Breaking News

04/03/2019

ట్యాంక్ బండ్, పై స్కై వాక్

హైద్రాబాద్, మార్చి 4, (way2newstv.in)
ఎండాకాలం సాయంత్రం వందలాది మంది ఇటు అప్పర్‌ ట్యాంక్‌ బండ్, అటు పీపుల్స్‌ప్లాజా, నెక్లెస్‌రోడ్డుల్లో సాగర అందాలను వీక్షిస్తుంటారు. త్వరలోనే ఈ ట్యాంక్‌బండ్‌ను మరింత అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.ముఖ్యంగా ట్యాంక్‌బండ్ రూపురేఖలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు సచివాలయం నుంచి ట్యాంక్‌బండ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహాం వరకు ఓ స్కైవాక్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది.ఈ స్కైవాక్ కేవలం పాదచారుల కోసం ఏర్పాటు చేయాలని, ఫలితంగా పాదచారులకు భద్రత పెరుగుతుందని స్టడీలో తేలింది. దీనికి తోడు ట్యాంక్‌బండ్ చుట్టూ మొత్తం సుమారు 13 కిలోమీటర్లను పర్యాటక పరంగా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని కూడా ప్రతిపాదన సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఇటు అంబేద్కర్ విగ్రహం నుంచి అప్పర్‌ట్యాంక్‌బండ్, సంజీవయ్యపార్కు, బాపూఘాట్, ఇందిరాగాంధీ విగ్రహం, ఎన్టీఆర్ పార్కు, లుంబినీపార్కుల మీదుగా తిరిగి అంబేద్కర్ విగ్రహం వరకు మోనో రైలును ఏర్పాటు చేస్తే పర్యాటకులు ట్యాంక్‌బండ్ అందాలను వవీక్షించవచ్చునని తెలియజేస్తూ ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్లు సమాచారం. గౌలీగూడలోని ఎంజీబీఎస్ స్టేషన్ నుంచి సికిందరాబాద్‌లోని జేబీఎస్ స్టేషన్ వరకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు నుంచి భారీ ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తెచ్చే యోచనలో బల్దియా ఉంది.

 
ట్యాంక్ బండ్,  పై స్కై వాక్

ఈ భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి నిర్మాణానికి ఎంత వరకు అవకాశముంది, నిర్మించి అందుబాటులోకి తెస్తే ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? ఇందుకు ఎంత వరకు ఖర్చవుతోంది? అసలు ఈ భారీ ఫ్లైఓవర్ నిర్మాణం సాధ్యమేనా? అన్న ఎన్నో ఆసక్తికరమైన అనుమానాలకు తెర దింపేందుకు ఇటీవలే ఓ ఏజెన్సీతో ప్రీ ఫీజుబిలిటీ స్టడీ కూడా చేయించినట్లు తెలిసింది.సుమారు రూ. కోటి వరకు ఈ అధ్యయనానికి వెచ్చించిన జీహెచ్‌ఎంసీ, ఈ భారీ ఫ్లైఓవర్ నిర్మిస్తే ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ వరకు రాకపోకలు సజావుగా సాగుతాయని, అలాగే కింద రోడ్లపై ట్రాఫిక్ సమస్య బాగా తగ్గుముఖం పడుతుందన్న అభిప్రాయంతో కూడిన అధ్యయన నివేదికను ప్రభుత్వానికి పంపించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై ప్రభుత్వం అనుమతిస్తే డీటైల్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను సిద్దం చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారుల ద్వారా తెలిసింది. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలను పర్యాటక పరంగా, హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింభించేలా అభివృద్ది చేయాలని, ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ వరకు భారీ ఫ్లైఓవర్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై మేయర్ బొంతు రామ్మోహన్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు తెలిసింది.ఇంతటి భారీ వ్యయంతో కూడిన ఈ ప్రతిపాదనపై అధికారులు తొలుత అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ, ఈ పనులన్నీ పబ్లిక్ ప్రైవేటు పార్టనర్‌షిప్(పీపీపీ) పద్దతిన చేపట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం

No comments:

Post a Comment