Breaking News

01/02/2019

స్మగ్లింగ్ పై 'స్కానింగ్' నజర్

 నిర్మల్, ఫిబ్రవరి 01, 2019 (way2newstv.in)
అటవీ ప్రాంతాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. అయినప్పటికీ కొందరు అక్రమార్కులు అడవుల విధ్వంసాన్ని యథేచ్ఛగా కొనసాగించేస్తున్నారు. అటవీ ప్రాంతంలోని వృక్షాలను నరికేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కలప స్మగ్లింగ్ ను చాలా సీరియస్ గా తీసుకున్న సర్కార్ బాధ్యులపై కఠిన చర్యలకు ఏమాత్రం వెనకాడమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అక్రమార్కులు ఎంతటి వారైనా వదలొద్దని అటవీ, పోలీసు శాఖలకు స్పష్టంచేసింది. ప్రభుత్వ ఆదేశాలకు సంబంధిత అధికార యంత్రాంగం కూడా చర్యలు ప్రారంభించింది. అడవుల్లో అక్రమార్కుల ఆగడాలు అరికట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రజలను కూడా చైతన్యవంతులను చేస్తూ అడవులను కాపాడుకోవాల్సిన ప్రాధాన్యతను వివరిస్తోంది. ఇదిలాఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ, పోలీసు శాఖలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. నిఘా పెంచినా స్మగ్లర్లు గుట్టుచప్పుడు కాకుండా కలపను ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నారు. అడవుల్లోని భారీ వృక్షాలను కలపగా మార్చి జోరుగా వ్యాపారం నిర్వహిస్తున్నారు.


స్మగ్లింగ్ పై 'స్కానింగ్' నజర్ 

ఈ దందాకు చెక్ పడేలా టోల్‌ప్లాజాల వద్ద టింబర్‌ స్కానర్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వాహనాల్లో రహస్యంగా తరలిస్తున్న కలపను టోల్‌ప్లాజాల వద్ద ఈ స్కానర్లు గుర్తిస్తాయి. వాహనాల నంబర్లను కంప్యూటర్‌లో నమోదు చేయగానే సదరు యజమాని వివరాలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. టింబర్ స్కానర్లు అందుబాటులోకి వస్తే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జోరుగా సాగిపోతున్న కలప అక్రమ రవాణాను అరికట్టగలమని అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే అక్రమార్కులు కొందరు వాహనాల నంబరు ప్లేట్లు మార్చి కలపను తరలిస్తున్నారు. ఈ దందాకు కూడా పూర్తిస్థాయిలో చెక్ పెట్టనున్నారు అధికారులు. పూర్తి సాంకేతిక అంశంతో కూడిన ఈ ప్రయత్నాన్ని ముందుగా టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటుచేయనున్నారు. తర్వాత అన్ని అటవీ చెక్‌పోస్టుల వద్ద టింబర్ స్కానర్లు ఏర్పాటు చేస్తారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా మంచి అటవీ ప్రాంతం ఉంది. అడవుల పరిరక్షణకు కృషి చేయాల్సింది పోయి కొందరు అక్రమార్కులు విధ్వంసం సాగిస్తున్నారు. యథేచ్ఛగా చెట్లు నరికేస్తున్నారు. దీంతో అడవి రూపురేఖలు మారిపోతున్న దుస్థితి. ఈ దందాను అరికట్టేందుకు అటవీశాఖ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లను నిలువరించలేని పరిస్థితి. ఇక సరైన సాంకేతిక సాయం కూడా లేకపోవడం సమస్యాత్మకంగా మారింది. దీంతో అక్రమార్కులు చెట్లు నరికేసి ఆ కలపను వాహనాల్లో టోల్‌ప్లాజాలు, చెక్‌పోస్టులను దాటించేస్తున్నారు. ఈ విషయం తెలిసినా అధికారులు కలప అక్రమ రవాణాను సమర్ధవంతంగా నిలువరించలేకపోతున్నారు.  నిఘా, తనిఖీ బృందాలను ఏర్పాటుచేసినా.. స్మగ్లింగ్‌కు తెరపడడంలేదు. ఈ నేపథ్యంలోనే టోల్‌ప్లాజాల వద్ద టింబర్‌ స్కానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలిగా స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. కొన్నిరోజుల క్రితమే రూ.16.50 లక్షలు విలువచేసే టేకుదుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అడవుల పరిరక్షణకు తాము ఎంతగా కృషిచేస్తున్నా స్మగ్లింగ్ సాగిపోతుండడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. అటవీ, పోలీసుల శాఖల పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తంచేశారు. అంతేకాక స్మగ్లింగ్ కు పాల్పడేవారి బ్యాక్ గ్రౌండ్ ఎలాంటిదైనా వదలొద్దని కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి సూచనలతో అటవీ సిబ్బందికే కాక పోలీసుల్లోనూ ధైర్యం పెరిగింది. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లోని బేస్‌క్యాంపుల్లో ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌, అటవీశాఖ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో నిరంతర గస్తీ నిర్వహించనున్నారు.  

No comments:

Post a Comment