Breaking News

20/12/2019

పునరాలోచనలో జేడీఎస్ ఎమ్మెల్యేలు

బెంగళూర్, డిసెంబర్ 20 (way2newstv.in)
కంచుకోటకు బీటలు వారుతున్నాయి. కన్నడనాట జనతాదళ్ ఎస్ కు పట్టున్న మాండ్య జిల్లాలో దేవెగౌడ పార్టీకి భారీ దెబ్బ తగలనుంది. కుమారస్వామి పోకడలను సహించలేని కొందరు నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జనతాదళ్ ఎస్ ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారు. జేడీఎస్ కు రాజకీయ భవిష్యత్ లేదన్న నిర్ధారణకు వచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి కుమారస్వామి కూడా ప్రభావం చూపలేరన్నది వారి ఆలోచన. అందుకే అధికార పార్టీ వైపు చూస్తున్నారు.ప్రధానంగా కుమారస్వామి పార్టీకి పట్టున్న మాండ్య జిల్లాలోనే తొలిసారి ప్రకంపనలు పుట్టనున్నాయి. మాండ్య జిల్లా లో పట్టున్న జేడీఎస్ ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ ఓటమి చూసింది. ఒక్కలిగ సామాజికవర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాల మద్దతు పొందుతూ మాండ్య జిల్లాపై కుమారస్వామి పట్టు నిలుపుకుంటూ వస్తున్నారు. 
పునరాలోచనలో జేడీఎస్ ఎమ్మెల్యేలు

కానీ లోక్ సభ ఎన్నికల్లో కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ్ మాండ్య నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.కుటుంబ పార్టీగా పూర్తిగా మారిపోవడంతోనే మాండ్యలో నిఖిల్ గౌడ ఓటమిపాలయ్యారన్న విశ్లేషణలున్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పాటు జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా నిఖిల్ గౌడ గెలుపునకు కృషి చేయలేదని కుమారస్వామి తరచూ చెబుతుంటారు. సుమలత గెలుపునకు కారణమయ్యారన్న అనుమానం ఇప్పటికీ కుమారస్వామిలో ఉంది. ఇటీవల ఉప ఎన్నికల సందర్భంగా ఆ జిల్లాలో పర్యటించిన కుమారస్వామి తన కుమారుడిని ఓడించారని కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మాండ్య జిల్లాకు చెందిన జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిసింది.తాజాగా కొందరు జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి టచ్ లోకి వెళ్లారు. బీజేపీకి ప్రస్తుతం ఇతర పార్టీల నేతల మద్దతు అవసరం లేకున్నా, మాండ్య జిల్లాలో కుమారస్వామిని దెబ్బతీసేందుకే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు. శ్రీరంగ పట్టణ ఎమ్మెల్యే రవీంద్ర శ్రీకంఠయ్య, నాగమంగల శాసనసభ్యుడు సురేష్ గౌడలు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వారు ఎలాంటి షరతులు లేకుండా చేరతామని బీజేపీ అగ్రనేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. తాము జేడీఎస్ లో ఇమడలేమని, తమ రాజకీయ భవిష్యత్ కోసమే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నామని వారు సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నారు. అసలే ఓటమితో కుంగిపోయి ఉన్న కుమారస్వామి ఎమ్మెల్యేలు జంప్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. 2023 ఎన్నికలకు ముందే జేడీఎస్ ఖాళీ అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.

No comments:

Post a Comment