Breaking News

02/07/2018

గుంటూరు జిల్లాల్లో 25 వేల గృహప్రవేశాలు

గుంటూరు, జూలై 2, (way2newstv.in)
పేదల సొంతింటి కల నెరవేరబోతోంది. అందుకు ముందస్తుగా ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించుకుని వారి ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టింది. పనులను వివిధ దశల్లో అధికారులు పర్యవేక్షిస్తూ బిల్లులు మంజూరు చేసేలా చూసింది. ఈ ప్రక్రియలో జాప్యం జరుగకుండా ఉండేందుకు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా రాయితీ జమ చేసే విధానానికి శ్రీకారం చుట్టింది. పారదర్శకతకు పెద్దపీట వేసింది. ఒకే రోజు జులై 5న 25 వేల గృహప్రవేశాలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసింది. ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లుగా మంజూరై వివిధ కారణాలవల్ల అర్ధంతరంగా ఆగిపోయిన వాటి నిర్మాణాలనూ పూర్తి చేసుకోవడానికి అవకాశం కల్పించింది. క్షేత్రస్థాయి ఇబ్బందులను అధిగమించేలా సంస్కరణలు తీసుకువచ్చింది. ఇంటి నిర్మాణ విస్తీర్ణం పెంచడం, ఉమ్మడి గోడలు, స్థలాభావ సమస్యకు పరిష్కారం, అసంపూర్తి నిర్మాణానికి రూ.25 వేల ఆర్థికసాయంవంటి నిర్ణయాలు తీసుకుని పనులు చకచకా సాగేలా ప్రోత్సహించింది. 2014కు ముందు అంటే గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల కింద ఎస్సీలకు రూ.లక్ష, ఎస్టీలకు రూ.1.05 లక్షలు, ఇతరులకు రూ.75 వేలు రాయితీగా అందించారు. అప్పట్లో వివిధ కారణాలవల్ల కొన్ని పునాది నుంచి స్లాబు వరకు వివిధ దశల్లో నిర్మాణాలు ఆగిపోయాయి. 



గుంటూరు జిల్లాల్లో 25 వేల గృహప్రవేశాలు

గ్రామీణ పేదలకు ఇళ్లు కట్టుకునే ఆర్థిక స్తోమత లేకపోవడం ఇందుకు ఒక కారణం కాగా పాతస్థానే కొత్త వాటి నిర్మాణాలు ప్రారంభించిన వారూ ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వారికి ప్రీ ఎన్టీఆర్‌ ఇళ్ల నిర్మాణం పథకం కింద రూ.25 వేల ఆర్థికసాయం చేస్తుండడంతో పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఇలాంటి ఇళ్లు నరసరావుపేట, మాచర్ల, సత్తెనపల్లి, వినుకొండల్లో ఎక్కువగా ఉండగా తెనాలిలో తక్కువ అని గృహ నిర్మాణ సంస్థ గుర్తించింది. జిల్లాలో 8,606 ఇళ్లు అసంపూర్తిగా ఆగిపోగా ఇప్పటికే 2,915 పూర్తయ్యాయి. మరో 5,961 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై తుది దశలో ఉన్నాయి. అయితే క్షేత్రస్థాయిలో కొందరికి అవగాహన లేక ఇప్పటికీ ముందుకు రాలేదు. దీనిపై గృహ నిర్మాణ సంస్థ మరింత ప్రచారం చేసి నిర్మాణాలు పూర్తి చేసుకునేలా చూడాల్సివుంది. కాగా ఒకరి పేరు మీద స్థలం ఉంటే ఆ కుటుంబంలో వేర్వేరుగా ఉన్న అన్నదమ్ములు లేదా తండ్రీ కొడుకులకుగానీ ఒకరికే ఇంటిని నిర్మించుకునే అవకాశం ఉండేది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఒకే స్థలంలో ఉమ్మడి గోడలు కట్టుకుని రెండు కుటుంబాలు ఇళ్లు నిర్మించుకునే వెసులుబాటు కల్పించింది.

No comments:

Post a Comment