Breaking News

17/12/2019

దేశమంతా సవరణం

న్యూఢిల్లీ, డిసెంబర్ 17 (way2newstv.in)
కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన పౌరసత్వ సవరణ చట్టం రాజకీయ సెగలు రేపుతోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఒక వర్గానికి చెందిన విద్యార్థులు అధికంగా ఉన్న విశ్వవిద్యాయాలు, విద్యాలయాల్లో ఆందోళనల తీవ్రత పెరుగుతోంది. తొలుత ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన హింసాత్మక సంఘటనలు క్రమేపీ విస్తరిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో సైతం ప్రకంపనలు వినిపిస్తున్నాయి. మతపరంగా సున్నితమైన హైదరాబాదునూ ఆందోళనల సెగ తాకుతోంది.బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆప్గనిస్తాన్ కు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం ఇప్పుడొక రాజకీయాంశంగా మారుతోంది. దేశంలోని అత్యధిక రాష్ట్రాలతోపాటు లోక్ సభలోనూ భారీ ఆధిక్యం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని చాకచక్యంగా పట్టాలపైకి ఎక్కించింది. 
దేశమంతా సవరణం

నిజానికి రాజ్యసభలో తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని భావించినప్పటికీ వ్యూహాత్మకమైన ఎత్తుగడలతో మద్దతును సమీకరించగలిగింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు పార్టీ విపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తేవడంలో విఫలమై చేతులెత్తేయడంతో రాజ్యసభలోనూ ఆటంకాలు ఎదురుకాలేదు. ప్రజాస్వామ్య యుతంగా చట్టం రూపుదాల్చినప్పటికీ ప్రజల్లో ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుండంతో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా అసోం వంటి చోట్ల పరిస్థితి అసాధారణంగా ఉంది. కర్ఫ్యూ విధింపు, అల్లర్లు వ్యాపించకుండా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం వంటి తాత్కాలిక చర్యలతో ఆందోళనలను అదుపు చేస్తున్నారు. పశ్చిమబంగలోనూ కొన్ని జిల్లాలు ఇంకా అట్టుడుకుతున్నాయి.ఎక్కడ ఓటు బ్యాంకు ఉంటుందో అక్కడ రాజకీయాలూ రంగప్రవేశం చేస్తుంటాయి. రాజకీయ శక్తుల పునరేకీకరణకు ఈ చట్టం దోహదం చేస్తుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. కాంగ్రెసు పార్టీ విధ్వంసాలకు కారణంగా నిలుస్తోందని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించారు. శాంతియుతమైన ఆందోళనలకు తాము అండగా ఉంటామని కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి విజయన్ బహిరంగంగానే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో నిరసనలకు మద్దతు పలుకుతున్నారు. వారే స్వయంగా ఆందోళనల్లో పాల్గొంటున్న పరిస్థితి. దేశవ్యాప్తంగా బీజేపీని వ్యతిరేకించే పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు దీనినొక అస్త్రంగా చేసుకోవాలని విపక్ష నాయకులు యోచిస్తున్నారు. కేవలం రాజకీయ ప్రేరేపితం కాకుండా ప్రజల్లోనూ వ్యతిరేకత ఉంది కాబట్టి దీనిని పొలిటికల్ టూల్ గా మార్చుకోవడం సులభమని పార్టీలు భావిస్తున్నాయి. అటు చట్టసభల్లో ఎదురులేకుండా తాను అనుకున్నది చేసుకుంటూ పోతున్న కేంద్రానికి చెక్ చెప్పేందుకు రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు ఇదొక బలమైన సమీకరణగా ఉపకరిస్తుందనే అంచనాలున్నాయి.బీజేపీ బలం, కేంద్రంలో తిరుగులేని మెజార్టీ కారణంగా ఎన్డీఏలోని పార్టీలతో పాటు ప్రాంతీయ పక్షాలు కూడా చట్టాల సవరణలో ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి. తమకు ఉండే రకరకాల అవసరాల ద్రుష్ట్యా ఎన్డీఏలో లేని పార్టీలు సైతం పోటీలు పడి కేంద్రప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నాయి. దక్షిణాదిన వైసీపీ, టీడీపీ లు ఈ కోవలోకే చెందుతాయి. నిజానికి వైసీపీ రాయలసీమ ప్రాంతాల్లో తిరుగులేని ఆధిక్యం సాధించడంలో మైనారిటీల ఓటును తోసి పుచ్చలేం. అయినప్పటికీ భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా వైసీపీ పౌరసత్వ సవరణపై సానుకూలంగా ఓటు వేయాల్సి వచ్చింది. తెలంగాణలో ముస్లిం జనాభా సంఖ్యను పరిగణనలోకి తీసుకుని టీఆర్ఎస్ వ్యతిరేకించింది. చట్టం ఆమోదం పొందినప్పటికీ అస్సాం గణపరిషత్, జనతాదళ్ యునైటెడ్ వంటి ఎన్డీఏ పక్షాలు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా తమకు పట్టు ఉన్న ప్రాంతాల్లో మనుగడ కష్టమవుతుందనే అంచనాలే వారి ఆందోళనకు కారణంగా చెప్పాలి. పౌరసత్వ సవరణ పెద్ద నోట్ల రద్దు వంటిదే నంటూ రాజకీయ వ్యూహకర్త, జేడీయూ నాయకుడు ప్రశాంత కిశోర్ ప్రకటించడం ఆ పార్టీలోని భిన్న భావాలకు నిదర్శనగా చెప్పుకోవాలి.పౌర సత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు మతపరంగా సున్నితమైన హైదరాబాదు వంటి ప్రాంతాలకు పాకుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మౌలానా అజాద్ యూనివర్శిటీ విద్యార్థుల రాత్రిపూట ధర్నాలకు దిగారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఈచట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. అధికారపార్టీ టీఆర్ఎస్ సైతం ఈ చట్టం అమలుపై వైముఖ్యంగా ఉంది. ఇవన్నీ కలగలిసి కేంద్ర, రాష్ట్రాల మధ్య రాజకీయ ఘర్షణకు దారితీసేందుకూ అవకాశాలున్నాయి. అయితే ఈ చట్టం పట్ల వ్యతిరేకత వస్తుంది. తమను వ్యతిరేకించే రాజకీయ పక్షాలు ఏకమవుతాయన్న విషయం బీజేపీ అధినాయకత్వానికి ముందే తెలుసు. దీనిపై ఎంతగా చర్చ సాగి, రచ్చ మొదలైతే అంతగానూ ప్రయోజనం ఉంటుందనేది కేంద్రం యోచనగా పరిశీలకులు పేర్కొంటున్నారు. విపక్ష పార్టీలు ఒక వర్గం ఓట్లను పోలరైజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే మెజారిటీ ఓటు బ్యాంకు బీజేపీ వైపు మళ్లుతుందని కమలనాథుల అంచనా. ఏదేమైనప్పటికీ చట్టం రాజ్యాంగబద్ధత, జాతీయంగా పౌరసత్వ నమోదు అమలు వంటి విషయాలపై న్యాయసమీక్షకు సుప్రీం కోర్టు సిద్ధమవుతోంది.

No comments:

Post a Comment