Breaking News

10/01/2020

ట్రాఫిక్ తో ఆర్మూర్ వాసుల ఇబ్బందులు

నిజామాబాద్, జనవరి 10, (way2newstv.in)
అది తెలంగాణలో మూడో అతిపెద్ద నగరం. అంత పెద్ద నగరరోడ్లపై ప్రజలు తిరగాలంటే వనికిపోతున్నారు. బయటకి వెల్తే పద్మవ్యూహాల్లా కన్పిస్తున్న రోడ్ల మధ్యలో చిక్కుకుపోతామని భయపడుతున్నారు. రోజురోజుకు పేరిగిపోతున్న ట్రాఫిక్‌తో నిజామాబాద్‌ నగరవాసులు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. .నిజామాబాద్ నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ కష్టాలు తీవ్రతరం అవుతున్నాయి. రోజుకు వేల సంఖ్యలో వాహనాలు జిల్లా కేంద్రానికి వస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. సిబ్బంది కొరత కారణంగా ట్రాఫిక్‌ను నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. హెల్మెట్‌లు ధరించడం లేదని, లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతున్నారనే కారణంగా ఇబ్బడిముబ్బడిగా జరిమానాలు విధిస్తున్నారే తప్ప, సమస్య పరిష్కారానికి పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ట్రాఫిక్ తో ఆర్మూర్ వాసుల ఇబ్బందులు

తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్ తర్వాత మూడో అతి పెద్ద నగరం నిజామాబాద్‌. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ జనాభా 3లక్షలపై చిలుకు మాటే. 1931లో మున్సిపాలిటీగా అవతరించింది. ఐతే అప్పుడు ఈ మున్సిపాలిటి పేరు ఇందూరుగా ఉండేది. 1979లో నిజామాబాద్‌గా నామకరణం చేశారు. ఇక 1987లో స్పెషల్ గ్రేడ్ మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్  చేసారు. అప్పటి నుంచి నగరంలో జనాభా పెరుగుతోంది కానీ... రహదారుల విస్తరణ మాత్రం జరగటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్‌ విషయంలో ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సరైన పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో రోడ్లపైనే ఆటోలు, జీపులు, కార్లు, లారీలను నిలుపుతూ ఎక్కడబడితే అక్కడ అడ్డాలుగా ఏర్పాటు చేసుకున్నారు. ఖలీల్‌వాడిలోని రమేష్ థియేటర్ నుండి రాజీవ్‌గాంధీ ఆడిటోరియంకు వచ్చే మార్గంలో ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. ఫలితంగా నగర ప్రజలు అనునిత్యం అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది.జిల్లా కేంద్రంలో పోలీసుల రికార్డుల ప్రకారం 12వేల పైచిలుకు ఆటోలు తిరుగుతున్నాయి. వీటితో పాటు పరిసర గ్రామాలు, మండలాల నుండి మరో 6వేల ఆటోలు జిల్లా కేంద్రానికి రావడం వల్ల ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. ఆటోరిక్షాలు అతివేగంగా వెళ్తూ వాహనాలను ఓవర్‌టేక్ చేయడం వల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అరకొర సిబ్బందితో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడం కష్టతరంగా మారుతుంది. అడపాదడపా సివిల్ పోలీసులే ట్రాఫిక్ పోలీసులుగా అవతారమెత్తాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధాన వ్యాపార కూడళ్లు, పెద్ద సంఖ్యలో ఆసుపత్రులు కలిగిన ఖలీల్‌వాడీ ప్రాంతాలలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఆసుపత్రులకు వచ్చే రోగుల వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు స్థలాన్ని కేటాయించకపోవడంతో ఆసుపత్రుల ఎదుట రోడ్డుపైనే పార్కింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి నగరంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

No comments:

Post a Comment