Breaking News

30/03/2019

యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమికి షాక్‌

లక్నో మార్చ్ 30(way2newstv.in):
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కూటమికి షాక్‌ తగిలింది. రెండు రోజుల క్రితం ఎస్పీతో జట్టు కట్టిన నిషద్‌ పార్టీ.. కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి రితేశ్‌ నిషద్‌ ఓ ప్రకటన చేశారు.‘‘మహారాజ్‌గంజ్‌ సీటు విషయంలో ఇరు పార్టీల మధ్య వివాదం నెలకొంది. అక్కడి అభ్యర్థి నిషద్‌ పార్టీ గుర్తుపై పోటీ చేయాలని మేం కోరాం. కానీ అందుకు సమాజ్‌వాదీ పార్టీ అంగీకరించలేదు. మా పార్టీ నేతల పేర్లు కూటమి అభ్యర్థుల జాబితాలో ఉంటాయని భావించాం. కానీ అఖిలేశ్‌ యాదవ్‌ ఎక్కడా మా నాయకుల పేర్లను ప్రకటించలేదు’’ అని రితేశ్‌ తెలిపారు. కార్యకర్తలు ఎస్పీ గుర్తుపై పోటీ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది పార్టీ వీడారన్నారు. దీంతో ఎస్పీ నేతలతో చర్చలు జరిపినప్పటికీ.. ఫలితం లేకపోయిందన్నారు.


యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమికి షాక్‌

గత సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో భారీ విజయాన్ని సాధించిన భాజపాకు గోరఖ్‌పూర్ ఉపఎన్నిక చుక్కలు చూపింది. ఎలాగైనా భాజపాను ఓడించాలన్న లక్ష్యంతో చిరకాల ప్రత్యర్థులైన ఎస్పీ-బీఎస్పీ, నిషద్‌ పార్టీ కూటమిగా ఏర్పడ్డాయి. నిషద్‌ పార్టీ నేత ప్రవీణ్‌ నిషద్‌ను ఎస్పీ గుర్తుపై రంగంలోకి దింపి భారీ విజయాన్ని సొంతం  చేసుకున్నారు. అయితే తాజాగా గోరఖ్‌పూర్‌ స్థానాన్ని నిషద్‌ పార్టీకి కేటాయించకపోవండంతో వారు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కూటమిని వీడేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం వారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అయ్యారు. దీంతో గోరఖ్‌పూర్‌ ఎంపీ భాజపాతో జట్టుకట్టే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో నిషద్‌ సామాజిక వర్గం గణనీయ సంఖ్యలో ఉంది. దీంతో ఈ విషయంలో కూటమి కలవరపాటుకు గురవుతోంది. ఈ నేపథ్యంలో అఖిలేశ్‌ వెనక్కి తగ్గి గోరఖ్‌పూర్‌ స్థానాన్ని వారికి కేటాయిస్తారా? లేదా నిషద్‌ పార్టీ భాజపాతో కలుస్తుందా? వేచి చూడాల్సి ఉంది.

No comments:

Post a Comment