Breaking News

01/02/2019

అయినా..తీరు మారలేదు!

 మంచిర్యాల, ఫిబ్రవరి 01, 2019 (way2newstv.in)
పత్తిపంటకు మంచి మద్దతు ధర ప్రకటించింది కేంద్రం. దీంతో తెలంగాణ రైతులు పత్తి సాగుకే మొగ్గుచూపారు. ప్రతికూల వాతావరణం, తెగుళ్లు, ఇతరత్రా కష్టనష్టాలను తట్టుకుంటూ పంట పండించారు. చివరికి చేతికి వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందనుకున్న రైతన్నలకు నిరాశే ఎదురవుతున్న పరిస్థితి. ప్రభుత్వరంగ సంస్థ సీసీఐకి పత్తిని విక్రయిస్తున్నా రైతులకు నష్టం తప్పడంలేదు. వాస్తవానికి రైతులకు తెలీకుండా సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు చక్కర్లుకొడుతున్నాయి. ఇప్పటికే రూ.9కోట్ల మేర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఎంఎస్‌పీ క్వింటాల్‌కు రూ.5450 చొప్పున ధర పలుకుతోంది. అయితే ఈ స్థాయిలో రైతులు అందుకోలేకపోతున్నారు.


 అయినా..తీరు మారలేదు!

 అక్రమార్కులు దోపిడీ తీరుతెన్నులు మార్చేశారు. సీసీఐ వ్యాపారులు పత్తిని జిన్నింగ్‌ చేయడం వల్ల వచ్చే దూది లెక్కలు తప్పుగా చూపుతున్నారు. ప్రారంభంలోనే క్వింటాల్‌ పత్తిని జిన్నింగ్‌ చేయడం వల్ల దూది శాతం 34.5కిలోలు రాగా.. ఇప్పుడు పెరిగే అవకాశం ఉంది. అయితే అక్రమార్కులు మాత్రం కేవలం 31.50కిలోల చొప్పున దూది వస్తుందని రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. మిగిలినది జిన్నింగ్‌ చేస్తున్న అక్కడి వ్యాపారులకే అమ్ముతున్నారు. ఇలా దాదాపు రూ.9కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని పలువురు పత్తిరైతులు ఆరోపిస్తున్నారు. ఈ సొమ్మును సీసీఐ అధికారులు, జిన్నింగ్‌ వ్యాపారులు పంచుకున్నారని చెప్తున్నారు. సీసీఐ ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోళ్లలో అక్రమాలు అరికట్టేందుకు సమర్ధవంతమైన చర్యలు లేవు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. రైతులు నానాకష్టాలు పడి, అప్పులపాలై సాగు చేస్తున్నారన్న విషయం తెలిసి కూడా అక్రమార్కులు వారిని మోసగిస్తుండడంపై పలువురు మండిపడుతున్నారు. 
సీసీఐ అవినీతిలో కూరుకుపోయినట్లు చాలాకాలంగా విమర్శలున్నాయి. సంస్థ సిబ్బంది రైతుల నుంచి కాక ప్రైవేట్ వ్యాపారుల నుంచీ పత్తి కొనుగోలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఇక రైతులను మోసగిస్తూ అక్రమంగా బోల్డంత సంపాదించుకున్నారన్న విమర్శలు సరేసరి. 2014-15లోనే ఉమ్మడిజిల్లావ్యాప్తంగా సాగించిన పత్తి కొనుగోళ్లలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. సుమారు రూ.400కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. క్వింటాల్‌కు రూ.500 నుంచి రూ.1500 వరకు సీసీఐ, ప్రైవేటు జిన్నింగ్‌ వ్యాపారులు సొమ్ముచేసుకున్నట్లు తేలింది. పత్తి కొనుగోళ్ల అక్రమాలపై దేశవ్యాప్తంగా 21మంది సీసీఐ అధికారులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో ఉమ్మడి జిల్లాలోనే 10మంది ఉన్నారంటే ఇక్కడ అవినీతి ఏరేంజ్ లో జరిగిందో ఊహించుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఈస్థాయి స్కామ్ ఎక్కడా జరగలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే సాగడం గమనార్హం. ఈ అక్రమాలపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఏకంగా సీబీఐయే దర్యాప్తు చేస్తున్నా, నాటి అక్రమాలకు పాల్పడ్డ పలువురిని సస్పెండ్ చేసినా ప్రస్తుత అధికారుల తీరులో మార్పు రాకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. అవినీతి సిబ్బంది ఏమాత్రం జంకు లేకుండా అవకతవకలకు పాల్పడుతున్నారని తమకు పూర్తిస్థాయిలో మద్దతు ధర దక్కడంలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం నాలుగేళ్ల నాటి కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. జిల్లా మార్కెటింగ్‌ శాఖను కేసు గురించి వివరాలు అడగడంతో మరోసారి అలజడి మొదలైంది. నవంబరు 2014 నుంచి 2015 ఏప్రిల్‌ వరకు పత్తి కొనుగోళ్లు సాగిన తీరు, అప్పట్లో ఉన్న ధర లాంటి వివరాలు సేకరిస్తోంది సీబీఐ. ఇక మార్కెటింగ్‌శాఖ కూడా సీబీఐకి నివేదిక ఇచ్చింది. సీబీఐ రంగంలోకి దిగడంతో అక్రమార్కుల్లో టెన్షన్ మొదలైంది.   

No comments:

Post a Comment