Breaking News

19/02/2019

పాండిచ్చేరిలో

సీఎం వర్సెస్ గవర్నర్
పుదుచ్చేరి, ఫిబ్రవరి 19, (way2newstv.in)
ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన వ్యక్తి. ప్రజల అవసరాలను, సమస్యలను గుర్తించి తక్షణమే స్పందించాల్సింది ముఖ్యమంత్రి… అక్కడి ప్రభుత్వమే. కానీ గవర్నర్ తరచూ జోక్యం చేసుకుంటుంటే….? ముఖ్యమంత్రి ఉన్నా….లేనట్లేనా….? పుదుచ్చేరిలో ఇదే జరుగుతుంది. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వం ఆందోళనలకు దిగుతోంది. నామినేట్ అయి వచ్చిన గవర్నర్ మాత్రం ఆధిపత్యం చెలాయిస్తున్నారు. పుదుచ్చేరిలో లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి, ముఖ్యమంత్రి నారాయణస్వామికి తొలినుంచి పడటం లేదు. కిరణ్ బేడీ పుదుచ్చేరి గవర్నర్ గా నియమితులైన దగ్గర నుంచి ఇదే సమస్య. ఆమె ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యంచేసుకుంటుందని, కేంద్ర చెప్పినట్లు తలాడిస్తున్నారని నారాయణస్వామి ఆరోపిస్తున్నారు.


పాండిచ్చేరిలో

ఐదు రోజులుగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆందోళన చేస్తున్నారు. కిరణ్ బేడీ నివాసముండే రాజ్ నివాస్ ఎదుటే ఆయన తన సహచర మంత్రులతో కలసి ఆందోళనకు దిగారు. సంక్షేమ పథకాలను తాము ప్రవేశపెట్టాలనుకున్నా..దానికి గవర్నర్ నుంచి ఆమోద ముద్ర లభించడం లేదని, వెంటనే వాటిని ఆమోదించకుంటే ఉద్యమాన్ని ఉథృతం చేస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నారు. తమ పరిపాలనలో కిరణ్ బేడీ జోక్యం ఎక్కువయిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారాయణస్వామికి అండగా డీఎంకే కూడా నిలవడంతో పుదుచ్చేరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.నిజానికి ఇదేమీ కొత్త వివాదం కాదు. కొన్ని నెలలుగా కిరణ్ బేడీకి, ముఖ్యమంత్రి నారాయణస్వామి పొసగడం లేదు. కొంతకాలం క్రితం కేంద్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేల చేత కిరణ్ బేడీ ప్రమాణస్వీకారం చేయించడం పెద్ద వివాదమయింది. తమకు తెలియకుండా ముగ్గురు ఎమ్మెల్యేలను కేంద్ర ప్రభుత్వం ఎలా నామినేట్ చేస్తుందని అప్పట్లు నారాయణస్వామి ప్రశ్నించారు. పుదుచ్చేరి నిండా హిట్లర్ కిరణ్ బేడీ అంటూ పోస్టర్లు అతికించారు. అయితే తాను రాజ్యాంగ బద్ధంగానే వ్యవహరిస్తున్నారని కిరణ్ బేడీ చెప్పుకొస్తున్నారు. అప్పట్లో నారాయణ స్వామి మద్రాస్ హైకోర్టును కూడా ఆశ్రయించారు.ముఖ్యమంత్రికి తెలియకుండానే కిరణ్ బేడీ అధికారులతో సమీక్షలు నిర్వహించడాన్ని కూడా అప్పట్లో నారాయణస్వామి తప్పుపట్టారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్ర పతికి సయితం ఫిర్యాదుచేసినా ఫలితం లేదంటున్నారు. అయితే ఈసారి మాత్రం తాము కిరణ్ బేడీ విషయంలో గట్టిగా పోరాడేందుకే నిర్ణయం తీసుకున్నామని నారాయణస్వామిచెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ వివాదాన్ని రాజకీయంగా మార్చేందుకు కూడా కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్న వాదనలు విన్పిస్తున్నాయి. డీఎంకే కూడా రంగంలోకి దిగి మోదీ నిరంకుశ విధానాలకు ఇది ఉదాహరణ అని ఆరోపిస్తోంది. మొత్తం మీద పుదుచ్చేరి వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. మరి కిరణ్ బేడీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనేది వేచి చూడాల్సిందే.

No comments:

Post a Comment