Breaking News

09/07/2018

పరిశ్రమలెక్కడ..?

కరీంనగర్, జూలై 9 (way2newstv.in)
పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితే అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.. ఈ దిశగా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది.. అయితే పరిశ్రమలకు రాయితీ నిధులను సకాలంలో విడుదల చేయకపోవడంతో ఔత్సాహికుల ఉత్సాహం నీరుగారుతోంది.. పైగా అప్పుల పాలవుతున్నారు.



పరిశ్రమలెక్కడ..? 

తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఎస్‌ఐపాస్‌ అనే నూతన పారిశ్రామిక విధానంను అమల్లోకి తెచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. పరిశ్రమల స్థాపనలో రాష్ట్రంలో కరీంనగర్‌ జిల్లా రెండో స్థానంలో ఉండటం విశేషం.. అయితే ఈ పరిశ్రమల స్థాపన అనంతరం రాయితీ నిధుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.. నూతన పారిశ్రామిక విధానం కింద పెట్టుబడి, విద్యుత్తు, పావలావడ్డీ, భూ కొనుగోలు, బదలాయింపు, తనఖా డ్యూటీ, స్టాంపు డ్యూటీ, వ్యాట్‌ చెల్లింపులు, మౌలిక వసతులు, దళిత, గిరిజనులు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారు.
కరీంనర్‌ ఉమ్మడి జిల్లాలో పెట్టుబడిపై రాయితీ, విద్యుత్తు, పావలావడ్డీ, సేల్‌టాక్స్‌లకు సంబంధించి 2015 నుంచి 2018 ఫిబ్రవరి వరకు దాదాపుగా రూ.178 కోట్లకు పైగా రాయితీ నిధులు రావాల్సి ఉంది. 2015 నుంచి నిధులు రావడం లేదని తెలిసింది. ఇందులో కేవలం గ్రానైట్‌ పరిశ్రమకు సంబంధించి పారిశ్రామిక రాయితీలు రూ.70 కోట్లు.. మిగిలినవి టెక్స్ టైల్స్, రైసుమిల్లులు, కాటన్‌జిన్నింగ్‌ మిల్లులు, కంకర పరిశ్రమలు, ఇతర పరిశ్రమలు, సర్వీస్‌ సెక్టార్‌లవి ఉన్నాయి. సాధారణ విభాగంలో దాదాపుగా 700 దరఖాస్తులు రాగా రూ.125 కోట్ల రాయితీ నిధులు రావాల్సి ఉండగా, ఎస్సీ విభాగంలో 450 పైగా దరఖాస్తులకు రూ.30 కోట్లు, ఎస్టీ విభాగంలో 400 పైగా దరఖాస్తులకు దాదాపుగా రూ.20 కోట్లు రావాల్సి ఉందని తెలిసింది. ఎస్టీ విభాగంలో రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు సంబంధించి ఎక్కువగా ఉన్నాయి. ఈ కేటగిరిలో పరిశ్రమలపై పెట్టుబడిపై రాయితీ నిధులు మంజూరుకాగా వాహనాలకు సంబంధించిన రాయితీ, పావలావడ్డీ రావాల్సి ఉంది. 2015 వరకు సేల్‌టాక్స్‌కింద 50శాతం రాయితీ కల్పించగా ఆ తర్వాత దాన్ని ప్రభుత్వం వంద శాతానికి చేసింది.. రాయితీల కోసం పారిశ్రామికవేత్తలు ప్రతి మూడు నెలలకోసారి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ వాటిని పరిశీలించి మంజూరు చేస్తుంది.
బ్యాంకులు, ప్రైవేట్‌ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకొని పరిశ్రమలను నెలకొల్పారు. ఉత్పత్తి ప్రారంభించిన అనంతరం రాయితీలు వస్తే వారికి ఆర్థికంగా వెసులుబాటు ఉండటంతో పాటు రుణభారం తగ్గుతుంది. నిధుల విడుదలలో జాప్యం జరుగుతుండటంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బ్యాంకులు, ప్రైవేట్‌ సంస్థల వద్ద తీసుకున్న అప్పులు చెల్లించలేక సతమతమవుతున్నారు. అనేక మంది రాయితీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయితీలను టీఎస్‌ఐపాస్‌లో చేర్చింది. దీనికి అనుగుణంగా 15 రోజుల్లో అన్ని పరిశీలించి రాయితీలు మంజూరు చేస్తున్నారు. నిధుల విడుదలలో మాత్రం జాప్యం జరుగుతోందని పలువురు అంటున్నారు.

No comments:

Post a Comment