న్యూఢిల్లీ, జనవరి 21 (way2newstv.in)
బీజేపీకి సౌత్ లోనే పెద్దగా సీన్ లేదన్న సంగతి తెలిసిందే. కేరళ, తమిళనాడులో అసలు ఆ పార్టీ ఊసు ఉండదు, కర్నాటకలో పెద్దాయన యడ్డియూరప్ప రాజకీయ అనుభవం, ఆయన బలమైన సామాజికవర్గం నేపధ్యం వంటివి బీజేపీని అక్కడ గట్టిగా ఇప్పటికైతే ఉంచాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బీజేపీ తెలంగాణాలోనే ఎంతో కొంత ఉన్నాననిపించుకుంటోంది. ఏపీలో పొత్తులు లేకుండా పొద్దే పొడవని సంగతి తెలిసిందే. అటువంటి బీజేపీని ఏపీలో పెద్దన్నగా అన్ని రాజకీయ పార్టీలు భావించడమే అసలైన విడ్డూరం. దీనికి కారణం కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉండడం ఒక కారణమైతే ఏపీలోని నేతల మధ్య ఐక్యత లేకపోవడం మరో కారణం. అందువల్లనే నోటా కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ ఏపీలో తలెగరేస్తోంది.
ఏపీలో కమలానికి సాదర స్వాగతాలు
2019 ఎన్నికల్లో ఇంత చెత్తగా పెర్ఫార్మెన్స్ చేసిన బీజేపీని మిగిలిన చోట్ల అయితే ఎవరూ అసలు కనీసంగా కూడా పట్టించుకోరు. కానీ ఏపీలో పార్టీలు మాత్రం మా నెత్తిన కాలు పెట్టండంటూ సాదరంగా ఆహ్వానిస్తున్నాయి. దాంతో బీజేపీ పరిస్థితి ఎలా ఉందంటే ఢిల్లీకి వెళ్ళిన సీఎంలను కూడా ఖాతరు చేయకపోవడం, ఇక పార్టీ అధినేతల విషయంలోనూ తమ కోసం వేచి ఉండేలా చేసుకోవడం, ఈ అనుభవం నిన్న చంద్రబాబు, నేడు జగన్, పవన్ కూడా ఎదుర్కొంటున్నారు. అయినా సరే బీజేపీతో కలవాలని, ప్రత్యర్ధిని అలా ఓడించాలన్న వెర్రి పగలతో ఏపీలో బీజేపీకి పెద్ద పీట వేస్తున్నారు.నిజానికి విభజన హామీలను తుంగలోకి తొక్కిన బీజేపీని ఏపీ ప్రజలు అయితే ఎపుడో పక్కన తీసి అవతల పెట్టేసారు. ఈ పార్టీ మాకొద్దు అని కచ్చితంగా చెప్పేసారు. అయినా సరే ఏపీలోని రాజకీయ పార్టీలకు మాత్రం బీజేపీ అవసరం చాలా ఉన్నట్లుంది. ఎవరి వ్యక్తిగత అజెండాలు, భయాలు, స్వార్ధాలతో బీజేపీని బూచిగా చూపిస్తున్నారు. దాంతో తానే పెద్ద పులి అన్నట్లుగా బీజేపీ ఏపీలో తెగ బిల్డప్ ఇస్తోంది. నిజానికి ప్రత్యేక హోదా బీజేపీ ఇవ్వలేదు, రాజధాని కడతామని చెప్పి కేవలం పదిహేను వందల కోట్లు మాత్రమే ఇచ్చింది. మరో వైపు కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు భరించాల్సిన చోట తెలివిగా కధలు చెబుతూ ముందు మీరు ఖర్చు పెట్టండి ఆనక మా దగ్గరుంటే చూద్దామంటోంది. మరో వైపు భారీ ఎత్తున ఖర్చు కానున్న పునరావాస ప్యాకేజికి కేంద్రానికి అసలు సంబంధం లేదని తప్పించుకుంటోంది.నిజానికి బీజేపీకి ప్రజలు చోటు ఇవ్వాలి. వారే ఆ పార్టీని ఎన్నుకోవాలి. కానీ బీజేపీ అంటే ఏంటో తెలిసిన జనాలు మాత్రం మాకు వద్దు అంటున్నారు. నాయకులు మాత్రం బీజేపీ కావాలని, రావాలని దారులు చూపిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా జగన్ బీజేపీని పల్లెత్తు మాట అనలేదు, ఇపుడు జగన్ పవర్ లో ఉన్నారు. దాంతో బాబు, పవన్ ఇద్దరూ బీజేపీ ప్రాపకం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ ని జాగ్రత్తగా గమనిస్తున్న బీజేపీకి ఏపీలో సర్వాధికారిణి తానేనని విర్రవీగుతోంది. ఏది ఏమైనా తాము ఎన్నుకున్న తెలుగు నాయకులకు వెన్నెముక లేకపోవడం వల్లనే తాము ఓటేయని బీజేపీ జెండాలను ఫోటోలను పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోందని అమరావతి రైతులతో సహా అంతా నిరూపిస్తున్నారు.
No comments:
Post a Comment