Breaking News

06/03/2019

9న వైసీపీలో చేరుతున్నాం.. విజయవాడ ఎంపీ సీటు కోరతాం’

ప్రాధాన్యం లేకే పార్టీ మారాం
దాసరి జైరమేష్ 
ఉంగుటూరు (కృష్ణాజిల్లా ) మార్చి 6, (way2newstv.in)
తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలందించానని, పార్టీ ఫండ్ రూపంలో ఎంతో సొమ్మును ధారాదత్తం చేశానని, కానీ ఆ పార్టీలో మా కుటుంబానికి సరైన ప్రాధాన్యం లేదని విజయ ఎలక్ట్రికల్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జైరమేష్ అన్నారు. మండలంలోని ఆముదాలపల్లి గ్రామం తన సోదరుని స్వగృహంలో ద్వితీయ శ్రేణి నాయకులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జైరమేష్ మాట్లాడుతూ చంద్రబాబుపై తనకున్న అక్కసు వెళ్లగక్కారు. ప్రజాసేవ చేద్దామన్న ఆకాంక్షతోనే తాను వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నట్లు తెలిపారు. తాము తీసుకున్న నిర్ణయం సరైనదో, కాదో కార్యకర్తలే తెలపాలని చెప్పారు. తన సోదరుడు డాక్టర్ దాసరి వెంకటబాలవర్ధనరావు ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి నిబద్ధతతో కూడిన నాయకుడిగా సేవలందించారని, ఆయనకు కూడా ఆ పార్టీలో సముచిత స్థానం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 9వ తేదీ అమరావతి రాజధాని తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి స్వగృహంలో ఆయన్ను కలిసి ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. 


 9న వైసీపీలో చేరుతున్నాం.. విజయవాడ ఎంపీ సీటు కోరతాం’

అలాగే విజయవాడ పార్లమెంటు స్థానాన్ని కోరనున్నట్లు ప్రకటించారు. జైరమేష్ సోదరుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకట బాలవర్ధనరావు మాట్లాడుతూ అన్న వెంటే తానుంటానని స్పష్టం చేశారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో తాను పార్టీ నియమనిబంధనలకు కట్టుబడి పని చేశానన్నారు. అన్న జైరమేష్ సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల అభిమానాన్ని చూరగొన్నామన్నారు. కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు తమను పక్కనపెట్టి అవకాశవాద రాజకీయాలకు తెరలేపుతున్నారన్నారు. తాను కూడా తెలుగుదేశం పార్టీలో ఇమడలేకపోతున్నానని, త్వరలోనే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. తమ విధానాలు, ఆలోచనలు నచ్చిన వారికి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు మీ వెంటే మేముంటామని తెలిపారు. గన్నవరం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ సేవామిత్రల పేరుతో యాప్ను సృష్టించి సర్వే చేయించి వేరే పార్టీకి ఓటేస్తామని చెప్పిన వారి పేర్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోతామేమోన్న భయంతో ఆయన కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవ చేశారు. ఈ సారి వైసీపీ అధికారం చేపట్టడం ఖాయమని జగన్ సీఎం అవ్వడం తధ్యమని జోస్యం చెప్పారు. పార్టీ అభివృద్ధికి పాటుపడిన వారిని పక్కనపెట్టి అనర్హులను అందలమెక్కించటం చంద్రబాబుకు అలవాటేనని దుయ్యబట్టారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులకు తమ నాయకుడు జగన్మోహనరెడ్డి ఎల్లప్పుడూ సముచిత స్థానం కల్పిస్తారన్నారు. ఈ సందర్భంగా దాసరి సోదరులను వెంకట్రావు అభినందించారు. సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన సుమారు 400 మంది కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు పాల్గొని దాసరి సోదరులకు తమ పూర్తి మద్దతు తెలియజేశారు.

No comments:

Post a Comment