Breaking News

19/03/2019

అదిలాబాద్ లో మూడు ముక్కలాట

అదిలాబాద్, మార్చి 19, (way2newstv.in)
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాని వారు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. పార్లమెంట్ ఎన్నికలలో మాత్రం పార్టీలు ఫిరాయిస్తూ పోటీలో నిలిచేందుకు ముందుకు రావడం ఆసక్తికరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి టికెట్లు ఇవ్వబోమని ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖానాపూర్ నుంచి పోటీ చేసిన మాజీ ఎంపి రాథోడ్ రమేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం ఆ పార్టీ నాయకులకు మింగుడు పడడం లేదు. పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సిఆర్‌ఆర్ అనుచరుడిగా ఉంటూ వస్తున్న పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ జాదవ్ ఎంపిగా పోటీ చేసేందుకు ఉత్సాహంతో ఉండగా, పార్టీ టికెట్‌ను ఎమ్మెల్యేగా, జడ్పి చైర్మన్‌గా, ఎంపిగా రాజకీయ అనుభవమున్న రాథోడ్ రమేష్‌కు టికెట్‌ను కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. దీనిపై అలకబూనిన నరేష్ జాదవ్ పార్టీ అధిష్టానం టికెట్లను అమ్ముకుందని తీవ్రమైన ఆరోపణలు చేయడంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేసి ఎంపీగా బరిలో ఉంటానని ప్రకటించారు. ఇక పార్టీ సీనియర్ నేత సిఆర్‌ఆర్ పార్టీ అభ్యర్థికి పూర్తిగా సహకరించక పోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనగా పార్టీ నుంచి పోటీ చేసిన గండ్రత్ సుజాత మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. 

 
అదిలాబాద్ లో మూడు ముక్కలాట


ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎలా కలుపుకొని వెళ్తారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇదిలాఉంటే జిల్లాను శాసించిన మాజీ మంత్రి సిఆర్‌ఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. అలాగే ఆయన అనుచరుడు నరేష్ జాదవ్ సైతం ఎంపి టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం పక్కన పెట్టడంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి జిల్లాలో దయనీయంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తి తమకు పూర్తి అనుకూలంగా మారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక బలమైన అభ్యర్థి లేకపోవడంతో బిజెపి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పలు స్థానాలలో గట్టి పోటీ ఇచ్చిన పార్టీ లోకసభ ఎన్నికలలో సత్తా చాటేందుకు ముందుకు వస్తున్నప్పటికీ అభ్యర్థిని నిలపడంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. పార్టీలో పని చేస్తున్న వారి ప్రభావం అంతగా ఉండక పోవచ్చనే అభిప్రాయంతో ఉన్న కమలం నేతలు కాంగ్రెస్ టికెట్ కోసం చివరి వరకు వేచి చూసి భంగపడిన మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావ్ వైపు మొగ్గు చూపుతోంది. ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ రాష్ట్ర, జాతీయ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. సోయంకే పార్టీ టికెట్ ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం సముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో ఓటమితో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకులు అధికార టిఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు నేరుగా ఉమ్మడి జిల్లాలోని ముఖ్య నేతలతో సంప్రదింపులు ప్రారంభించగా, మరికొందరు తమ అనుచరుల ద్వారా పార్టీలో చేరతామనే సంకేతాలు పంపిస్తున్నారు. రాజకీయంగా అనుభవం కలిగిన మంచి పేరున్న వ్యక్తులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ప్రతిపక్షాలకు చోటు లేకుండా చేయాలనే సంకల్పంతో టిఆర్‌ఎస్ నేతలు పావులు కదుపుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత ఎంపిటిసి, జడ్ పిటిసి, మున్సిపల్ ఎన్నికలు ఉండడం, అధికార పార్టీలో ఈరోజు కాకపోయినా రేపైనా ఏదో ఒక పదవి వస్తుందనే ఆశతో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు సిద్దం కావడం ప్రతిపక్షాలకు మింగుడుపడడం లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు 

No comments:

Post a Comment