Breaking News

30/03/2019

తండ్రి కూతుళ్లు... తల్లి కొడుకులు... భార్య భర్తలు

విజయవాడ, విశాఖపట్టణం మార్చి30(way2newstv.in)
రాజకీయాలకు…రక్తసంబంధానికి లింకు ఉంటుంది ఎక్కడైనా…? అదే సమయంలో రాజకీయాలకు, రక్తసంబంధాలకు విలువే ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న ఎన్నికలను పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది. భార్య అయినా …భర్త అయినా… కూతురయినా… తండ్రి అయినా… రాజకీయాల్లో తాము గెలవాలన్న లక్ష్యంతో ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేయడానికి సిద్దమవుతారనడానికి ఏపీ ఎన్నికలే సాక్ష్యం. అరకు పార్లమెంటు స్థానంలో తండ్రీకూతుళ్లు పోటీపడుతుంటే, విశాఖ పార్లమెంటు స్థానంలో వరసకు తల్లి కొడుకులు పోటీ పడుతుండటం విశేషం.అరకు పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ బరిలో ఉన్నారు.ఆయనకు కాంగ్రెస్ తో సుదీర్ఘ అనుబంధంఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నో పదవులు అనుభవించిన కిశోర్ చంద్రదేవ్ ఈ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరి అరకు ఎంపీ టిక్కెట్ ను తెచ్చుకున్నారు. ఇక ఇదే స్థానం నుంచి ఆయన కూతురు శృతీదేవి కూడా బరిలో ఉన్నారు. తమది అనాదిగా కాంగ్రెస్ కుటుంబమని, కాంగ్రెస్ పార్టీకి అన్యాయంచేసి తండ్రి వెళ్లిపోయినా తాను మాత్రంపార్టీని వీడనంటున్నారు. 


తండ్రి కూతుళ్లు... తల్లి కొడుకులు... భార్య భర్తలు

ఆమె కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా అరకు పార్లమెంటు స్థానంలో బరిలో ఉన్నారు.ఇక విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి వస్తే భారతీయ జనతా పార్టీ తరుపున మాజీ కేంద్ర మంత్రి పురంద్రీశ్వరి పోటీ చేస్తున్నారు. అయితే ఇదే స్థానం నుంచి పురంద్రీశ్వరికి కుమారుడు వరసయ్యే శ్రీ భరత్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. శ్రీభరత్ పురంద్రీశ్వరి సోదరుడు, సినీనటుడు నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు కావడం విశేషం. వరుసకు కొడుకు అయ్యే శ్రీభరత్ తో చిన్నమ్మ పోటీ పడుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరూ వేర్వేరు పార్టీల నుంచి ఒకే స్థానం నుంచి పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.కృష్ణా జిల్లాలో రసవత్తర పోరు నెలకొంది. జిల్లాలోని పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భార్యభర్తలు బరిలోకి దిగారు. మాజీ మంత్రి కొలుసు పార్థసారథి వైకాపా నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన భార్య కమల స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలవడం విశేషం.ఈ నియోజవర్గం నుంచి మొత్తం 13 మంది బరిలో దిగుతున్నట్లు పేరొన్నారు. పార్థసారథి భార్యకు కమలకు బెల్టు గుర్తు కేటాయించారు. ఆమె కుమారుడు నితిన్‌ కృష్ణ కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే, నామినేషన్ల పరిశీలనలో అధికారులు అతని పేరును తొలగించారు. ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు వైసీపీ అభ్యర్థి పార్థసారథికి మధ్య ప్రధాన పోటీ ఉంది. జనసేన అభ్యర్థులు ఇక్కడ నేరుగా పోటీ చేయడంలేదు. ఆ పార్టీ మద్దతుతో బీఎస్పీ అభ్యర్థి లంకా కమలాకర్ రాజు బరిలో నిలుచున్నారుఇదిలా ఉంటే పురంద్రీశ్వరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విశాఖపట్నం నుంచి పోటీ చేస్తుంటే, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకాశం జిల్లా పర్చూరు శాసనసభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో ఉన్నారు. తొలుత కుమారుడు హితేశ్ చెంచురామ్ నే పర్చూరు నుంచి పోటీ చేయించాలనుకున్నా ఆయనకు అమెరికా పౌరసత్వం ఉండటంతో దగ్గుబాటి తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేయాల్సి వచ్చింది. ఇలా భార్యా భర్తలు చెరొక పార్టీ నుంచి పోటీ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ కుటుంబాల్లో ఎవరిది గెలుపైనా…. ఆ ఫ్యామిలీకి ఒక పదవి ఖాయంగా కన్పిస్తుంది.

No comments:

Post a Comment