Breaking News

06/01/2020

ఆదాయంపై ఆర్టీసీ గురి

నాన్ టికెటింగ్ ప్రాఫిట్స్‌పైనా యాజమాన్యం దృష్టి
హైద్రాబాద్, జనవరి 6, (way2newstv.in)
ఆర్‌టిసిలోని అన్ని విభాగాలను ఉన్నతాధికారులు పరిశీలిస్తూ ఆదాయమార్గాలను అన్వేషిస్తున్నారు. డిసెంబర్ 3 నుంచి కిలోమీటరుకు 20 పైసలు చొప్పున ఛార్జీల పెంపు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రోజుకు రూ.1.5 కోట్లు ఆదాయం వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్‌టిసి ఆర్థిక పురోభివృద్ధికి కేవలం ప్రయాణికుల చార్జీలకు సంబంధించే కాకుండా నాన్ టికెటింగ్ ప్రాఫిట్స్‌పైనా యాజమాన్యం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంకుల ఏర్పాటు, కమర్షియల్ యాడ్స్ విభాగాలపైనా పూర్తి కసరత్తు చేస్తున్నారు.2016 నుంచి బస్టాండ్‌లలో పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు వాటిని మరిన్ని ఎక్కువ బస్టాండ్‌లలో ఏర్పాటుచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా బస్టాండ్‌లలో సైన్ బోర్డులు, టీవీ ప్రకటనలు తదితర యాడ్స్‌లపైనా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 
ఆదాయంపై ఆర్టీసీ గురి

ఎప్పటి నుంచో వీటి నిర్వహణ ఉన్నప్పటికీ మరింత విస్తృతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆర్‌టిసి యాజమా న్యం సన్నద్ధమవుతుంది. ఈ క్రమంలోనే కాంట్రాక్టు తీరిపోయిన ఖాళీ ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. ఇటీవల కొత్త కాంట్రాక్టులకు ఆర్‌టిసి టెండర్లు పిలిచి..వాటి ఎంపిక ప్రక్రియ చేపట్టారు.మియాపూర్, సంగారెడ్డి, సిద్దిపేట, గద్వాల్, బీర్‌పూర్, హుస్నాబాద్, వనపర్తి, హకీంపేట, మహబూబ్‌నగర్ తదితర బస్‌స్టాండ్‌లలో 2016 నుంచి పెట్రోల్ బంకులు నిర్వహణ కొనసాగుతుంది. దాదాపు 30 సంవత్సరాల లీజుకు హెచ్‌సిఎల్, హెచ్‌పిసిఎల్ పెట్రోల్ బంకుల నిర్వహణకు కాంట్రాక్టులు ఇచ్చారు. ఇప్పటి వరకు పెట్రోలు బంకుల వల్ల ఆర్‌టిసికి అరకొర లాభాలే వస్తున్నాయి.పెట్రోల్ బంకుల స్థలానికి కేటాయించిన అద్దె ద్వారా రూ.74 లక్షలు, కమిషన్ రూపంలో రూ.92 లక్షలు మొత్తం కలిపి ఏడాదికి రూ.1.66 కోట్లు వస్తున్నట్లు తెలుస్తోంది. పలు పెట్రోల్ బంకుల నుంచి ఆదాయం బాగున్నప్పటికీ మరికొన్ని బంకుల లాభాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రధాన రోడ్డుకు దగ్గరలోనూ, రద్దీ ప్రాంతాలలోనూ ఉన్న బస్‌స్టాండ్‌లలో పెట్రోల్ బంకులు ఏర్పాటుచేయాలనే యోచనలో ఆర్‌టిసి యాజమాన్యం యోచిస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా 48 బస్టాండ్‌లను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. వాటికి త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉంది.నాన్ టికెటింగ్ ప్రాఫిట్స్‌లో ముఖ్యమైన యాడ్స్ విభాగం ఆదాయం ఆశాజనకంగా ఉంది. బస్‌స్టాండ్‌లలో హోర్డింగ్‌లు, సైన్‌బోర్డులు, ప్రకటనల ద్వారా 2015..16 సంవత్సరంలో రూ.68 కోట్లు రాగా, 2016..17లో రూ.78 కోట్లు, 2017..18 సంవత్సరానికి రూ.86 కోట్లు వచ్చింది. గడిచిన 2018-..19 సంవత్సరానికి రూ.103 కోట్లు ఆదాయం వచ్చింది. కమర్షియల్ యాడ్స్‌పై రూ.వంద కోట్లు ఆదాయం రావడంతో యాజమాన్యం సంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఈ ఏడాది కూడా వాటి ద్వారా ఆదాయం మరింత పెరుగుతుందని అర్‌టిసి అధికారులు అంచనా వేస్తున్నారు.

No comments:

Post a Comment