర్ల నుండి పంచాయతీరాజ్ కమిషనర్‌కు అందాల్సి ఉంది. గత వారంరోజుల నుండి కలెక్టర్లు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు రిజర్వేషన్ల అంశంపై తలమునకలై ఉన్నారు. వాస్తవంగా ఈ నెల ఆరోతేదీలోగానే ఈ జాబితాలను అందించాలని ప్రభుత్వం జిల్లా యంత్రాంగాలను ఆదేశించినప్పటికీ, సాంకేతిక, పరిపాలనాపరమైన ఇక్కట్ల వల్ల కాస్త జాప్యం జరిగిందని తెలిసింది.  జిల్లాల నుండి ఈ వివరాలు వస్తాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. 


 పరిషత్ ఎన్నిలకు సిద్ధమౌతున్న ఈసీ

పంచాయతీరాజ్ కమిషనర్‌కు ఈ వివరాలు అందిన తర్వాత వీటిని పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శికి పంపిస్తారు. ఈ అంశంపై ముఖ్యకార్యదర్శి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో, చీఫ్ సెక్రటరీతో చర్చిస్తారని తెలిసింది. ప్రభుత్వ ఆమోదం లభించిన తర్వాత ఈ జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపిస్తారు. ఈ జాబితా వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ ఎన్నికల ‘నోటిఫికేషన్’ జారీ చేస్తుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ గత సంవత్సరం అక్టోబర్‌లో రూపొందించిన ఓటర్ల జాబితాలను గ్రామ పంచాయతీ ఎన్నికలకోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉపయోగించుకున్నది. కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఓటర్ల జాబితా సవరణ చేసింది. 2019 ఫిబ్రవరిలో తుది ఓటర్ల జాబితా వెల్లడించారు. తాజాగా రూపొందించిన జాబితానే పరిషత్ ఎన్నికలకు ఎస్‌ఈసీ వినియోగించుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి. జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలలో ఉన్న ఓటర్లు మినహా మిగతా ఓటర్లంతా పరిషత్ ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారు. కేంద్ర ఎన్నికల కమిషన్ రూపొందించిన తాజా ఓటర్ల జాబితానుండి పరిషత్ ఓటర్లను వేరు చేస్తారు. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల చివరి వరకు ఈ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ వెంటనే ఓటర్ల జాబితాలను ప్రకటిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాతనే పరిషత్ ఎన్నికల కార్యక్రమం ప్రారంభమవుతుంది. లోక్‌సభ ఎన్నికలకంటే ముందే పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు వీలవుతుందా అన్న అంశంపై ఎస్‌ఈసీ పరిశీలన చేస్తోంది. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాతనే పరిషత్ ఎన్నికలు జరుగుతాయంటా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అంటే లోక్‌సభ ఎన్నికలకు ముందు పరిషత్ ఎన్నికలు జరిగే అవకాశం లేదని స్పష్టమవుతోంది.

No comments:

Post a Comment