Breaking News

09/07/2018

ఎంసెట్ లీకేజీలో కార్పొరేట్స్

ఒంగోలు, జూలై 9(way2newstv.in)
ఎమ్సెట్ పేపర్ లీక్‌లో పెద్దతలకాయల ప్రమేయం ఒక్కొక్కటీ వెలుగు చూస్తోంది. కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాల ప్రమేయం సుస్పష్టమైనా పోలీసులు మాత్రం పెదవి విప్పడం లేదు. పోలీసులు ప్రశ్నించినపుడు 2015 నుండి సందీప్ తనకు తెలుసని వాసుబాబు చెప్పినట్టు సమాచారం. తన కుమారుడికి ఎలాగైనా మెడికల్ సీటు ఇప్పించాలనే లక్ష్యంతో సందీప్‌ను కలిసినపుడు కనీసం ఒకొక్కరి నుండి 36 లక్షలు వసూలుచేయాలని, సీట్లు ఇప్పిద్దామని సందీప్ చెప్పడంతో దానికి అనుగుణంగా కొంత మంది నుండి 9 లక్షలు చొప్పున అడ్వాన్స్ తీసుకుని లీక్ సూత్రదారుడితో చేతులు కలిపినట్టు వాసుబాబు చెప్పారని తెలిసింది. ఇంత వరకూ పోలీసులు 85 మందిని సాక్షులుగా చేర్చారు. అందులో విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఉండటం విశేషం. కాగా నిందితుల సంఖ్య 100కు చేరుకుంది. చివరికి తన కుమారుడికి కర్నాటకలో మెడికల్ సీటును సందీప్ ఇప్పించినట్టు వాసుబాబు పేర్కొన్నారు. పూణే, షిరిడీ, కొల్‌కటా, బెంగలూరు, ముంబై, భువనేశ్వర్ నగరాల్లో క్యాంప్‌లు నిర్వహించిన మాట నిజమేనని ఆయన అంగీకరించినట్టు సమాచారం. దీంతో కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని, వారిని అరెస్టు చేసి విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాలు, బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాజకీయ ప్రమేయం ఉంటే దానిపైనా విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు విద్యార్థి సంఘాలు తమ ఆందోళనను ఉద్ధృతం చేశాయి. ప్రధాన సూత్రదారులను వదిలేసి, కిందిస్థాయి వాళ్లను అరెస్టు చేయడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని, ఇందులో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులు, ప్రభుత్వంలోని పెద్దలను అరెస్టు చేయాలని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద తలకాయలను ప్రభుత్వం కాపాడుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఇప్పటికే కార్పొరేట్ కాలేజీల పాత్ర ఉందని తెలిసి కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు. 



ఎంసెట్ లీకేజీలో కార్పొరేట్స్ 

No comments:

Post a Comment