Breaking News

05/12/2019

జనసేనాని యూ టర్న్ వెనుక..

విజయవాడ, డిసెంబర్ 5 (way2newstv.in)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన లైన్ మార్చుకుంది ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఎక్కిన తర్వాతనేనా? ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాతనే పవన్ కల్యాణ్ టోన్ మారిందా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న మొన్నటి వరకూ తాను ఒంటరిగా పోటీ చేస్తాననే ప్రకటించారు. గత ఎన్నికల్లో నూ ఒంటరిగానే పోటీ చేసి కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకున్నారు. అయితే ఘోర ఓటమి తర్వాత పవన్ కల్యాణ్ కు అసలు విషయం అర్థమయింది. బలంగా ఉన్న బీజేపీతో పొత్తుతో వెళితే బాగుండేదని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.ఇటీవల ఇసుక కొరతపై విశాఖ లాంగ్ మార్చ్ లో పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన కూడా ఇందుకు అద్దంపడుతోంది. 
జనసేనాని యూ టర్న్ వెనుక..

తనకు కేంద్రంలో బీజేపీ పెద్దలు బాగా పరిచయమని, ఢిల్లీకి వెళ్లి వైసీపీ సంగతి తేలుస్తానని ప్రకటించారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి వచ్చారు. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన అత్యంత గోప్యంగా సాగింది. బీజేపీ కేంద్ర పెద్దలను ఎవరిని పవన్ కల్యాణ్ కలసినట్లు బయటకు రాలేదు. అయితే బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ తో ఇటీవల పవన్ కల్యాణ్ సమావేశామయ్యారని మాత్రం చెబుతున్నారు.అయతే పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాతనే ఆయన ఆలోచనల్లో మార్పు వచ్చిందంటున్నారు. బీజేపీకి తాను దూరం కాలేదని పవన్ కల్యాణ్ ప్రకటించడం, అమిత్ షా లాంటి నేతలు దేశానికి అవసరమని చెప్పడం ఇందులో భాగమేనంటున్నారు. అధికార పార్టీని కార్నర్ చేయాలని బీజేపీ పెద్దల నుంచి ఆదేశాలు పవన్ కల్యాణ్ కు అందినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. జగన్ ను ఇరుకున పెట్టేందుకే పవన్ కల్యాణ్ కమలనాధులతో దోస్తీకి రెడీ అయ్యారన్న టాక్ కూడా బలంగా విన్పిస్తుంది.అందుకే పవన్ కల్యాణ్ బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాదు హిందూధర్మం గురించి పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. మతమార్పిడులపై పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా మారడానికే పవన్ కల్యాణ్ బీజేపీ బాట పట్టనున్నట్లు తెలిసింది. ఈ నాలుగున్నరేళ్లు పార్టీని కాపాడుకోవడానికి, నేతలు పార్టీని వీడకుండా ఉండేందుకు పవన్ కల్యాణ్ బీజేపీ, టీడీపీ అనుకూల ప్రకటన చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాతనే ఆయన టోన్ మారిందన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఢిల్లీలో ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది.

No comments:

Post a Comment