Breaking News

28/12/2019

వేడి తగ్గించడానికే మరో కమిటీ...

గుంటూరు, డిసెంబర్ 28, (way2newstv.in)
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనపై కొంత వెనక్కు తగ్గినట్లే కన్పిస్తుంది. మంత్రివర్గ సమావేశంలో రాజధాని విషయంపై నిర్ణయం ఉంటుందని పదే పదే మంత్రులు ప్రకటించారు. అయితే తీరా మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని పక్కన పెట్టారు. రాజధాని ప్రాంత రైతుల నుంచి వచ్చిన ఆందోళన కారణమా? లేక కొంతకాలం వెయిట్ చేయాలని ఉద్దేశ్యమా? అన్న చర్చ జరుగుతోంది. అయితే ఉన్న పళంగా రాజధానిని మారిస్తే అన్ని ప్రాంతాల నుంచి వ్యతిరేకత వస్తుందని కొంతకాలం పాటు వాయిదా వేసినట్లు కనపడుతోంది.అందుకే కమిటీల పేరిట రాజధాని విషయంలో కాలయాపన చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లు కనపడుతోంది. 
వేడి తగ్గించడానికే మరో కమిటీ...


జీఎన్ రావు నివేదిక కమిటీతో పాటు వచ్చే నెల మొదటి వారంలో బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు ఇవ్వనున్న నివేదికపై అధ్యయనం చేయడానికి హైపవర్ కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీ ఎంతకాలంలో అధ్యయనం చేస్తుందనేది ఇంతవరకూ చెప్పలేదు. అంటే మరికొంతకాలం ఈ అంశాన్ని నాన్చాలనే నిర్ణయానికి జగన్ వచ్చినట్లు తెలుస్తోంది.ఇతర ప్రాంతాల్లో కూడా డిమాండ్లు పెరిగాయి. రాయలసీమ తమకు రాజధాని కావాలని కొత్త డిమాండ్ అందుకుంది. హైకోర్టు తో ఎలా సరిపెడతారని నిలదీస్తున్నారు. అంతేకాదు సచివాలయాన్ని మార్చడం తేలికే గాని, హైకోర్టును మార్చడం అంత తేలిక కాదు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి నుంచి ఆదేశాలు రావాల్సి ఉంటుంది. ముందుగా సచివాలయాన్ని విశాఖకు మారిస్తే ఇతర ప్రాంతాల్లో ఆందోళనలు మరింత ఉధృతమవుతాయి. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వం కొంత వెనకడుగు వేశారని చెబుతున్నారు.అయితే ప్రభుత్వం మాత్రం తాము వెనకడుగు వేయలేదని చెబుతోంది. జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేయలేదని, ప్రతిపాదన మాత్రమే చేశారన్నారు. రాజధానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో టీడీపీ కూడా పైచేయి సాధించామని భావిస్తోంది. ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. అయితే వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం విశాఖను సచివాలయం తరలించడం ఖచ్చితమని చెబుతున్నాయి. ఇది కేవలం వాయిదా మాత్రమేనని అంటున్నారు.

No comments:

Post a Comment