Breaking News

24/07/2018

మత్స్యకారులకు చేయూత

ఖమ్మం, జులై24, 2018 (way2newstv.in)    
మత్స్యకారుల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ వివిధ చర్యలు తీసుకుంటోంది. ఆర్ధిక దన్నుగా ఉండేందుకు మిషన్ కాకతీయలో భాగంగా పటిష్టమవుతున్న చెరువుల్లో చేపలు పంచుతూ.. వాటి ద్వారా మత్స్యకారులకు ప్రయోజనాలు దక్కేలా చూస్తోంది. అంతేకాక సమీకృత మత్స్యఅభివృద్ధి పథకం ద్వారా వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది. 2017-18, 18-19 ఆర్థిక సంవత్సరాలకు మత్స్యరంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000కోట్లు ఇచ్చింది. ఈ స్కీమ్ లో భాగంగా ఖమ్మం జిల్లాకు రూ.36కోట్లు కేటాయించింది. ఈ నిధుల ద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని అంతా భావిస్తున్నారు. వాస్తవానికి జిల్లాలో 196 నీటిపారుదల చెరువులు, గ్రామ పంచాయతీల పరిధిలో 521 చెరువులు 26,561హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటితో పాటు మత్స్యకారులకే 126 సొంత చెరువులు కూడా ఉన్నాయి. వీరు చెరువుల్లో చేపలను పెంచుతూ జలపుష్పాల ఉత్పత్తికి కృషి చేస్తున్నారు. సమీకృత మత్స్యఅభివృద్ధి పథకంతో వేలాది మత్స్యకారులు లబ్ధి పొందనున్నారు. 



మత్స్యకారులకు చేయూత

సమీకృత మత్స్యఅభివృద్ధి పథకానికి సంబంధించి త్వరలోనే అర్హులను ఎంపిక చేయనున్నారు. ఈ పథకం ప్రధాన లక్ష్యం చేప పిల్లలు, చేపల ఉత్పత్తిని పెంచటం, వేట పరికరాలు అందించటం, మార్కెటింగ్‌, మౌలిక సదుపాయాలు కల్పించటం. వీటితో పాటు మత్స్యకారులకు శిక్షణల ద్వారా నైపుణ్యం పెంచటం, మానవ వనరులను అభివృద్ధి చేయటం ద్వారా మత్స్య రంగాన్ని బలోపేతం చేయటం కోసం నిధులు అందిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా చేపలు పట్టే వారికి ప్రభుత్వం రాయితీపై పనిముట్లు మంజూరు చేస్తుంది. వీటికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. త్వరలోనే అర్హులను ఎంపిక చేస్తారు. జిల్లాలో మత్స్య సంపద అభివృద్ధికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయి. జిల్లాలో 13.89లక్షల మంది జనాభా ఉండగా 15వేల మంది మత్స్యకార కుటుంబాలు సహకార సంఘాల్లో మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. సమీకృత మత్స్యఅభివృద్ధి పథకంతో వేలాది మందికి ప్రయోజనం ఉంటుందని సంబంధిత అధికారులు స్పష్టంచేస్తున్నారు.

No comments:

Post a Comment