Breaking News

22/02/2019

అంతా దోపిడీయే.. (కర్నూలు)

కర్నూలు, ఫిబ్రవరి 22 (way2newstv.in):
ప్రకృతి వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. నదులు, వంకలు, వాగుల్లో ఇసుక మాయమవుతోంది. అధికార పార్టీ అండతో కొందరు స్వార్థపరులు రేయింబవళ్లు ఇసుక తరలిస్తూ.. భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం ఇలాకాలోనే ఇసుక దందా సాగుతుండడం గమనార్హం. ఇటీవలే వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లె వద్ద అధికార పార్టీ నాయకుడి ఇసుక ట్రాక్టర్‌ రాంగ్‌రూట్‌లో వచ్చి ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. అయినా భూగర్భ గనుల శాఖ గానీ, రెవెన్యూ శాఖ అధికారులు గానీ స్పందించకపోవడంతో ఇసుకాసురులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు సైతం పెద్దగా స్పందించడం లేదు. నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి తూతూమంత్రంగాకేసులు పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారు.


అంతా దోపిడీయే.. (కర్నూలు)

పత్తికొండ నియోజకవర్గంలోని కృష్ణగిరి మండలంలో ఇసుకాసురులు చెలరేగిపోతుండడంతో హంద్రీ నదితో పాటు వంకలు స్వరూపాన్ని కోల్పోతున్నాయి. ఇసుక మాయమై..భారీగా గుంతలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా రానున్న రోజుల్లో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదముంది. తాగునీటికి కూడా కటకట తప్పదు! మండలంలో హంద్రీ, పాల హంద్రీ నదులతో పాటు వంకలు కూడా అధికంగా ఉన్నాయి. వీటి నుంచి కొందరు గ్రామస్థాయి నాయకుల అండతో ఇసుకను తరలిస్తున్నారు. దాదాపు ఐదేళ్లుగా అక్రమ రవాణా నిరాటంకంగా సాగిపోతోంది. మన్నెకుంట, ఎర్రబాడు, ఎస్‌హెచ్‌ ఎర్రగుడి గ్రామాల సరిహద్దులో నాణ్యమైన ఇసుక లభిస్తోంది. పాల హంద్రీ ఉన్న పుట్లూరు, కొసనాపల్లి, చెరుకులపాడు, తొగర్చేడు, టి.గోకులపాడు గ్రామాలతో పాటు కంబాలపాడు, కోయిలకొండ, చిట్యాల గ్రామాల వద్దనున్న వంకల్లోనూ ఇసుక నిల్వలు ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి రోజూ 60కి పైగా ట్రాక్టర్ల ఇసుక తరలిపోతోంది. డోన్, బేతంచెర్ల, వెల్దుర్తి పట్టణాల్లో ఇసుకకు మంచి డిమాండ్‌ ఉంది. ట్రాక్టర్‌ లోడు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు పలుకుతుండడంతో అక్రమార్కులు కాసుల పంట పండించుకుంటున్నారు. నెలకు రూ.70 లక్షల దాకా కొల్లగొడుతున్నారు.ముఖ్యంగా కంబాలపాడు, కోయిలకొండ, చిట్యాల గ్రామాలు నిత్యం ట్రాక్టర్ల మోతతో దద్దరిల్లుతున్నాయి. ప్రమాదాలు జరుగుతాయన్న భయంతో గ్రామస్తులు రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. పనులకు వెళే రు తమ పిల్లలను ఇంటి వద్ద వదిలిపోలేని పరిస్థితి.
ఆయా గ్రామాల పరిధిలో ఇసుకను తీసుకెళ్లేందుకు పంచాయతీల అనుమతి తప్పనిసరి. పంచాయతీలకు రాయల్టీ చెల్లించి తీసుకెళితే.. ఆ డబ్బుతో గ్రామాలను అభివృద్ధి చేసుకునే వీలుంటుంది. కానీ ఏ పంచాయతీకి నయా పైసా చెల్లించడం లేదు. ఇసుక రవాణాతో ఇప్పటికే గ్రామాల్లో తాగు, సాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పలు గ్రామాల్లో ఇసుక రవాణాను అడ్డుకునేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాజకీయ పలుకుబడి, దౌర్జన్యాలతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. రెవెన్యూ అధికారులు ఏమాత్రమూ పట్టించుకోకపోగా.. పోలీసులు మాత్రం అడపాదడపా దాడులతో సరిపెడుతున్నారు. ఇంతకుమించి ముందుకెళ్లేందుకు రాజకీయ ఒత్తిళ్లు అడ్డుపడుతున్నాయి. వంకల పొడవునా పొలాలు ఉన్న రైతులు వారిస్తున్నా ఏమాత్రమూ లెక్కచేయకుండా ఇసుకను తరలిస్తున్నారు. దీనివల్ల కంబాలపాడు, తొగర్చేడు, ఎస్‌హెచ్‌ ఎర్రగుడి, ఆలంకొండ, ఎర్రబాడు, మాదాపురం, గుడెంపాడు, అమకతాడు, మన్నెకుంట తదితర గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోరుబావులు ఎండిపోతుండడంతో రైతులు నష్టపోతున్నారు.

No comments:

Post a Comment