Breaking News

14/02/2019

దిక్కుతోచని రైతన్న (విజయనగరం)

విజయనగరం, ఫిబ్రవరి 14 (way2newstv.in): జిల్లాలో మొక్కజొన్న రైతులు  దీనస్థితిని ఎదుర్కుంటున్నారు. వీరికి ప్రోత్సాహకంగా ప్రభుత్వం ప్రకటించిన నిధులు అందక చివరకు నిరుత్సాహంలో పడిపోతున్నారు. గతేడాది రబీలో మొక్కజొన్న పంటను సాగు చేసిన రైతులకు పంట దిగుబడుల ఆధారంగా క్వింటాలుకు రూ.200 చొప్పున ప్రభుత్వం పోత్సాహకాలను ప్రకటించింది. ఇందుకు అర్హులైన రైతుల జాబితాలను వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేసి పంపారు. ఈ ప్రక్రియ పూర్తయి దాదాపు ఏడు నెలలు కావస్తున్నా రైతులకు ప్రోత్సాహకాలు అందని పరిస్థితి. ఈ నిధులు ఎప్పుడు అందుతాయోనని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూపులు చూడడమే మిగులుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.


దిక్కుతోచని రైతన్న (విజయనగరం)

పెడతామంటే ఆశ..కొడతామంటే భయం ఎవరికైనా ఉంటుంది. జిల్లాలో గత ఏడాది రబీలో మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులను ప్రోత్సాహాకాల పేరుతో ప్రభుత్వం ఊరించింది. ఇందుకు అర్హులను ఎంపిక చేసేందుకు గ్రామాలకు అధికారులను పంపించింది. తీరా వారంతా అర్హుల జాబితాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించి నెలలు గడుస్తున్నా ప్రోత్సాహకాల నిధులు మాత్రం ఇంత వరకు విదల్చలేదు. ఈ నిధుల సంగతి ఏమైందంటూ రైతులు ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పలేని స్థితి వ్యవసాయాధికారులది. గతేడాది రబీలో జిల్లాలో సుమారుగా 17 వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగయ్యింది. దాదాపు 9 లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చాయన్నది అంచనా. రైతులు విస్తారంగా సాగు చేసిన మొక్కజొన్న ఎకరాకు 20-25 క్వింటాళ్ల వరకు దిగుబడులను ఇచ్చింది. పంట బాగా పండినా రైతులకు మాత్రం తగిన గిట్టుబాటు ధర దక్కలేదు. ప్రభుత్వపరంగా ఎక్కడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. పంటను కొనుగోలు చేయడానికి గోదాంలు ఖాళీ లేవని కేంద్రాలను ఏర్పాటు చేయలేదు.
మొక్కజొన్న కొనుగోళ్లులో అంతా వ్యాపారుల హవానే సాగింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లేక పోవడంతో ఇదే అదునుగా వ్యాపారులంతా ధర తగ్గించి రైతులను దగా చేశారు. క్వింటాలుకు రూ.200-300 తగ్గించి రైతుల నుంచి కొనుగోలు చేశారు. వ్యాపారులు ఎక్కడా క్వింటాలు రూ.1100 మించి కొనలేదు. పంటను నిల్వ చేసుకునే సదుపాయం లేక రైతులు వ్యాపారులు చెప్పిందే ధరగా అమ్మకాలు చేసి నష్టపోయారు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని భావించి ప్రోత్సాహకాలు ప్రకటించింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని కారణంగా రైతులకు మద్దతు ధర లభించలేదని భావించి క్వింటాల్కుు రూ.200 చొప్పున ప్రోత్సాహకం ప్రకటించింది.ప్రత్యేక యాప్‌ను రూపొందించి గత ఏడాది జూన్‌ కల్లా మొక్కజొన్న ప్రోత్సాహకాలకు అర్హులైన రైతుల వివరాలను నమోదు చేసి పంచాయతీ కార్యాలయాల్లో రైతుల జాబితాలను ప్రకటించాలని సూచించింది. ఈ ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. వెబ్‌ల్యాండ్‌లో రైతుల పేర్లు, పంట భూముల సర్వే నంబర్లు సరిగ్గా లేక పోవడం, భూములను కౌలుకు తీసుకుని సాగు చేసిన రైతులకు సంబంధించి సమస్యలు రావడం వంటి కారణంగా వీటిన్నంటినీ కూలంకుషంగా పరిశీలించి తుది జాబితాలను సిద్ధం చేసే సరికి వ్యవసాయ అధికారులకు జులై ఆఖరు వరకు సమయం పట్టింది. ఈ వివరాలన్నీ సిద్ధం చేసి వ్యవసాయశాఖ కమిషనర్‌ కార్యాలయానికి పంపారు. వెబ్‌ల్యాండ్‌లో వివరాల్లేని రైతులకు సంబంధించి ప్రత్యేక జాబితాను పంపారు. రైతుల బ్యాంకు ఖాతాలు, ఆధార్‌ వివరాలతో జాబితాలను సిద్ధం చేశారు. వీటి ప్రకారం జిల్లాలో రైతులకు మొక్కజొన్న ప్రోత్సాహకాల నిధులు రూ.18 కోట్లు వరకు అందాల్సి ఉంది. గత ఏడాది నవంబరు లేదా డిసెంబరు నాటికల్లా నేరుగా రైతుల ఖాతాలకే ఈ నిధులు జమవుతాయని చెప్పడంతో రైతులంతా ఆశగా ఎదురు చూశారు. ఈ నిధులు అందితే సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకోవాలని సంబరపడ్డారు. ఇంత వరకు నిధులు జమకాకపోవడం రైతుల ఆశలన్నీ నీరుకారిపోతున్నాయి.

No comments:

Post a Comment