Breaking News

14/12/2019

కర్నాటక కాంగ్రెస్‌లో భారీ మార్పులు!

బెంగళూరు డిసెంబర్ 13 (way2newstv.in)
 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పొందడంతో కర్నాటక కాంగ్రెస్‌లో భారీ మార్పులు ఖాయమని దాదాపు నిశ్చయమైంది. పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దినేశ్ గుండురావు, సీఎల్పీ నేత సిద్దరామయ్య తదితరులు ఇప్పటికే తమ రాజీనామాలను అధిష్ఠానినికి పంపించేశారు. అయితే వీటిపై అధిష్ఠానం ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో కర్నాటక కాంగ్రెస్‌ను సమూలంగా మార్చేసి, నూతన నాయకత్వాన్ని స్థిరపరచాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని పార్టీ వర్గాల సమాచారం.అయితే ఈ మార్పులకు ఇది సరైన సమయం కాదని, యథాతథ స్థితినే కొనసాగించాలని అధిష్ఠానం తన మనసు మార్చుకున్నట్లు సమాచారం. 
కర్నాటక కాంగ్రెస్‌లో భారీ మార్పులు!

అత్యంత కీలకమైన సీఎల్పీ నేత, కేపీసీసీ అధ్యక్ష పదవి లాంటి పదవులకు నాయకుల మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. దీంతో అందర్నీ సంప్రదించిన తర్వాతే తేనెతుట్టను కదపాలని అగ్ర నేతలు నిర్ణయించుకున్నారు. ‘‘రాష్ట్ర నాయకత్వంలో కచ్చితంగా మార్పులు ఉంటాయి. కానీ సీనియర్లను సంప్రదించిన తర్వాతే అది జరుగుతుంది’’ అని ఓ నాయకుడు ప్రకటించారు.మరోవైపు కేపీసీసీ అధ్యక్షుడి రాజీనామాను అధిష్ఠానం ఆమోదించే సూచనలు ఉన్నాయని, సీఎల్పీ నేతగా మాత్రం సిద్దరామయ్యనే కొనసాగమని అధిష్ఠానం కోరే ఛాన్స్ ఉందని కొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే సిద్దరామయ్య తొందరపడి నిర్ణయం తీసుకున్నారని, దానిపై పున: స్సమీక్షించాలని ఓ వర్గం అభిప్రాయపడుతోంది. కేంద్ర మాజీ మంత్రి మునియప్ప వర్గం మాత్రం ఇద్దరి నేతల రాజీనామాను ఆమోదించాల్సిందేనని అధిష్ఠానం ముందు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆ ఇద్దరి నేతల కార్యశైలిపై ఈ వర్గం చాలా గుర్రుగా ఉంది.ఉప ఎన్నికల సమయంలో కనీసం తమను సంప్రదించలేదన్నది మునియప్ప ప్రధాన ఆరోపణ. ఇంత గందరగోళ పరిస్థితుల నడుమ అప్రమత్తమైన అధిష్ఠానం, కర్నాటకలో ఏం జరుగుతుందన్న దానిపై వెంటనే ఓ రిపోర్టు సమర్పించాలని నాయకులను ఆదేశించింది. మరోవైపు కేపీసీసీ అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. మల్లికార్జున ఖర్గే, మాజీ మంత్రి మునియప్ప, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌తో పాటు ఎం.బి. పాటిల్ పోటీపడుతున్నారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి పరమేశ్వర, హెచ్.కే. పాటిల్ ముందు వరసులో ఉన్నట్లు సమాచారం. సీఎల్పీ నేతగా మాత్రం సిద్దరామయ్యే కొనసాగే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ వర్గాల అభిప్రాయం.

No comments:

Post a Comment