Breaking News

24/01/2020

టీడీపీకి కొత్త టెన్షన్

విజయవాడ, జనవరి 24  (way2newstv.in)
రాష్ట్రంలో ప్రధాన ప్రతిప‌క్షం హోదాలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు చిత్రమైన రాజ‌కీయ ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. అత్యంత కీల‌క‌మైన స‌మ‌యంలో చంద్రబాబుకు పార్టీలోని సీనియ‌ర్ల నుంచి ప్రతి ఘటన ఎదుర‌వుతోంది. ఈ ప‌రిణామం ఒక్క అసెంబ్లీకే ప‌రిమితం అయితే, ఫ‌ర్వాలేద‌నుకుని స‌రిపెట్టుకునే వాళ్లు. కానీ, ఇప్పుడు శాస‌న మండ‌లికి కూడా ఈ ప‌రిస్థితి ఎదురైంది. అసెంబ్లీతో పోల్చిన‌ప్పుడు మండలిలో టీడీపీకి మంచి బ‌లం ఉంది. వాస్తవానికి మండ‌లిలో స‌భ్యుల సంఖ్య 58. వీరిలో 8 మంది నామినేటెడ్ సభ్యులు కాగా, 50 మంది వివిధ వ‌ర్గాల నుంచి ఎంపికైన‌ వారు.ఇక‌, టీడీపీకి ఇక్కడ 29 మంది స‌భ్యులు ఉన్నారు. అదే స‌మ‌యంలో 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇక‌, అధికార వైసీపీకి కేవ‌లం తొమ్మిది మంది మాత్రమే ఎమ్మెల్సీలు ఉన్నారు. దీంతో అధికార ప‌క్షానికి అసెంబ్లీ ప‌ట్టుకొమ్మ అయితే ప్రతిప‌క్షానికి మండ‌లి బ‌ల‌మైన వేదిక‌. 
టీడీపీకి కొత్త టెన్షన్

ఈ క్రమంలోనే మూడు రాజ‌ధానుల బిల్లు విష యంలో అసెంబ్లీలో వైసీపీ దూకుడు ప్రద‌ర్శించి ఆమోదం పొందింది. ఇదే స‌మ‌యంలో ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ త‌న స‌త్తాను మండ‌లిలో చూపించాల‌ని భావించింది. మంగ‌ళ‌వారం నాటి మండ‌లి స‌మావేశాల్లో రూల్ 71 ను తెర‌మీదికి తెచ్చింది కూడా వ్యూహంలో భాగ‌మే.అయితే, టీడీపీ ఈ విష‌యంలో అంటే రూల్ 71ను నెగ్గించుకోవ‌డంలో స‌క్సెస్ అయినా స‌భ్యుల‌ను ఏక‌తాటిపై న‌డిపించ‌డంలో మాత్రం విజ‌యం సాధించ‌లేక పోయింద‌నేది వాస్తవం. ప్రకాశం జిల్లాకు చెందిన పోతుల సునీత‌, క‌డ‌ప‌కు చెందిన చ‌దిపిరాళ్ల శివ‌నాథ్‌రెడ్డి పార్టీలైన్‌ను విస్మరించారు. నిజానికి వీరిలో శివ‌నాథ్‌రెడ్డి మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి త‌మ్ముడి కొడుకు. ఇక‌, పోతుల సునీత ప్రకాశం జిల్లా చీరాలలో 2014 ఎన్నిక‌ల్లో హోరాహోరీ త‌ల‌ప‌డిన నాయ‌కురాలు. ఈ ఇద్దరూ కూడా టీడీపీలో కీల‌కంగానే ఉన్నారు. పైగా సునీత ఏపీ టీడీపీ మ‌హిళా అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు.అయితే, కీల‌క‌మైన రాజ‌ధాని అంశంపై మాత్రం ఇలా భిన్నమైన వైఖ‌రితో ముందుకు సాగ‌డం మాత్రం పార్టీని తీవ్రంగా ఇరుకున ప‌డేసింది. అయితే, మిగిలిన వారు క‌లిసి రావ‌డంతో మెజారిటీ ప్రతిప‌క్షానికే ద‌క్కి రూల్ 71 పాసైంది. మ‌రి ఈ ప‌రిణామాలు చూస్తే.. చంద్రబాబు అటు ఎమ్మెల్యేల‌పైనే కాకుండా ఎమ్మెల్సీల‌పైనా ప‌ట్టుకోల్పోతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక అటు పార్టీలోనూ ఇప్పటికే చాలా మంది చంద్రబాబు తీరుపై పైకి చెప్పుకోలేక పోయినా తీవ్ర అస‌హ‌నంతో ఉంటున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ఈ అసంతృప్తి ఎప్పట‌కి అయినా బ‌డ‌బాగ్నిలా పేలే ఛాన్సులే ఉన్నాయి.

No comments:

Post a Comment