దుబాయ్, మార్చి 11, (way2newstv.in)
“చేసుకున్నోడికి చేసుకున్నంత” అన్నది పాత తెలుగు సామెత. పొరుగుదేశమైన పాకిస్థాన్ కు ఇది చాలా చక్కగా వర్తిస్తుంది. భారత వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్న ఈ దాయాది దేశం ఇప్పటి వరకూ అనేక సార్లు అంతర్జాతీయ వేదికలపై అభాసుపాలైంది. హేతుబద్ధత విధానాలు లేకుండా, అదే పనిగా భారత్ ను నిందించడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా పేరుప్రతిష్టలు కోల్పోయింది. తాజాగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ (ఓఐసీ) సమావేశంలో అపరిపక్వతతో వ్యవహరించి అప్రతిష్టను మూటగట్టుకుంది. ముస్లిం దేశాల సమావేశానికి తొలిసారిగా భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ను ఆహ్వానించడాన్ని జీర్ణించుకోలేని ఇస్లామాబాద్ ఇష్టారాజ్యంగా వ్యవహరించి అందరికీ దూరమైంది. ఈ సదస్సులో వివేకవంతమైన ప్రసంగం చేసిన సుష్మాను అందరూ అభినందించగా పాక్ బహిష్కరించడం గమనార్హం.ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ అంతర్జాతీయ కూటమి. 1969లో ఆవిర్భవించిన ఈ సంస్థలో 57 ముస్లిం దేశాలకు సభ్యత్వం ఉంది. ఇందులో పాక్ ఒకటి. ఈ దేశాల జనాభా 1.8 బిలియన్లు. ముస్లిందేశాల ప్రయోజనాలను, హక్కులను పరిరక్షించడం, కాపాడుకోవడం దాని లక్ష్యం. రెండు, మూడేళ్లకు ఒకసారి ఈ సంస్థ సమావేశాలు జరుగుతుంటాయి.
అబుదాబీలో పాకిస్తాన్ కు భారత్ చుక్కలు
ఓఐసీ ఆవిర్భవించి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో ఈసారి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను గౌరవ అతిధిగా ఆహ్వానించారు. భారత్ కు సంబంధించినంత వరకూ ఇది విశేష పరిణామం. కాశ్మీర్ సమస్యను సాకుగా చూపి పాక్ ఒత్తిడితో ఇంతకాలం ఓఐసీ భారత్ ను దూరం పెట్టింది. ఇది కొత్తేమీ కాదు. గతంలో 1969లో మొరాకో రాజధాని “రబత్” లో జరిగిన సదస్సుకు భారత్ ప్రతినిధిగా వెళ్లిన నాటి కేంద్రమంత్రి ఫక్రూద్దీన్ ఆలి అహ్మద్ వెళ్లారు. అయితే పాకిస్థాన్ అభ్యంతరం చెప్పడంతో ఆయన వెనుదిరిగి వచ్చారు. భారత్ ముస్లిం దేశం కాకపోయినా ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా గల దేశంగా సభ్యత్వం కావాలంటూ 2006లో అప్పటి ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ చేసిన ప్రయత్నాలను పాక్ కుటిల బుద్ధితో అడ్డుకుంది. అప్పటి నుంచి ఓఐసీ, భారత్ మధ్య సంబంధాలు లేవు. తాజాగా ఓఐసీ తన వైఖరిని మార్చుకుంది.కాశ్మీర్ సమస్య పేరుతో పాక్ మెప్పు కోసం బారత్ ను దూరం పెట్టడంలో అర్థం లేదని భావించింది. ప్రతి ఓఐసీ సమావేశంలోనూ పాక్ కాశ్మీర్ సమస్య పేరుతో భారత్ పై దుమ్మెత్తి పోయడాన్ని సభ్య దేశాలు హర్షించలేకపోయాయి. పాక్ పన్నాగాల నుంచి, కుయుక్తుల నుంచి మేల్కొని ఇందులో కీలకదేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సదస్సుకు సుష్మాస్వరాజ్ ను ఆహ్వానించాయి. పుల్వామా ఘటన నేపథ్యంలో ఈ ఆహ్వానం పంపడం భారత్ పట్ల, పాకిస్థాన్ పట్ల మారుతున్న ఓఐసీ వైఖరికి నిదర్శనం. 130 కోట్ల భారత్ జనాభాలో రమారమి 20 కోట్ల మంది ముస్లింలున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ ముస్లిం దేశంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో ముస్లింలు లేరు. భారతీయ ముస్లింలు సంఖ్యాపరంగా మైనారిటీలు. అయినా ఇక్కడ వారి పట్ల ఎలాంటి వివక్షత లేదు. అన్ని హక్కులు, సౌకర్యాలు, రాయితీలు పొందుతున్నారు. ప్రపంచంలోని ఏ ఇతర ముస్లిం దేశంలోనూ ఈ పరిస్థితి లేదు. కాస్త ఆలస్యంగా అయినా వాస్తవాలను గ్రహించిన ఓఐసీ భారత్ కు రెడ్ కార్పెట్ పర్చింది.అబుదాబిలో జరిగిన సదస్సుకు హజరైన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అచ్చమైన భారతీయతకు నిదర్శనంగా నిలిచారు. నుదుట కుంకుమ బొట్టు, సంప్రదాయక ఆహార్యంతో సదస్సుకు హాజరైన ఆమెకు ఘనస్వాగతం లభించింది. సూటిగా, సరళమైన భాషలో సాగిన ఆమె ప్రసంగం ఆహుతులను ఆకట్టుకుంది. భారత్ వైఖరిని, వారిని ప్రభావవంతంగా వినిపించి ప్రశంసలు అందుకున్నారు. 17 నిమిషాల ప్రసంగంలో ఎక్కడా పాక్ పేరును ప్రస్తావించనప్పటికీ, అందరికీ అర్థమయ్యేలా పదునైన విమర్శలు చేశారు. ఆధునిక ప్రపంచంలో ఉగ్రవాదం ఏ ఒక్క దేశం సమస్య కాదని, యావత్ మానవాళి ఎదుర్కొంటున్న సమస్య అని విశ్లేషించారు. దాన్ని ఎదుర్కొనడంలో అందరూ కలసి రావాలని విజ్ఞప్తి చేశారు. పవిత్ర ఖురాన్ గ్రంధంలోని సూక్తులను ప్రస్తావిస్తూ ఇస్లాం శాంతికి మారుపేరని వ్యాఖ్యానించారు. అల్లాకు ఉన్న 99 పేర్లలో ఏ ఒక్కటీ హింసకు ప్రతీకగా ఉండదని గుర్తు చేశారు. మతం వేరు, ఉగ్రవాదం వేరని, తమ పోరాటం ఉగ్రవాదం పైనేనని స్పష్టం చేశారు. భిన్న సంస్కృతులు, ఆచారాలు, వ్యవహరాలు, ఆహారపు అలవాట్లు ఉన్నప్పటీకీ భారత్ లో అన్ని వర్గాలు, మతాల ప్రజలు సామరస్య జీవనం కొనసాగిస్తున్నారని, ఇది భారత్ గొప్పతనమని వివరించారు. ప్రతిభావంతమైన సుష్మా ప్రసంగం ఓఐసీ ఆహుతులను ఆకట్టుకుంది. మొత్తానికి తన ప్రసంగం ద్వారా సుష్మా చెరగని ముద్రవేశారు. పరోక్షంగా పాక్ వైఖరిని ఎండగడుతూ భారత్ గొప్పదనాన్ని వివరించారు
No comments:
Post a Comment