Breaking News

20/08/2018

మళ్లీ నిలిచిపోయిన బొగ్గు గనులు

ఏలూరు, ఆగస్టు 20, (way2newstv.in)
పశ్చిమగోదావరి జిల్లాలో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు తెలియడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి చింతలపూడిపై పడింది.తెలంగాణలోని  సింగరేణి తరహాలో బొగ్గును తవ్వుకోవడానికి అనుమతి కోరుతూ 2015లో రాష్ట్రానికి చెందిన ఏపీఎంఐడీసీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా పంపింది. దీనికి కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి పాలుపోవడం లేదు. మూడేళ్ల నుంచి కృష్ణా జిల్లా సోమవరం, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి కేంద్రంగా బొగ్గు నిక్షేపాలపై జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) నుంచి నిపుణులు సర్వే పనులు ప్రారంభించారు. మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా  చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వరకు 2 వేల నుంచి 3 వేల మిలియన్‌ టన్నుల నల్ల బంగారం ఉన్నట్లు గతంలోనే గుర్తించారు.  మళ్లీ నిలిచిపోయిన బొగ్గు గనులు 

లక్నోకు చెందిన బీర్బల్‌ సహానీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పాలియో బోటనీ అనే సంస్థ 2013లో కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టిన అధ్యయనంలో కృష్ణా జిల్లా సోమవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, టీ నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల మీదుగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు కనుగొంది. ఇతర రాష్ట్రాలలో లభ్యమయ్యే బొగ్గుతో పోల్చితే ఇక్కడ అత్యంత నాణ్యమైన బొగ్గు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అదికూడా భూమి ఉపరితలానికి 500 మీటర్ల లోతులోనే ఈ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని నివేదికలో పొందుపరిచింది. ఇక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభమైతే సంవత్సరానికి 8 వేల మెగావాట్ల చొప్పున 60 సంవత్సరాల వరకు విద్యుత్‌ కొరత రాదని నిపుణులు చెబుతున్నారు. చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30 కిలో మీటర్ల వ్యాసార్ధంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.ముఖ్యంగా రాష్ట్ర విభజన తరువాత ఏపీలో బొగ్గు నిల్వలు బయట పడటం రాష్ట్రం పాలిట వరదాయినిగా మారింది. బొగ్గు తవ్వకాలు ప్రారంభమైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడమేకాక ఉపాధి అవకాశాలుపెరుగుతాయని ఈ ప్రాంత ప్రజలు భావిస్తూ వచ్చారు. వాస్తవానికి తుదిదశ సర్వే పనులు 2016 నాటికే పూర్తికావాలి. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న బొగ్గు నిక్షేపాల అన్వేషణ చివరి దశ సర్వేకు 2016లో రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఈసీఎల్‌), నేషనల్‌ మైనింగ్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ట్రస్ట్‌ (ఎన్‌ఎంఈటీ)లతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 2016 చివరినాటికి అన్వేషణ పూర్తి చేయాల్సి ఉంది. జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా జిల్లాలోని చింతలపూడి మండలం, కృష్ణా జిల్లాలోని సోమవరం ప్రాంతాల్లో మరిన్ని అధునాతన యంత్రాలతో అన్వేషణ చేపట్టాలని భావించడంతో సర్వే ఇంకా పూర్తి కాలేదు. ఇందులో భాగంగా సౌత్‌ వెస్ట్‌ పినాకిల్‌ సంస్థ మరో సంస్థతో కలిసి 120 పాయింట్ల(ప్రదేశాలు)ను గుర్తించి అధునాతన రిగ్గులతో డ్రిల్లింగ్‌ చేపట్టింది. ఈ 120 పాయింట్లలో సుమారు 65 వేల మీటర్ల లోతున బొగ్గు అన్వేషణ చేపట్టి సుమారు 40 వేల మీటర్ల పనులు పూర్తి చేసినట్లు తెలిసింది. అయితే పినాకిల్‌ సంస్థ సర్వే పనుల గడువు ముగియడంతో ప్రసుత్తం ఎంఈసీఎల్‌ సంస్థ ద్వారా చివరి దశ అన్వేషణ పనులు చేపట్టాల్సి ఉంది. పనులు ప్రారంభం కాక ముందే వర్షాలు మొదలు కావడంతో సర్వే ముందుకు సాగడం లేదని సంస్థ సిబ్బంది తెలిపారు.చింతలపూడి ప్రాంతంలో ఉన్న బొగ్గు నిక్షేపాలను వెలికి తీస్తామని 2015లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినా ఆయన ఆశ ఇంత వరకు నెరవేరలేదు. 1964 నుంచి 2006 వరకు సుమారు 4 దఫాలుగా అధికారులు సర్వేలు నిర్వహించారు. ఈ ప్రాంత భూభాగంలో  బొగ్గు నిల్వలు ఉన్నట్లు గతంలోనే ఏపీఎండీసీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా పశ్చిమ, ఖమ్మం సరిహద్దులను ఆనుకుని 2,500 స్క్వేర్‌ కిలో మీటర్ల పరిధిలో ఈ బొగ్గు నిల్వలు విస్తరించి ఉన్నట్లు ప్రభుత్వం వద్ద నివేదిక ఉన్నట్లు తెలిసింది. పశ్చిమ సరిహద్దు, ఖమ్మం జిల్లా రేజర్ల, నారాయణపురం, నుంచి పశ్చిమ గోదావరి జిల్లా గురుభట్లగూడెం, రాఘవాపురం గ్రామాల్లో 400 అడుగుల లోతు నుంచి 1,400 అడుగుల లోతులో సుమారు వెయ్యి అడుగుల మందంతో బొగ్గు తయారైనట్లు నిర్ధారించారు. అయితే సర్వే పనులే ఇంత వరకు పూర్తవ్వలేదు. ఇక బొగ్గు వెలికి తీతకు ఎన్ని సంవత్సరాలు పడుతుందోనని ఈ ప్రాంత వాసులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 

No comments:

Post a Comment