Breaking News

21/03/2019

రైతులకు పొగ (ప్రకాశం)

ఒంగోలు, మార్చి 21 (way2newstv.in): 
పొగాకు రైతులు అదృష్టం పరీక్షించుకునే సమయం ఆసన్నమైంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుందో లేదోనన్న ఆందోళన రైతన్నలను వెంటాడుతోంది. ఒకవైపు వర్షాలు లేక, మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆంక్షల నేపథ్యంలో ఈ సారైనా కష్టాల నుంచి గట్టెక్కుతామా అన్న అనుమానం రైతుల్లో నెలకొంది. ఈ నెల 22వ తేదీ నుంచి దక్షిణ ప్రాంత తేలికనేలల వేలం కేంద్రాల్లో ప్రారంభంకానున్న వేలం ప్రక్రియలో రైతన్న నెగ్గుతాడా లేక వ్యాపారులు లాభపడతారా అనే సంశయం నెలకొంది.
జిల్లాలో అత్యధికంగా పొగాకు పండించే ప్రాంతాల్లో కందుకూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ మేరకు పండించిన పంటను వేలం కేంద్రాల ద్వారా విక్రయించేందుకు దూబగుంట, పామూరు రోడ్డు ప్రాంతాల్లో వేలం కేంద్రాలు(కందుకూరు-1, 2) ఏర్పాటుచేశారు. కందుకూరు-1 కేంద్రం పరిధిలో 62 గ్రామాల రైతులను 11 క్ల్లస్టర్లుగా విభజించారు. కందుకూరు-2 వేలం కేంద్రం పరిధిలో 52 గ్రామాల రైతులను 8 క్లస్టర్లగా విభజించి వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లుచేశారు. దీంతో పాటు అనధికారిక పొగాకు మొత్తం కలిపి కందుకూరు వేలం కేంద్రాల పరిధిలో సుమారు 16 మిలియన్‌ కిలోల ఉత్పత్తి వచ్చినట్లు తెలుస్తోంది. 


రైతులకు పొగ (ప్రకాశం)

తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పొగాకు సాగుపై రైతులు ఆశలు వదులుకున్న తరుణంలో ఈశాన్య రుతుపవనాలు వారిలో ఆశలు రేపాయి. అరకొరగా కురిసిన వర్షాలను ఆధారంగా చేసుకుని డిసెంబర్, జనవరి నెలల్లో ఒక తడికైనా సరిపడా వర్షం కురవకపోతుందామని కందుకూరు డివిజన్‌లో భారీగా పొగాకు పంట సాగుచేశారు. రూ.2 వేలు వెచ్చించి పొగాకు నారు మూటను కొనుగోలు చేసి సాగు ప్రారంభించారు. అనంతరం ఇప్పటి వరకు ఒక్క జల్లు కూడా పడిన దాఖలాలే లేకపోవడంతో సాగు మధ్యలోనే పొగాకు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. కొందరు రైతులు పంటలను కాపాడుకునేందుకు ట్యాంకర్లు ద్వారా నీటిని కొనుగోలు చేసి అందించారు. మరికొంతమంది వందల మీటర్ల దూరంలో ఉన్న బోర్లు, కుంటలు, బావుల ద్వారా ఇంజిన్లు సహాయంతో పంటకు తడులు అందించారు. ఎకరాకు ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తే నాణ్యమైనది రెండు, లోగ్రేడ్‌ నాలుగు క్వింటాళ్లు వచ్చే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎకరానికి సుమారు 60 ట్యాంకర్ల నీటిని ఒక తడిగా అందించేందుకు రూ.20 వేలు వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లోగ్రేడ్‌ రూ.100కు తగ్గకుండా కొనుగోలు చేస్తేనే తమకు ఫలితం ఉంటుందని రైతులు విజ్ఞ్ఞప్తి చేస్తున్నారు. రెండేళ్లుగా వ్యాపారులు నాణ్యత, విదేశాల్లో సంక్షోభం సాకులతో ధరలు పతనమవడంతో వారు నష్టపోయారు. గతేడాది పండించిన పొగాకు సరాసరిన హైగ్రేడ్‌ పొగాకు కిలో రూ.145, మధ్యరకం రూ.110, లోగ్రేడ్‌ రూ.70 పలికింది. దీంతో అన్నిగ్రేడులు కలిపి కిలో పొగాకు సరాసరిన రూ.120 పలికింది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు, పెరిగిన కూలీ ఖర్చులు, బ్యారన్‌ కౌలు, భూముల కౌలు పెరిగిన నేపధ్యంలో రైతు కిలో పొగాకు పండించేందుకు రూ.120-రూ.130 ఖర్చు అయిందని, ప్రస్తుతం అసలు కూడా దక్కే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
ఏటా పొగాకు సాగు ప్రారంభం, ముగిసే సమయంలో రైతులు, రైతు సంఘం నాయకులతో బోర్డు అధికారులు సమావేశాలు నిర్వహించడం.. వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరిలోనే వేలం ప్రారంభిస్తామని హామీలివ్వడం పరిపాటిగా మారింది. అయితే వారి హామీలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. గతేడాది మార్చి 8వ తేదీన వేలం ప్రారంభమవగా, ఈ సారి  ఇవాళ్టి నుంచే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అసలే నాణ్యత అరకొరగా వచ్చిందని ఆందోళన చెందుతున్న రైతులకు వేలం ఆలస్యం కావడం మరో గుదిబండలా మారింది. కర్ణాటకలో కొనుగోళ్లు పూర్తి కాలేదనే సాకు చెబుతూ అధికారులు వేలాన్ని ఆలస్యం చేస్తున్నారని రైతు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. వేలం ఆలస్యమైనా వ్యాపారులందరూ వేలంలో పాల్గొని రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

No comments:

Post a Comment