Breaking News

30/03/2019

ఇంట్లో తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వని వ్యక్తి పార్లమెంటులో ఏం ప్రశ్నిస్తారు

పార్లమెంటు సభ్యురాలు కవిత 
నిజామాబాద్‌ మార్చ్ 30 (way2newstv.in):
గతంలో పదేళ్లు ఎంపీగా ఉన్న మధు యాష్కీ కనీసం ఎంపీ నిధులను కూడా సక్రమంగా ఖర్చు చేయలేకపోయారని కవిత విమర్శించారు. ఇక ఇంట్లో తల్లిదండ్రులకు సైతం గౌరవం ఇవ్వని భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌, పార్లమెంటులో ఏం ప్రశ్నిస్తారని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో నిజాంసాగర్‌ను నిర్లక్ష్యం చేశారని, తెరాస వచ్చాక నిజాంసాగర్‌ కాలువ కోసం రూ.10 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. ఈ సమయంలోనే సింగూరు జలాలను నిజాంసాగర్‌కు తరలించుకున్నామని అన్నారు. కాంగ్రెస్‌, భాజపా సోషల్‌ మీడియా వేదికలుగా అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కవిత సూచించారు. 



ఇంట్లో తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వని వ్యక్తి పార్లమెంటులో ఏం ప్రశ్నిస్తారు

నిజామాబాద్‌ ఎంపీగా తాను ఎన్నో సమస్యలను పార్లమెంటులో లేవనెత్తానని బీడీ కార్మికుల గురించి గతంలో ఎవరైనా పార్లమెంటులో ప్రస్తావించారా? అని ప్రశ్నించారు. పీఎఫ్‌ కార్డు ఉన్న బీడీ కార్మికులందరికీ పింఛను వచ్చే ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు. ఇప్పటికే ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధాప్య పింఛన్లను పెంచామని, వరుస ఎన్నికల దృష్ట్యా మే 1 నుంచి అందరికీ పెంచిన పింఛను అందుతుందని కవిత చెప్పారు. నిజామాబాద్‌ జిల్లా నవీపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కవిత పాల్గొన్నారు. దేశంలో వ్యవసాయానికి ఎక్కడా 24 గంటల కరెంటు ఇవ్వట్లేదని, తెలంగాణలో ఇది సాధ్యమైందని తెలిపారు. దేశం మొత్తం ఈ పరిస్థితి రావాలంటే తన ఒక్క స్థానమే కాకుండా రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రెండేళ్లలో అన్ని గ్రామాల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టడం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఐదేళ్లలో ఏ ఒక్కరూ ఇంకా ఇంటి కోసం దరఖాస్తు చేసుకొనే పరిస్థితి ఉండకూడదనేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. 
ఈ సభలో ఎమ్మెల్యే షకీల్‌తోపాటు జిల్లా తెరాస నేతలు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment