Breaking News

19/02/2019

హమ్మయ్య...శివసేన,కమలం దోస్తి కుదిరింది..

ముంబై, ఫిబ్రవరి 19, (way2newstv.in)
మహారాష్ట్రలో కమలం పార్టీకి మంచి సంకేతాలు కన్పిస్తున్నాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలం పార్టీ ఏ ఒక్క అవకాశాన్నీ జార విడుచుకునేందుకు సిద్ధంగా లేదు. అందుకే తన మిత్రపక్షమైన శివసేనతో సానుకూలంగా వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలియవచ్చింది. మహారాష్ట్రలో గత కొన్నాళ్లుగా శివసేనకు, బీజేపీకి మధ్య పొసగడం లేదు. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అంటేనే శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మండిపడుతున్నారు. అందుకే కొంతకాలం క్రితం తాము వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు శివసేన ప్రకటించింది.
మొత్తం 48 పార్లమెంటు స్థానాలున్న మహారాష్ట్రలో ఇప్పటికే కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలు సీట్ల ఒప్పందం కుదుర్చుకున్నాయి. 


 హమ్మయ్య...శివసేన,కమలం దోస్తి కుదిరింది..

మహారాష్ట్రలో రెండు బలమైన పార్టీలు కావడంతో శివసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేస్తే లబ్ది పొందేది కాంగ్రెస్ కూటమి అనేది వేరే చెప్పనక్కర లేదు.ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఈవిషయం స్పష్టమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొన్ని నెలల క్రితం ఉద్ధవ్ థాక్రే ఇంటికి వెళ్లి చర్చించినా ఫలితం కన్పించలేదు. మోదీ, కేంద్ర ప్రభుత్వంపై శివసేన విరుచుకుపడుతూనే ఉంది. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి విషయాల్లో తీవ్రంగా శివసేన వ్యతిరేకించింది. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ చొరవ తీసుకుని శివసేనతో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. ఈ మేరకు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతలు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ అవగాహన కుదిరిందన్న ప్రచారం మహారాష్ట్రలో జోరుగా సాగుతోంది. మొత్తం 48 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ 25 చోట్ల, శివసేన 23 స్థానాల్లో పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాయి. గత ఎన్నికల్లో శివసేనకు ఇచ్చిన సీటు కంటే ఇప్పుడు ఒకటి అదనంగా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయానికి కూడా ఇద్దరూ కలసి పోటీ చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు.శివసేన, బీజేపీల మధ్య పొత్తు దాదాపు ఖారారు కావడంతో కమలనాధుల్లో జోష్ పెరిగింది. రెండు పార్టీలూ హిందూ ఓటు బ్యాంకునే బలంగా నమ్ముకున్నారు. ఇద్దరూ విడిపోతే రెండు పార్టీలకే నష్టమని థాక్రే కు తెలియంది కాదు. అయితే కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం, మోదీ ఇమేజ్ పడిపోవడంతోనే ఆయన ఒంటరిగా పోటీ చేయాలని ఒక దశలో నిర్ణయానికి వచ్చారు. కానీ ఆర్ఎస్ఎస్ సయితం రంగంలోకి దిగి నచ్చ చెప్పడంతో కొంత థాక్రే దిగివచ్చినట్లు తెలుస్తోంది. శివసేన ఈ పొత్తులపై బహిరంగంగా ఇంకా ప్రకటించకపోయినప్పటికీ రెండు పార్టీలూ వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేస్తాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

No comments:

Post a Comment