Breaking News

24/01/2020

పెండింగ్ లోనే యాసంగి పెట్టుబడులు

కరీంనగర్, జనవరి 24, (way2newstv.in)
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఖరీఫ్‌లో అమ్మిన ధాన్యం డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులు దాదాపు 20వేల మంది ఉన్నారు. వారందరికీ ప్రభుత్వం ఏకంగా రూ.280 కోట్లు ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉంది. అసలే అరకొరగా వచ్చిన ధాన్యం అమ్మితే, ఆ డబ్బులు చేతికిరాక యాసంగిపెట్టుబడి కోసం ప్రయివేటు వడ్డీవ్యాపారులను ఆశ్రయిస్తూ అప్పుల పాలవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఐకేపీి, పీఏసీఎస్‌ కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. మొత్తం1031 కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం లక్షా 76వేలా800మంది రైతుల నుంచి 11లక్షలా 28వేలా 360 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సేకరించింది. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాలు దాదాపు పూర్తయ్యాయి. జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల్లో దాదాపు కేంద్రాలన్నీ మూసివేశారు. 
పెండింగ్ లోనే యాసంగి పెట్టుబడులు

కానీ రెండ్రోజుల్లో ఖాతాలో డబ్బులు జమ చేస్తామన్న ప్రభుత్వం పూర్తిస్థాయిలో విడుదల చేయలేదు.జిల్లాలవారీగా చూస్తే కరీంనగర్‌ జిల్లాలో ఇప్పటివరకు రూ.477 కోట్లా 72లక్షలు సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 8,461 మంది రైతులకు రూ.56కోట్లా 7లక్షలు ఇవ్వాల్సి ఉంది. పెద్దపల్లి జిల్లాలో రూ.376 కోట్లా 54లక్షలు రైతుల ఖతాలో వేయగా ఇంకా 7,169 మందికి రూ.87కోట్లా76లక్షలా 20వేలు చెల్లించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.250కోట్లా 77 లక్షలు రైతులకు చెల్లించగా రూ.58కోట్లా 8లక్షలు పెండింగ్‌లో ఉంది. జగిత్యాల జిల్లాలో రూ.645కోట్లా25 లక్షలు రైతుల ఖాతాలో వేశారు. 3,966 మంది రైతులకు రూ.77 కోట్లా 55లక్షలు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా ఈ నాలుగు జిల్లాల్లో కలిపి 280 కోట్లు పెండింగ్‌లో ఉన్నది.పౌరసరరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్‌ జిల్లాలోనే ధాన్యం డబ్బుల కోసం రైతులు నెలరోజులుగా ఎదురుచూసు ్తన్నారు. అక్టోబర్‌ నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం కాగా వర్షాలతో కొంత జాప్యం జరిగింది. నవంబర్‌ నుంచి డిసెంబర్‌ మొదటివారంలోనే వేగవంతమైన కొనుగోళ్లు దాదాపు పూర్తయ్యాయి. అయినా కొందరు రైతుల ఖాతాలో డబ్బులు పడలేదు. ధాన్యం కొనుగోలు చేసిన కేంద్రాల నిర్వాహకులు, అధికారులు రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో ఆలస్యం చేశారు. అధికారులు సాంకేతిక కారణాలు చెబుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధుల కొరత కారణంగానే రైతులకు డబ్బులందడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే యాసంగి పనులు ప్రారంభమవగా పెట్టుబడికి ధాన్యం అమ్మిన డబ్బులు రాక అన్నదాతలు నానా పాట్లు పడుతున్నారు.

No comments:

Post a Comment