విజయవాడ, జనవరి 6 (way2newstv.in)
బీజేపీలో అనూహ్య పరిణామం.. రాష్ట్రంలో ఎదగాలి.. అధికారంలోకి రావాలి.. అని వేయికళ్లతో ఎదురు చూడడం, ఆశలు పెట్టుకోవడం మాట అటుంచితే.. అసలు రాష్ట్ర బీజేపీ మూడు ముక్కలుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు చాలా ఊపుగా ఉన్న ఈ పార్టీలో అనూహ్యంగా రాజధాని అంశం.. ముగ్గురు నాయకుల మధ్య తీవ్ర తేడాను తెరమీదికి తెచ్చింది. విషయంలోకి వెళ్తే.. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వారం పది రోజులుగా రాజధాని విషయంపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.రాజధానిని మారిస్తే.. కేంద్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాజధానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు కాబట్టి.. దీనిని మార్చేందుకు కేంద్రం ఒప్పుకోదని సుజనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ నాలుగు రోజులు గడిచాయి.
కమలంలో క్యాపిటల్ కల్లోలం
అయితే, ఈ వ్యాఖ్యలపై తటస్థ నాయకులు రాజధాని విషయం రాష్ట్రాల జాబితాలో ఉంటుందని గుర్తు చేయడంతో .. ఆయన ఒక్కసారిగా మాటమార్చారు. రాజధాని విషయంలో కేంద్రం నేరుగా జోక్యం చేసుకోకపోయినా.. అధికారం ఉందని, అయితే, దీనిని తర్వాత చెబుతానని, కానీ, అంగుళం కూడా కదిలించే హక్కు రాష్ట్రానికి లేదని అన్నారుఇంతలోనే రాష్ట్రానికి వచ్చిన ఐదు రాష్ట్రాల బీజేపీ ఇంచార్జ్, బీజేపీ కీలక నాయకుడు జీవీఎల్ నరసింహారావు మరో కీలక వ్యాఖ్య చేశారు. అసలు రాష్ట్ర రాజధానితో కేంద్రానికి ఎలాంటి సంబంధం ఉండదని, ఈ విషయం నేను కేంద్రంతోనే చర్చించి చెబుతున్నానని, అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని ఆయన చెప్పారు. అదే సమయంలో సుజనా వ్యాఖ్యలను ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలుగా చెప్పారు. తాను మాత్రం కేంద్రంతో చర్చించే చెబుతున్నానని జీవీఎల్ చెప్పడం సంచలనంగా మారింది.ఇదిలావుంటే.. మరోపక్క, రాష్ట్ర బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ రాజధాని కోసం మౌనం వ్రతం చేయడం కూడా సంచలనంగా మారింది. దీనిని ఉటంకిస్తూ.. కడపకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్.. తాను కన్నా దారిలో నడుస్తానని వెల్లడించడం మరో కోణం. మొత్తంగా ముగ్గురు రాజ్యసభ సభ్యులు మూడు విధాలుగా మాట్లాడడం, మూడు విధాలుగా వ్యవహరించడం బీజేపీలో తీవ్ర చర్చకు దారితీసింది. మరి ఇలా అయితే.. కీలకమైన జాతీయ పార్టీ పరిస్థితి మాట పక్కన పెడితే.. అసలు రాజధానిపై బీజేపీ వ్యూహమే మొత్తంగా డైల్యూట్ అయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
No comments:
Post a Comment