Breaking News

07/03/2019

బెజవాడ రాజకీయాలు వేడెక్కాయి

విజయవాడ, మార్చి 7, (way2newstv.in)
సాధారణ ఎన్నికలు ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. రాజకీయంగా చైతన్యవంతమైన విజయవాడ నగరంలో ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా తొలిసారిగా ఈ దఫా ప్రధాన రాజకీయ పక్షాలన్నీ దాదాపు తమ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేయటంతో ఎన్నికల నోటిఫికేషన్ జారీకి ముందుగానే డబ్బు వెదజల్లుతూ ఒక విడత ఇంటింటి ప్రచారాన్ని ముగించేశారు. అధికార తెలుగుదేశం పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు తాజా అభ్యర్థులుగా దాదాపు ఖరారయ్యారు. తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్, సెంట్రల్ నుంచి బొండా ఉమామహేశ్వరరావు డివిజన్ల వారీగా కార్యాలయాలు ప్రారంభించి గడపగడపకు తెలుగుదేశం పేరిట రోజూ పర్యటిస్తున్నారు. మధ్యమధ్యలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో జలీల్ ఖాన్ స్థానంలో ఆయన కుమార్తె, విద్యావంతురాలు షబానా ఖాతూన్ అభ్యర్థిత్వం ఖరారవటంతో తన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఇక ప్రధాన ప్రతిపక్షం వైకాపా తరపున సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైనట్లుగానే పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. 


బెజవాడ రాజకీయాలు వేడెక్కాయి

దానికి తగ్గట్టే వీరిద్దరూ ప్రతిరోజూ ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలుస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. సెంట్రల్ సీటు ఆశిస్తూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఆఖరి క్షణంలో భంగపాటుకు గురై ఏకంగా పార్టీనే వీడటంతో విష్ణుకు ఎదురులేకుండా పోయింది. ఇక ఆర్యవైశ్య వర్గానికి చెందిన వెలంపల్లికి పోటీగా నగరాల వర్గానికి చెందిన పోతిన వెంకటప్రసాద్ తనకు సీటు ఖరారైనట్లు, తనను గెలిపించాలంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇక తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి అభ్యర్థిత్వం ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న రాష్ట్ర కార్యదర్శి, కార్పొరేటర్ బొప్పన భవకుమార్ సీటు ఆశిస్తూ తన ప్రచారం తాను చేసుకుంటూపోతున్నారు. ఇక జనసేన, వామపక్షాల మధ్య మూడు సీట్లపై సర్దుబాటు జరిగినట్లే భావిస్తున్నారు. సెంట్రల్‌లో సీపీఎం రాష్ట్ర నేత చిగురుపాటి బాబూరావు మూడు పార్టీల అభ్యర్థిగా ప్రచారం చేసుకుపోతున్నారు. పశ్చిమ సీటుకు సీపీఐ తరపున నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, కార్యవర్గ సభ్యుడు జీ కోటేశ్వరరావు పోటీ పడుతుంటే తాజాగా రాష్ట్ర కార్యదర్శి, బీసీ వర్గానికి చెందిన కే రామకృష్ణ పేరు బలంగా వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో పశ్చిమలో జరుగుతున్న అన్ని సభలు, సమావేశాల్లోనూ ఆయన పాల్గొంటున్నారు. తూర్పులో జనసేన తరపున పలువురు సీటు ఆశిస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నియోజకవర్గ కన్వీనర్ కిలారి దిలీప్ అభ్యర్థిత్వం ఖరారైంది. పశ్చిమలో నగర అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, మార్వాడి వర్గం నుంచి వినోద్ జైన్, పీయూష్ జైన్, ఉత్తమ్‌చంద్ భండారీ, సెంట్రల్ నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తురగా నాగభూషణం, మాజీ అధ్యక్షుడు మొవ్వల వెంకట సుబ్బారావు, సీనియర్ నేత ఉప్పలపాటి శ్రీనివాసరాజు, తూర్పు నుంచి యాసం గణేష్, రవీంద్రరెడ్డి, న్యాయవాది తోట శివనాగేశ్వరరావు పోటీపడుతున్నారు. ఇదిలావుంటే పోతిన వెంకట మహేష్ ఎంతోకాలంగా జనసేన పశ్చిమ సీటు ఆశిస్తూ బాగానే ఖర్చుచేశారు. కొన్ని మాసాలుగా మాజీ కార్పొరేటర్, బీసీ వర్గానికి చెందిన కోరాడ విజయకుమార్ ఇండిపెండెంట్‌గా పోటీలో ఉంటానంటూ ఇప్పటికే తొలివిడత ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా చేయిచాచి అడిగిన వారికి లేదనకుండా సహాయపడుతూ తనదైన ముద్ర వేసుకున్నారు. అవకాశమొస్తే టీడీపీ, లేదా వైకాపా నుంచి సిద్ధమేకాని ఎలాంటి పరిస్థితుల్లోనూ పోటీకి దూరం కాబోనని కోరాడ ఘంటాపథంగా చెబుతున్నారు. ఏదిఏమైనా వేసవి ఎండలు ముదరక ముందే ఈ మూడు నియోజకవర్గాల్లో రాజకీయాలు క్రమేణా వేడెక్కుతున్నాయి.

No comments:

Post a Comment