Breaking News

06/02/2019

ఊరిస్తున్న అమాత్యపదవులు

 నిజామాబాద్, ఫిబ్రవరి 6, (way2newstv.in)
అందరి చూపు మంత్రివర్గ విస్తరణ పైనే కేంద్రీకృతమై ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో పాటు కేవలం మహమూద్‌అలీ మాత్రమే హోంశాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టేలా అవకాశం కల్పించిన విషయం విదితమే. దీంతో గడిచిన నెలన్నర రోజుల నుండి ఆశావహులంతా మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ కోసం చకోరపక్షుల్లా ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఎల్లారెడ్డి సెగ్మెంట్ మినహా మిగతా అన్ని నియోజకవర్గాల నుండి తెరాసకు చెందిన తాజామాజీలే తిరిగి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుండి అమాత్య పదవిని ఆశిస్తూ ఒకింత ఎక్కువగానే పోటీ కనిపిస్తోంది. సీనియర్, జూనియర్ ఎమ్మెల్యేలు అనేక తారతమ్యం లేకుండా కేబినెట్‌లో స్థానం కోరుకుంటున్న ఆశావహులు ఎవరికి వారు అధినేత కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. 


 ఊరిస్తున్న అమాత్యపదవులు

అయితే ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే తొలివిడతలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు అమాత్య పదవీ యోగం దక్కుతుందా? అన్నది అనుమానంగానే మారిందని పరిశీలకులు అనుమానాలు వెలిబుచ్చుతున్నారు. తొలి మంత్రివర్గ విస్తరణ సందర్భంగా కేబినెట్‌లో 8మందికే స్థానం కల్పించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఇప్పటికే మహమూద్ అలీ కీలకమైన హోంశాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, కేటీఆర్, హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ వంటి వారికి తప్పనిసరిగా తొలివిడతలోనే మంత్రి పదవులను కేటాయించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుండి కూడా కేబినెట్‌లో తొలి విస్తరణలోనే బెర్తును ఖరారు చేయడం అధినేతకు కష్టసాధ్యంగా నిలుస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందులోనూ ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కీలకమైన అసెంబ్లీ స్పీకర్ పదవిని కట్టబెట్టినందున, తొలివిడతలోనే తీవ్రమైన పోటీ నెలకొని ఉన్న తరుణంలోనూ ఇదే జిల్లా నుండి మంత్రివర్గంలోనూ మరొకరికి అవకాశం కల్పించడం కష్టసాధ్యమేనని పేర్కొంటున్నారు. అయితే పార్లమెంటు ఎన్నికలు ముగిసిన అనంతరం చేపట్టనున్న మలివిడత మంత్రివర్గ విస్తరణ సమయంలో ఉమ్మడి జిల్లాకు కనీసం ఒక్క మంత్రి పదవి అయినా దక్కే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయని పేర్కొంటున్నారు. పోచారంనకు స్పీకర్‌గా అవకాశం కల్పించడంతో మిగతా ఆశావహులకు లైన్ క్లియర్ అయినట్లయ్యింది. దీంతో ఆశావహులు ఎవరికివారు అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరికివారు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ కోవలో ప్రధానంగా ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రి పదవిని ఆశిస్తూ తీవ్రంగా పోటీపడుతున్నారని తెలుస్తోంది. బాల్కొండ నుండి వరుసగా రెండవ పర్యాయం అత్యధిక మెజార్టీతో గెలిచిన వేముల ప్రశాంత్‌రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న కామారెడ్డి శాసనసభ్యుడు గంప గోవర్ధన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌లు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. వీరిలో సీఎంకు సన్నిహితుడిగా పేరొందిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వైపు అధినేత మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నప్పటికీ, స్పీకర్‌గా రెడ్డి వర్గానికి చెందిన పోచారంనకు అవకాశం కల్పించిన మీదట అదే సామాజిక వర్గానికి చెందిన మరొకరికి ఉమ్మడి జిల్లా నుండి కేబినెట్‌లో బెర్తు కేటాయిస్తారా? అన్న సందేహాలను సైతం పలువురు వెలిబుచ్చుతున్నారు. అయితే ఇప్పటికే 2014 ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంలోనే వేముల ప్రశాంత్‌రెడ్డికి కేబినెట్ హోదాతో కూడిన మిషన్ భగీరథ వైస్ చైర్మెన్ పదవిని కట్టబెట్టారని, ప్రస్తుతం రెండవ పర్యాయం కూడా ఎన్నికైనందున తప్పనిసరిగా నేరుగా మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని ఆయన అనుచరులు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరోవైపు కామారెడ్డి నుండి మండలి విపక్ష నేత హోదాలో పోటీ చేసిన షబ్బీర్‌అలీని ఓడించి మరోమారు తెరాస ఎమ్మెల్యేగా ఎన్నికైన గంప గోవర్ధన్ కూడా సామాజిక సమీకరణ కోణంలో తనకు మంత్రి పదవి వరించే అవకాశాలు ఉన్నాయని గట్టిగా విశ్వసిస్తున్నారు.

No comments:

Post a Comment