Breaking News

19/03/2019

టీ కాంగ్రెస్‌లో కీలక మార్పులు

అదిలాబాద్, మార్చి 19, (way2newstv.in)
తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలకు ముంగిట టీ కాంగ్రెస్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించారు. టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, పలువురు సీనియర్ నాయకులు చర్చించిన తర్వాత 25 నియోజకవర్గాలకు 25 మంది సీనియర్ నేతలను ఇన్‌చార్జిలుగా నియమించారు. మాజీ మంత్రులు, సీనియర్ నేతలకు ప్రాధాన్యం కల్పించారు. జానారెడ్డికి నల్లగొండ, రాజగోపాల్ రెడ్డికి భువనగిరి, భట్టి విక్రమార్కకు ఖమ్మం, డీకే అరుణకు నాగర్ కర్నూలు వంటి నియోజకవర్గాలకు ఇన్‌చార్జులుగా నియమించారు. అయితే, టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి అందులో చోటుదక్కలేదు. 



టీ కాంగ్రెస్‌లో కీలక మార్పులు 

వారిలో రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి నుంచి బరిలో దిగుతున్నారు. ఆయన పోటీ చేసే నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా శ్రీశైలం గౌడ్‌ను నియమించారు. అలాగే, ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు జానారెడ్డికి అప్పగించారు
ఆరుగురిపై బహిష్కరణ 
పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ కాంగ్రెస్ సీరియస్ అయింది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన.. వెళ్తున్న ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సిద్దమైంది. షోకాజ్ నోటీసులను పోస్టులో పంపనున్నట్టు సమాచారం. అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న కారణంగా ఆరుగురు నేతలపై బహిష్కరణ వేటు వేసింది.పార్టీ బహిష్కరణ వేటుపడ్డ వారిలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్యే సోయంబాపూరావు, సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి, అధికార ప్రతినిధులు రమ్యారావు, క్రిశాంక్, ఆదిలాబాద్ లోక్‌సభ టికెట్ ఆశించిన నరేష్ జాదవ్‌ ఉన్నారు.కాగా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించి కోర్టును ఆశ్రయించే ఆలోచనలో కూడా కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. మంగళవారం ఉదయం వరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు వెళ్లనున్నట్టు సమాచారం. తాజా చర్యల ద్వారా పార్టీ నుంచి వలసలకు బ్రేక్ పడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.

No comments:

Post a Comment