Breaking News

30/03/2019

ఈశాన్యంపై దృష్టి పెట్టిన కమలం...

న్యూఢిల్లీ, మార్చి 30 (way2newstv.in)
ఈశాన్య రాష్ట్రాలు ప్రధాన జనజీవన స్రవంతికి ఎక్కడో దూరంగా మారుమూలన విసిరేసినట్లు ఉంటాయి. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ ప్రాంతాలు వార్తల్లోకి ఎక్కుతుంటాయి. అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడో, రాజకీయ అస్థిర పరిస్థితులు ఏర్పడినప్పుడో ఈ ప్రాంతాలు వెలుగులోకి వస్తుంటాయి. సాధారణ పరిస్థితుల్లో ఈ ప్రాంతాల గురించి పట్టించుకునే వారుండరు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల సమరం ఇక్కడ కూడా కన్పిస్తోంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు, ప్రధాన జాతీయపార్టీలు అస్త్రశస్త్రాలు సమకూర్చుకుంటున్నాయి. శక్తియుక్తులను కూడదీసుకుంటున్నాయి. ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. సిక్కింతో కలుపుకుని ఈశాన్య భారతంలో ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి. మొత్తం 25 లోక్ సభ స్థానాలున్నాయి. వీటిల్లో కనీసం 20కి పైగా తన ఖాతాలో వేసుకోవాలన్నది కమలనాధుల కోరిక. ఇందుకోసం ఈ ప్రాంత ఇన్ ఛార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కార్యరంగంలోకి దిగారు.ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చుకుని ఒక రూపం తీసుకు వచ్చారు. 


ఈశాన్యంపై దృష్టి పెట్టిన కమలం...

ఈశాన్య భారతంలో సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్, మిజోరాం రాష్ట్రాలున్నాయి. వీటిల్లో అసోం ఈ ప్రాంతంలో గుండెకాయ వంటిది. ఇక్కడ 14 లోక్ సభ స్థానాలున్నాయి. గత లోక్ సభ ఎన్నికల్లో ఏడు స్థానాలను కమలనాధులు కైవసం చేసుకున్నారు. మొత్తం ఈ ప్రాంతంలో ఎనిమిది స్థానాల్లో పార్టీ గెలుపొందింది. మరో 8 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సీపీఎం రెండు, మిగిలిన స్థానాలను ప్రాంతీయ పార్టీలు గెలుచుకున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని ఒక స్థానం నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు విజయం సాధించారు. అసోంలోని 14 స్థానాల్లో బీజేపీ ఏడు, కాంగ్రెస్ 3, ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఒక స్థానంలో ఇండిపెండెంట్ గెలుపొందారు. అరుణాచల్ ప్రదేశ్ లోని రెండు స్థానాల్లో ఒకదాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మణిపూర్ లోని రెండు స్థానాలూ హస్తం పార్టీ వశమయ్యాయి. మేఘాలయలోని రెండు సీట్లలో ఒక చోట కాంగ్రెస్, మరోచోట నేషనల్ పీపుల్స్ పార్టీ విజయం సాధించాయి. నాగాలాండ్ లోని ఏకైక స్థానాన్ని నాగా పీపుల్స్ ఫ్రంట్ కైవసం చేసుకుంది. సిక్కింలోని ఏకైక స్థానాన్ని సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ గెలుచుకుంది. అసోం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర ల్లో బీజేపీ అధికారంలో ఉంది. మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ లలో బీజేపీ మిత్రపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి. సిక్కింలో పవన్ కుమార్ చామ్లింగ్ నాయకత్వంలోని సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ గత రెండున్నర దశాబ్దాలుగా రాజ్యమేలుతోంది. మిజోరాం ప్రాంతీయ పార్టీల చేతుల్లో ఉంది. మొత్తం 8 రాష్ట్రాల్లోని 25 లోక్ సభ స్థానాల్లో కనీసం 22 స్థానాలను గెలుచుకోవాలన్నది కమలం పార్టీ లక్ష్యం. మోదీ హవా తగ్గుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉత్తరాదిలో కోతపడే సీట్లను దక్షిణాది, ఈశాన్య ప్రాంతాల సీట్లతో భర్తీ చేసుకోవాలన్నది పార్టీ ఉద్దేశ్యం. ఇందులో భాగంగా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఇటీవల ఈశాన్య రాష్ట్రాలను సందర్శించారు. స్థానిక ప్రాంతీయ పార్టీలతో 2016లో ఏర్పాటు చేసిన నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్ కూటమిలోకి వచ్చేందుకు పలు ప్రాంతీయ పార్టీలను ఒప్పించారు. ముఖ్యంగా 1956 నాటి జాతీయ పౌరసత్వ చట్టానికి చేసిన సవరణలతో ఈ ప్రాంతంలో బీజేపీపై వ్యతిరేకత పెరిగింది. ఇందుకు నిరసనగా అసోం లోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం లో భాగస్వామి అయిన అసోం గణపరిషత్ వైదొలిగింది. ఆ పార్టీ అధినేత అతుల్ బోరా తదితరులను రామ్ మాధవ్ బుజ్జగించి ప్రభుత్వంలో కొనసాగేలా చేశారు. పౌరసత్వ చట్టంపై బీజేపీ, ఏజీపీ ల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. అసోంలోని బోడో పీపుల్స్ ఫ్రంట్, త్రిపురలోని ఇండిజీనిస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపురతో పాటు నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనల్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ, సిక్కిం క్రాంతి కార్ మోర్చా తదితర పార్టీలతో రామ్ మాధవ్ జరిపిన చర్చలు ఫలమంతమయ్యాయి.ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఎదురులేని హస్తం పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ ప్రాంతంలో కనీసం ఒక్క రాష్ట్రంలోనూ అధికారంలో లేదు. గత ఏడాది చివర్లో జరిగిన ఎన్నికలలో ఏకైక రాష్ట్రం మిజోరాం నూ కోల్పోయింది. అంతకు ముందు మణిపూర్, మేఘాలయ ఎన్నికలలో పార్టీ ఓడిపోయింది. 2016లో అసోం అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడింది. మణిపూర్, అసోం లో వరుసగా మూడు దఫాలుగా అధికారంలో ఉన్న హస్తం పార్టీ ఆ ఎన్నికల్లో పునాదులను కోల్పోయింది. ఇటీవల ఈ ప్రాంతాంలో పర్యటించిన పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పనికాదు. ఈ ప్రాంతంపై కన్నేసిన కమలానికి,కాంగ్రెస్ బలహీనంగా ఉండటం కలిసొచ్చే అంశమే. ఇదే అవకాశంగా తీసుకుని ముందుకు వెళుతుంది.

No comments:

Post a Comment