Breaking News

19/02/2019

సిక్కింలో ప్రారంభమైన యూబీఐసీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19, (way2newstv.in)
ఈశాన్య భారతంలోని సిక్కిం…పేరుకే చిన్న రాష్ట్రం. కానీ తన ప్రజల కోసం ఆ రాష్ట్రం పెద్ద పెద్ద ఆలోచనలే చేస్తోంది. కులం, మతం, ప్రాంతం, వర్గాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పాటుపడాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం బృహత్కార్యాన్ని తన భుజస్కంధాలపై వేసుకుంది. ఈ ప్రయత్నాలు విజయవంతమయ్యేందుకు త్రికరణ శుద్ధితో, చిత్తశుద్ధితో ముందుకు సాగుతోంది. ప్రజల ఆదాయం, సంపదతో సంబంధం లేకుండా తన వంతుగా ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్కరికీ నెలనెలా కనీస ఆదాయం సమకూర్చాలన్నదే సిక్కిం ప్రభుత్వ ఆలోచన. సంక్షేమ రాజ్యంగా ఇది తన బాధ్యత అని రాష్ట్రంలోని సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం భావిస్తుంది. 


సిక్కింలో ప్రారంభమైన యూబీఐసీ

ఈ పథకం ఉద్దేశ్యం ప్రజలను సోమరిపోతులను చేయడం కానే కాదని, ఎస్.డి.ఎఫ్ నాయకుడు, రెండు దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న పవన్ కుమార్ చామ్లింగ్ స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం తన వంతుగా ప్రజలకు చేయూత అందిస్తోందని, ఆ తర్వాత వారి శక్తియుక్తులు,తెలివి తేటలు ఆధారంగా సంపాదించుకోవచ్చని ఆయన వివరిస్తున్నారు. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం లేదని, కేవలం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. గత రెండు దశాబ్దాలుగా గెలుస్తున్న తనకు ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఈ పథకం అవసరం లేదని చామ్లింగ్ స్పష్టం చేస్తున్నారు.ఒకసారి పథకం పూర్వాపరాల్లోకి వెళితే…. ఆసక్తికరమైన వివరాలు తెలుస్తాయి. పథకం పేరు సార్వత్రిక కనీస ఆదాయ పథకం. అంట ప్రతి పౌరుడికి కనీస జీవనానికి అవసరమైన ఆదాయాన్ని ప్రభుత్వపరంగా అందజేయడం దీని లక్ష్యం. ఈ పథకం కింద కొంత మొత్తాన్ని అందజేస్తారు. ఇదిఎంతన్నది ఇంకానిర్ణయించలేదు. 2017 నాటి ఆర్థిక సర్వే లో ఈ పథకం గురించి ప్రస్తావించారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రి చామ్లింగ్ దాని సాధ్యాసాధ్యాలపై దృష్టి సారించారు. అనేక మంది ఆర్థికవేత్తలతో చర్చలు జరిపారు. ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలోని ఒక ప్రాంతాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తారు. 2022 నాటి కల్లా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నది లక్ష్యం. పథకం అమల్లోకి రాగానే పౌరుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నిర్ణీత నగదు మొత్తాన్ని జమ చేస్తుంది. నిరుద్యోగులు, గృహిణులు, కార్మికులు, రైతులు,కూలీలు.. ఇలా ఎలాంటి తేడా లేకుండా అందరికీ నగదును అందచేస్తారు. ప్రపంచంలో ఏ రాష్ట్రం ఇంతటి సాహసం చేయడం లేదు. ఇంతటి భారీ కార్యక్రమాన్ని భుజాలకు ఎత్తుకోవడం లేదు. మనదేశంలని సంపన్న రాష్ట్రాలు కూడా ఇలాంటి ప్రయత్నం చేయలేకపోతున్నాయి. లక్షల కోట్ల బడ్జెట్ అనిచెప్పుకునే రాష్ట్రాలు, సులభతర వాణిజ్యంలోనెంబర్ వన్ అని చెప్పుకునే రాష్ట్రాలు, సంక్షేమమే తమ ధ్యేయమని ఢంకా భజాయించి చెప్పుకునే రాష్ఠ్రాలు కనీసం ఇలాంటి ఆలోచన చేయలేకపోయాయి. ఏ వర్గం ఓటర్లు ఎక్కువ మంది ఉంటే వారి కోసమే తాయిలాలు, పథకాలు ప్రకటించే రాష్ట్రాలు తప్ప, అందరి సంక్షేమం కోసం ఆలోచించే రాష్ట్రాలు ఒక్కటీ లేవు.పేరుకు చెప్పడానికి…. వినడానికి బాగున్న ఈ పథకం ఆచరణలో ఎంతవరకూ సాధ్యమన్న అంశంపై అనుమానాలు లేకపోలేదు. దీనికి తమ వద్ద ఆలోచనలు ఉన్నాయని చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఉదాహరణకు రాష్ట్రంలో 2300 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఇందులో మూడు, నాలుగు వందల మెగావాట్లకు మించి రాష్ట్ర అవసరాలకు అక్కర్లేదు. మిగిలిన విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు అమ్మడం ద్వారా లభించే ఆదాయంలో ‘‘కనీస ఆదాయ పథకాన్ని’’ అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. పరిస్థితులను బట్టి ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తామని వివరిస్తోంది. చిన్న రాష్ట్రం కాబట్టి అమలు చేయడం అంత కష్టం కాదని ధీమా వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర జనాభా 6,10,577 మాత్రమేనని, చిత్తశుద్ధితో ప్రయత్నిస్తామని సర్కార్ చెబుతోంది. సిక్కిం పేరుకు చిన్న రాష్ట్రమైనప్పటికీ అనేక విషయాల్లో ఇది ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 1998 నుంచి ప్లాస్టిక్ బ్యాగుల నిషేధాన్ని అమలు చేస్తోంది. 98 శాతం అక్షరాస్యతను సాధించి ఎన్నో పెద్దరాష్ట్రాలకు ఆదర్శంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటికీ 30 శాతం పేదరికం ఉండగా, రాష్ట్రంలో అది 8 శాతానికే పరిమితం కావడం విశేషం. రసాయన ఎరువులపై నిషేధం విధించి సేంద్రీయ ఎరువుల సేద్యం సాగిస్తోంది. ప్రతి పౌరుడిని గృహ నిర్మాణ పథకం పరిధిలోకి తెచ్చి అందరికీ ఇళ్లను కట్టి ఇచ్చింది. ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత పథకాలను సమర్థంగా అమలు చేస్తోంది. విద్యుత్ ప్రాజెక్టులు, పర్యాటకం రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులు. రాష్ట్రంలోఉత్పత్తి అయ్యే జల విద్యుత్తులో 90 శాతాన్ని విక్రయించి ఆదాయం సమకూర్చుకోవాలనుకుంటోంది. ఇన్ని విషయాల్లో ఆదర్శంగా ఉన్న రాష్ట్రం కనీస ఆదాయ పథకాన్ని కూడా అమలు చేస్తే దేశానికి మోడల్ గా నిలుస్తుందని సీఎం చామ్లింగ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment