Breaking News

21/03/2019

పల్లీలతో కన్నీళ్లే..(వరంగల్)

వరంగల్, మార్చి 21 (way2newstv.in): ఆరుగాలం కష్టపడి పండించిన వేరుసెనగ పంటను మార్కెట్‌లో విక్రయించడానికి వెళ్తే పెట్టిన పెట్టుబడి కూడా తిరిగిరాని దుస్థితి నెలకొంది. ప్రభుత్వం క్వింటాలు పల్లీకి మద్దతు ధర రూ.4890 ప్రకటించింది. ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు సరాసరి రూ.4 వేలు మాత్రమే ఇస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే మద్దతు ధరకు అమ్ముకోవచ్చని రైతులు ఆశపడ్డారు. నేటికీ ఉమ్మడి జిల్లాలో ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. తప్పని పరిస్థితిలో వచ్చిన కాడికి తెగనమ్ముకుంటున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు ఖరీదు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో వేరుసెనగ సాధారణ సాగు విస్తీర్ణం 20,411 హెక్టార్లు ఉండగా ఈ ఏడాది సుమారు 14,521 హెక్టార్లలో సాగు చేశారు. ఉమ్మడి జిల్లాలోని తొర్రూరు, నెల్లికుదురు, కేసముద్రం, నెక్కొండ, మరిపెడ, మహబూబాబాద్‌, జఫర్‌గఢ్‌, పాలకుర్తి, గూడూరు, దేవరుప్పుల, ధర్మసాగర్‌, రాయపర్తి, వర్ధన్నపేట, నర్సింహులపేట, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్‌, కురవి, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో అధికంగా పంట సాగు చేశారు. సెప్టెంబరులో విత్తనాలు వేసిన తరువాత ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రైతుల అంచనాలు తారుమారయ్యాయి. చీడపీడలు ఆశించడంతో దిగుబడి సగానికి సగం తగ్గింది. సాధారణంగా ఎకరం విస్తీర్ణంలో 10 క్వింటాలు వరకు దిగుబడి వస్తుంది. 


పల్లీలతో కన్నీళ్లే..(వరంగల్)

ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రెండు నుంచి మూడు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తుంది. గతంలో ఎకరం సాగు చేయడానికి రూ.10 వేలు పెట్టుబడి పెట్టగా.. పెరిగిన విత్తనాలు, ఎరువులు, కూలీల ధరతో ఇప్పుడు రూ.25 వేల వరకు అవసరమవుతోంది. అంత ఖర్చు పెట్టి ఎకరం విస్తీర్ణంలో పండించిన పంటను విక్రయిస్తే రూ.10 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు దిగాలు చెందుతున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి దిగుబడి సగానికి సగం తగ్గింది. పండిన కొద్దిపాటి పల్లీని అమ్ముకోవడానికి మార్కెట్‌కు వెళ్తే వ్యాపారులు ధరను భారీగా తగ్గించి ఖరీదు చేస్తున్నారు. నిరుడు ఇదే సీజన్‌లో క్వింటాలుకు సరాసరి రూ.5 వేలు ధర పలికింది. ఈ ఏడాది సరాసరి రూ.3,500 మాత్రమే పలుకుతుంది. కేంద్ర ప్రభుత్వం ధర క్వింటాలుకు రూ.4890 ప్రకటించింది. ఈ పంటను దేశవ్యాప్తంగా నాఫెడ్‌  కొనుగోలు చేస్తుంది. మన రాష్ట్రంలో మార్క్‌ ఫెడ్‌ ఈ ప్రక్రియ చేపడుతుంది. ఇంతవరకు ఎక్కడా ఖరీదు చేపట్టలేదు. ఇప్పటికే రైతులు సుమారు 50 శాతం పంటను వ్యాపారులకు విక్రయించి నష్టపోయారు. ప్రభుత్వం స్పందించి మార్క్‌ఫెడ్‌ సంస్థను రంగంలో దింపి మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాల్సిన అవసరముంది. ఏటా విత్తన ధరను పెంచుతూ పోతున్న సర్కారు ఆ స్థాయిలో మద్దతు ధరను మాత్రం పెంచడం లేదు. క్వింటాలు మద్దతు ధర గత సంవత్సరం రూ.4450 ఉండగా ఈ ఏడాది రూ.440 పెంచి రూ.4890 చేసింది. మద్దతు ధర రూ.వందల్లో పెంచుతుండగా విత్తన ధరను మాత్రం రూ.వేలల్లో పెంచుతున్నారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో ఈనెల ఆరంభంలో క్వింటాలుకు రూ.5300 పలికిన ధర రోజురోజుకు పడిపోతూ రెండు రోజులుగా క్వింటాలుకు గరిష్ఠంగా రూ.4186 కనిష్ఠంగా రూ.3759 మాత్రమే పలుకుతుంది. సరాసరి క్వింటాలు పల్లికాయ ధర రూ.4 వేలు పలుకుతుంది. ఇప్పటివరకు కేసముద్రం మార్కెట్‌లో 10794 క్వింటాళ్లు పల్లికాయ విక్రయించారు. క్వింటాలుకు రూ.890 చొప్పున సుమారు రూ.96,06,660 నష్టపోవాల్సి వచ్చింది.

No comments:

Post a Comment