Breaking News

24/07/2018

స్థిరాస్తి జోరు..నిబంధనలకు పాతరు...

నల్గొండ, జులై 24, 2018 (way2newstv.in)  
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి పరిధిలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. అనుమతులు లేకుండానే పలు వెంచర్లు వెలుస్తున్నాయన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఇలాంటి వాటికి స్థానిక నేతల అండదండలు ఉండడంతో సమస్య కొలిక్కిరావడంలేదని పలువురు అంటున్నారు. ప్రభుత్వానికి పన్నులు కట్టకుండానే పలువురు స్థిరాస్తి వ్యాపారం సాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక వెంచర్‌ను నిర్మిస్తే డీటీసీపీ అనుమతి ఉండాలి. అంతేకాక స్థానిక పంచాయతీకి సామూహిక అవసరాలకు భూమిని కేటాయించి, పంచాయతీ పాలకవర్గం నుంచి అన్ని అనుమతులు తీసుకోవాలి. కానీ కొందరు ఇవేవీ ఖాతరు చేయకుండానే వెంచర్లు వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొన్ని వెంచర్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మామూళ్లకు అలవాటుపడే చర్యలు తీసుకోవడంలేదంటున్న వారూ ఉన్నారు. నార్కట్ పల్లి జాతీయ రహదారికి చేరువలో ఉండటం, రవాణా పరంగా అన్ని వసతులు ఉండటంతో ఇక్కడి భూములకు మంచి డిమాండ్ ఉంది. ధర రూ.కోట్లలోనే పలుకుతోంది. పంచాయతీకి ఆదాయ వనరులను తీసుకువచ్చే ఇలాంటి వాటిపై పాలకవర్గాలు దృష్టి పెట్టకపోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. 



స్థిరాస్తి జోరు..నిబంధనలకు పాతరు...

పలువురు స్థిరాస్థి వ్యాపారులు నిబంధనలు పట్టించుకోకుండా వెంచర్లు వేస్తున్నట్లు చాలాకాలంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్డీవో నుంచి నాలా అనుమతి, పంచాయతీ నుంచి ఎన్‌వోసీ లేకుండానే వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుతున్నారని పలువురు అంటున్నారు. ఈ సంగతి తెలిసినా సంబంధిత అధికారులెవరూ పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే మాత్రం రెండు రోజులు హడావుడి చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. వందల ఎకరాల్లో ఉన్న దాదాపు 50 వరకు వెంచర్లు ఎలాంటి నిబంధనలను పాటించలేదన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం వెంచర్‌లో 10 శాతం భూమిని పంచాయతీకి అప్పగించాలి. ఆ స్థలంలో పంచాయతీ కమ్యూనిటీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలలు, మంచినీటి ట్యాంకులు, పార్కులు ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉంటుంది. అన్ని నిబంధనలు పాటిస్తే ఒక్కో వెంచర్‌కు నిర్వాహకులకు సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ఇలా కాకుండా నేతలకు, అధికారులకు కొంత ముట్టజెప్పి వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వెంచర్‌ల నిర్మాణం సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి ఈ అక్రమాలపై కొరడా ఝళిపించాలని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

No comments:

Post a Comment