Breaking News

24/01/2020

నల్లమల్లను ముంచేస్తున్న మంచు

మహబూబ్ నగర్, జనవరి 24, (way2newstv.in)
పడిపోతున్న ఉష్ణోగ్రతలతో నల్లమల వణుకుతోంది. చలితోపాటు మంచు విపరీతంగా కురుస్తుండటంతో చెంచుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉండటానికి ఇండ్లు.. కప్పుకోవడానికి దప్పట్లు లేక నానాయాతన పడుతున్నారు. విపరీతమైన చలికితోడు అస్తమా, ఉబ్బసం వంటి వ్యాదులు చెంచులను కోలుకోకుండా చేస్తోంది.నల్లమల చెంచులకు చలికాలమంటే భయపడే పరిస్థితి వచ్చింది. చెంచు పెంటల్లో నివసించే వీరికి బట్టలు, ఉండటానికి సరైన నివాసం లేదు. దీంతో చిన్నపాటి గుడిసెల్లో వానకు తడుస్తూ, చలికి వణుకుతూ జంతువుల మాదిరిగానే జీవిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా పదర, లింగాల, అమ్రా బాద్‌, అచ్చంపేట మండలాల పరిధిలో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం ఉంది. 
నల్లమల్లను ముంచేస్తున్న మంచు

అప్పాపూర్‌, లక్ష్మిపల్లి, వటవర్లపలి, కుడిచింతలబైయిల్‌, సార్లపల్లి వంటివి 120 పెంటలు ఉన్నాయి. వీటి పరిధిలో 7 వేల మంది చెంచులు జీవిస్తున్నారు. సరైన వైద్యం, ఆహారంతో పాటు రక్షణ సౌకర్యాలు లేక ఈ ఐదేండ్ల కాలంలో 10 వేలు ఉన్న చెంచు జనాభా 7 వేలకు చేరింది. లింగాల మండలం అప్పాపూర్‌లో 30 చెంచు గుడిసెలుంటాయి. ఇక్కడ 150 మందికిపైగా చెంచులున్నారు. దానిపక్కనే లక్ష్మిపల్లి సార్లపల్లి పెంటలున్నాయి. ఈ పెంటల్లో పక్కా ఇండ్లు లేవు. చలికాలమైనా, వర్షాకాలమైనా నెగెడు పెట్టుకొని రాత్రిపూట నిద్రపోతారు. అప్పాపూర్‌లో లింగయ్యకు భార్యతో పాటు ఐదుగురు పిల్లలున్నారు. వీరు చలికి తట్టుకోలేక గుడిసెలోనే నెగెడు పెట్టుకుంటున్నారు. మల్లయ్యకు ఐదుగురు సంతానం. వీరికి గుడిసె ఉన్నా.. దానికి తలుపులు లేవు. చలికి తట్టుకోలేక గుడిసెలోనే చలిమంట పెట్టుకుంటున్నారు. ఇలాంటి కుటుంబాలు నల్లమలలో ఏ చెంచు పెంటకు వెళ్లినా అనేకం కనిపిస్తాయి.ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పగటి పూట 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు పడిపోతోంది. ఈ నెలలో అత్యధికంగా 32 డిగ్రీలు నమోదైతే.. అత్యల్పంగా 9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇక నల్లమలలో పగటిపూట 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటే, రాత్రి పూట అత్యల్పంగా 6 డిగ్రీలకు చేరుకున్నాయి. ఈసారి చలితో పాటు దట్టమైన మంచు ఉండటంతో అడవిలో చెంచులు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన అడవి కావడం చేత ఉదయం 11 గంటలు దాటినా సూర్యరశ్మి కనిపించని పరిస్థితి. సాయంకాలం 4నుంచే సూర్యుడు కనుమరుగవుతున్నాడు.ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు కటిస్తామని, విద్యా, వైద్యం అందుబాటులో తీసుకొస్తామని హామీలిచ్చిన పాలకులు మరిచిపోయారు. చెంచుల సంక్షేమం కాగితాలకే పరిమితమవుతోంది. చలి పెరగడంతోపాటు మంచూ ఎక్కువగా కురుస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సరైన ఆహారం దొరక్క నానా పాట్లు పడుతున్నారు. కనీసం దుప్పట్లు లేకపోవడంతో చర్మం కందిపోవడంతోపాటు వృద్ధులు, చిన్నారులు ఉబ్బసం, అస్తమాతో బాధపడుతున్నారు. సుమారు 40 కిలోమీటర్లు నడవనిదే వైద్యమందని దుస్థితి నెలకొంది.

No comments:

Post a Comment