నెల్లూరు, మార్చి 5 (way2newstv.in):
కండలేరు వరద కాలువ నుంచి వెలువడుతున్న లీకేజిని అరికట్టేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వ్యయం చేసినా ఫలితం కనిపించడం లేదు. కాలువ భూగర్భంలో వెలువడుతున్న లీకేజి కారణంగా పంట పొలాలు, రైతులకు చెందిన తాటి చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. కండలేరు కాలువకు నీటి విడుదల సమయంలో లీకేజి మరింత ఎక్కువగా వస్తోంది. కాలువ సమీపంలోని పరమానంద ఆశ్రమంలోని నరసింహ స్వామి ఆలయం వెనుక వైపున కాలువకు భారీ గండి పడింది. దీంతో లీకేజి నీరు ఆలయం కట్టడాల కింది నుంచి ఉప్పొంగి ఆలయ కట్టడాలకు ముప్పుగా మారింది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని పునర్ నిర్మించాల్సి వచ్చింది. ప్రస్తుతం కండలేరు వరద కాలువలో అంతర్భాగమైన దక్షిణ కాలువకు 150 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. దీంతో లీకేజి రూపంలో నీరు నిత్యం వస్తోంది. లీకేజి నీరు రోడ్డుపైకి వచ్చి ఆశ్రమం నుంచి సోమశిలకు వచ్చే మార్గంలో ఉన్న రోడ్డుపై ప్రవహిస్తోంది. ఈకారణంగా ఈ రహదారి అధ్వానంగా తయారైంది. అడుగడుగునా గుంతలతో మారడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. ద్విచక్ర వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు.
లీకేజ్ తో తంటాలు (నెల్లూరు)
కండలేరు కాలువ లీకేజిని అరికట్టేందుకు 2013 సంవత్సరం నుంచి ఇప్పటివరకు రూ.10 కోట్లు ఖర్చు చేశారు. పలు చోట్ల గ్రౌటింగ్ పనులు చేపట్టారు. అయినా ఫలితం కనిపించడం లేదని విమర్శలు ఉన్నాయి. అధికారులు పరిశీలన చేసి లీకేజీ నివారణకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
కాలువ నుంచి లీకవుతున్న నీటి కారణంగా అన్నదాతలకు తీరని నష్టం జరుగుతోంది. కాలువ సమీపంలోని భూముల్లో నిత్యం నీరు ఉండడంతో పంటలు పండడం లేదు. మరోవైపు పొలాలకు హద్దులుగా వేసుకున్న తాటి చెట్లు నీటి ఊట కారణంగా నిలువునా ఎండిపోతున్నాయి. అలాగే నీటి కారణంగా కాలువపై మొక్కలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో కాలువ పటిష్టత కోల్పోతోందని రైతులు చెబుతున్నారు. గండ్లు పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గండ్లు పడితే పొలాలు, సమీపంలోని గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది.
కండలేరు కాలువ లీకేజీ అధికారులు, గుత్తేదారులకు కాసులు కురిపిస్తోంది. ఈపేరుతో ఏటా కోట్లాది రూపాయలు కాజేస్తున్నారు. పక్కాగా చేస్తే మళ్లీ డబ్బులు రావని తూతూమంత్రంగా చేస్తున్నారు. కాలువ నిర్మాణంలోనే పనులు నాసిరకంగా చేశారు. తరువాత నీరు వదిలాక లోపాలు బయటపడినా శాశ్వత మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఒక ఏడాది గ్రౌటింగ్ పేరుతో మరో ఏడాది లైనింగ్ పేరుతో నిధులు ఖర్చు చేస్తున్నారు. జేబులు నింపుకుంటున్నారు. గుత్తేదారులతో కుమ్మక్కయిన అధికారులు నిబంధనలు మరిచిపోతున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో మరమ్మతులు పైపైనే జరుగుతున్నాయి. ఫలితంగా నీరు వదిలినప్పుడల్లా నీరు పొంగుతోంది. రైతుల పొలాలను ముంచుతోంది.
No comments:
Post a Comment