Breaking News

21/01/2020

తమిళనాడులో ఎన్నికల గుబులు

చెన్నై, జనవరి 21  (way2newstv.in)
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈసారి కరుణానిధి, జయలలిత లేకుండా ఎన్నికలు జరుగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అన్ని పార్టీల్లోనూ గుబులు బయలుదేరింది. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ సొంత పార్టీతో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయనున్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు ఏదో ఒక ప్రాంతీయ పార్టీ పంచన చేరే అవకాశాలే కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే కు విజయం సాధ్యమేనా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.డీఎంకే దశాబ్దకాలంగా అధికారానికి దూరంగా ఉంది. జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకేకు తమిళప ప్రజలు పట్టకట్టడంతో డీఎంకే ప్రతిపక్షానికే పదేళ్ల నుంచి పరిమితమయింది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ భావిస్తున్నారు. 
తమిళనాడులో ఎన్నికల గుబులు

ఆయనకు ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకేతో ఎలాంటి గుబులు లేదు. అన్నాడీఎంకేకు సరైన నాయకత్వం లేకపోవడం, పన్నీర్, పళనిస్వామిల నాయకత్వాన్ని పార్టీ క్యాడరే పట్టించుకోక పోవడంతో ఆ పార్టీ నుంచి ముప్పు లేదన్నది స్టాలిన్ విశ్వాసం.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ తమిళ ప్రజలు డీఎంకే కూటమికే పట్టం కట్టారు. ఆ జోష్ లో ఉన్న డీఎంకే అధికారానికి చేరువకావడానికి రజనీకాంత్ అడ్డంకులు సృష్టిస్తారా? అన్న అనుమానం లేకపోలేదు. అందుకే డీఎంకే అధినేత స్టాలిన్ రజనీకాంత్ పార్టీకే ఎక్కువ భయపడుతున్నారు. కమల్ హాసన్ తో కలసి పోటీ చేసేందుకు రజనీకాంత్ కూడా సుముఖంగా ఉన్నారు. రజనీకాంత్ పై నాన్ లోకల్ ముద్ర వేయడానికి ఇప్పటికే డీఎంకే, అన్నాడీఎంకే రెడీ అయిపోయాయి. అందుకే కమల్ హాసన్ సాయంతో ఆ ముద్ర తనపై పడకుండా ఉండేదుకు రజనీకాంత్ జాగ్రత్త పడుతున్నారన్న వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి.అరవై వడిలో పడిన స్టాలిన్ కు ఈ ఎన్నికలు సవాల్ గా మారనున్నాయి. ఈసారి అధికారం అందకపోతే పార్టీని నడపడం కూడా కష్టమే. అందుకే సినీగ్లామర్ నే అదే రీతిలో దెబ్బకొట్టాలని స్టాలిన్ భావిస్తున్నారు. తమిళనాడులో క్రేజ్ ఉన్న నటుడు విజయ్ సహకారం తీసుకునే ప్రయత్నం స్టాలిన్ చేస్తున్నారు. విజయ్ కు తమిళనాడు వ్యాప్తంగా లక్షల్లో అభిమానులున్నారు. రజనీకాంత్ తర్వాత విజయ్ అంతటి అభిమానం పొందడంతో స్టాలిన్ విజయ్ సాయం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద వచ్చే ఎన్నికలు స్టాలిన్ కు జీవన్మరణ సమస్యగా మారనున్నాయి

No comments:

Post a Comment