Breaking News

28/03/2019

టీడీపీ, జనసేన..మధ్యలో గంటా

విశాఖపట్టణం, మార్చి 28 (way2newstv.in)
నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీ రాజకీయం వేడెక్కింది. ఉత్కంఠగా మారిన ఆంధ్రా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఫలితాలు వచ్చే వరకూ అంచనా వేయలేని పరిస్థితి. గత ఎన్నికల్లో టీడీపికి సపోర్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఈసారి రేసులో నిలిచారు. దీంతో ముక్కోణపు పోరుతో అనివార్యమైంది. మూడు పార్టీలు ఒకదానితో మరొకటి పోటీగా ప్రచారం చేస్తున్నాయి. నేతలు ఒకరిపై మరొకరు వాడివేడిగా విమర్శలు గుప్పించుకుంటున్నారు. జనసేన పార్టీ టీడీపీతో లోపాయికార ఒప్పందం చేసుకుందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. బాబు, పవన్ మధ్య ఒప్పందం కుదిరిందని, ఎన్నికల్లో జగన్‌ను దెబ్బతీయడానికి ఇద్దరూ ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతునిచ్చి తప్పు చేశాను. ఈసారి ఆ తప్పు చేయను.. ఒంటరిగా బరిలోకి దిగుతున్నా. ఓటమైనా.. గెలుపైనా ఒంటరి పోరే’ అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. కానీ టీడీపీకి జనసేన బీ-టీమ్ అనే విమర్శలొస్తున్నాయి. కేటీఆర్, జగన్, మోదీ ఒక్కటేనని చంద్రబాబు ఎప్పటి నుంచో విమర్శిస్తున్నారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహా విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో ఆంధ్రా వాళ్లను కొడుతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం అయ్యాయి. జనసేన కోసం టీడీపీ అభ్యర్థుల కేటాయింపుల్లో మార్పులు చేసిందన్న వాదన వినిపిస్తోంది. 


టీడీపీ, జనసేన..మధ్యలో గంటా

ఈ వాదనలు, ఆరోపణల సంగతి అలా ఉంచితే.. ఇరు పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల విషయమై ఆసక్తికరమైన అంశాలు ప్రచారంలో ఉన్నాయి. గత ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసిన మంత్రి గంటా శ్రీనివాస రావు ఈసారి విశాఖ ఉత్తరం నుంచి బరిలో దిగుతున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా పసుపులేటి ఉషాకిరణ్ పోటీ చేస్తున్నారు. ఆమె భర్త ఆకుల మురళీ కృష్ణ గంటాకు సన్నిహితుడని ప్రచారం ఉంది. కానీ ఉషా కిరణ్ గతంలో వైఎస్ఆర్సీపీలో జిల్లా మహిళా అధ్యక్షురాలిగా పని చేశారు. రాష్ట్ర కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. విశాఖ ఉత్తరం నుంచి టికెట్ విషయమై జగన్ నుంచి హామీ రాకపోవడంతో ఆమె వైఎస్ఆర్సీపీని వీడి జనసేనలో చేరారు. పవన్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. భీమవరంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గంటా శ్రీనివాస రావు వియ్యంకుడు. గాజువాకలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు గంటా సన్నిహితుడు. దీంతో ఉద్దేశపూర్వకంగానే పవన్ ఈ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తోంది. 2009లో పల్లా శ్రీనివాస రావు పీఆర్పీ తరఫున విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేశారు. దగ్గుబాటి పురందేశ్వరి చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. మంత్రి నారాయణ నెల్లూరు అర్బన్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయనపై జనసేన నుంచి కేతంరెడ్డి వినోద్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నారాయణ గెలవడం కోసం రెడ్డి ఓటు బ్యాంకును చీలేందుకే జనసేన కేతం రెడ్డికి సీటిచ్చిందనే ప్రచారం ఉంది. విశాఖ జిల్లా మాడుగుల నుంచి అన్నదమ్ములిద్దరూ టీడీపీ, జనసేనల నుంచి బరిలో నిలిచారు. గవిరెడ్డి రామానాయుడు టీడీపీ తరఫున పోటీ చేస్తుండగా.. గవిరెడ్డి సన్యాసి నాయుడు జనసేన నుంచి బరిలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ టికెట్ రాకపోవడంతో ఆయన జనసేనలో చేరారు. మరో విశేషం ఏంటంటే.. వీరి సోదరి సుజాత అలియాస్ రమ్య శ్రీ వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆమె జగన్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. భీమిలిలో టీడీపీ నుంచి టీడీపీ అభ్యర్థిగా సబ్బం హరి పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున అవంతి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. అనకాపల్లి సిట్టింగ్ ఎంపీ అయిన ఆయన ఈ మధ్యే టీడీపీని వీడి జగన్ పార్టీలో చేరారు. భీమిలి నుంచి జనసేన తరఫున పంచకర్ల సందీప్ పోటీ చేస్తున్నారు. ఈయన యలమంచిలి టీడీపీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకి వరుసకు సోదరుడు అవుతాడు. పంచకర్ల రమేష్ బాబు ప్రజారాజ్యం పార్టీ తరఫున పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గంటా వర్గంలోని నేతల్లో ఆయనొకరు. దీంతో కావాలనే భీమిలి నుంచి జనసేన తరఫున ఆయన సోదరుణ్ని బరిలో దింపారని ప్రచారం చేస్తున్నారు. 

No comments:

Post a Comment