Breaking News

04/02/2019

కార్మిక సంఘాల నిర్వీర్యం కోసమేనా

రాజీనామాలపై రెండో కోణం
నల్గొండ, ఫిబ్రవరి 4, (way2newstv.in)
తెలంగాణ కారుకున్న నాలుగు చక్రాల్లో రెండు చక్రాల వంటి హరీష్, కవిత తమ తమ పదవులకు వెంటవెంటనే రాజీనామాలు చేయటం రాష్ట్ర రాజకీయ వర్గాలను కుదిపేసింది. టీఆర్ఎస్ లో కీలక నేతలు పైగా కేసీఆర్ కుటుంబ సభ్యులై కూడా ఉన్నట్టుండి ఇలా రాజీనామాలు చేయటం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఉన్న హరీష్ రావు మొన్న తన పదివికి రాజీనామా చేయగా.. ఆ వెంటనే రెండు రోజుల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్ష పదవికి కవిత రాజీనామా చేసింది. అయితే ఈ రాజీనామాల వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందా? అనే కోణంలో ప్రస్తుతం చర్చలు ఊపందుకున్నాయి.

 కార్మిక సంఘాల నిర్వీర్యం కోసమేనా

ఈ విషయంలో ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ని బట్టి చూస్తే.. దీని వెనుక కేసీఆర్ హస్తం ఉందని, గులాబీ పెద్ద వేసిన స్కెచ్ లో భాగంగానే కవిత, హరీష్ రావు రాజీనామాలు చేశారని తెలుస్తోంది.తెలంగాణలోని కార్మిక సంఘాలను సంఘాలను నిర్వీర్యం చేయటంలో భాగంగానే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకుంటున్నారు జనం. నిజానికి తెలంగాణ ఉద్యమ సమయంలో కార్మిక సంఘాలు కీలక పాత్ర పోషించాయి. అప్పట్లో ఆర్టీసీ, సింగరేణి, కాంట్రాక్ట్ కార్మికులు, ఎన్జీవోలు, టీజీవోలు, లాయర్లు, డాక్టర్ల సంఘాలు టీఆర్ఎస్ శ్రేణులకు వెన్నుదన్నుగా ఉంటూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లెగిసేలా చేశాయి. ముఖ్యంగా ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ ఉద్యమాన్ని ఎంత తీవ్రతరం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సమయంలోనే ఆర్టీసీలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ పురుడుపోసుకోగా.. దానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గౌరవాధ్యకుడిగా ఉన్నారు. ఇక మరో కీలక కార్మిక సంఘమైన బొగ్గుగని కార్మిక సంఘానికి పెద్దగా కవిత కొనసాగుతూ వచ్చింది. వీరిద్దరూ ఆ సంఘాలను బలోపేతం చేస్తూ.. తెలంగాణ వచ్చిన తర్వాత అందరి జీవితం మారిపోతుందని చెప్పుకుంటూ వచ్చారు.
అయితే ఈ మధ్య కాలంలో ఆర్టీసీ, సింగరేణి సంఘాలు కాస్త అసంతృప్తితో కొన్ని ఆందోళనలకు దిగుతుండటం గమనించవచ్చు. ఈ పరిణామాలు ప్రభుత్వాన్ని టెన్షన్ పెట్టించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దీన్ని ఆదిలోనే అణచాలనే కేసీఆర్ వేసిన మాస్టర్ ప్లాన్ లో భాగమే ఈ రాజీనామాలు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆయా సంఘాలకు శక్తి లేకుండా చేయటానికే కేసీఆర్ ఇలా నిర్ణయించారని అంటున్నారు.

No comments:

Post a Comment