గుంటూరు, డిసెంబర్ 18 (way2newstv.in)
ప్రస్తుత ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకోలేక పోతున్నారా? సభ నిర్వహణలోను, సభను నడిపించడంలోను ఆయన పాత ధోరణులనే అనుసరిస్తున్నారా ? ప్రధాన ప్రతిపక్షం సహా అసెంబ్లీ జరుగుతున్న తీరును పరిశీలిస్తున్న వారికి వస్తున్న సందేహాలు ఇవి. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం నుంచి పలు మార్లు గెలిచిన ఆయనకు రాజకీయంగా సుదీర్ఘ ప్రస్థానం ఉంది. గతంలో మంత్రిగాను ఆయన వ్యవహరించారు. టీడీపీలోనే ఎక్కువగా ఆయన రాజకీయాలు చేశారు. తర్వాత వైసీపీలో చేరిపోయారు. ఆ తర్వాత వరుసగా సొంత మేనల్లుడిపైనే ఓటమిని చవి చూసిన ఆయన ఇక, రాజకీయంగా భవితవ్యం అయిపోయిందనే ప్రచారం ప్రారంభమైన నేపథ్యంలో మళ్లీ పుంజుకున్నారు.
కోడెల, తమ్మినేని సేమ్ టూ సేమ్
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత, సీఎం జగన్ తమ్మినేని సీతారాంకు ప్రతిష్టాత్మకమైన స్పీకర్ పదవిని అప్పగించారు. టీడీపీ మూలాలు, రాజకీయంగా అనుభవం ఉన్న తమ్మినేని సీతారాంను ఎంచుకోవడంలోనే జగన్‌కు పెద్ద వ్యూహం ఉందనేది వాస్తవం. ఇక. తమ్మినేని సీతారాం వంటి కీలక నాయకుడికి స్పీకర్ పోస్టు అప్పగించడాన్ని జగన్ ను రాజకీయ ప్రత్యర్థులు సైతం స్వాగతించారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన తమ్మినేని సీతారాంను ఈ పోస్టుకు ఎంపిక చేయడం ద్వారా జగన్ సరికొత్త రాజకీయాలకు తెరదీశారనే ప్రచారం కూడా జరిగింది.అయితే, ఆయనపై పెట్టుకున్న ఆశలను తమ్మినేని సీతారాం ఏమేరకు నెరవేస్తున్నారు ? ఆయన తన అనుభవాన్ని రంగరించి సభను నడిపించడంలో ఏమేరకు సక్సెస్ అవుతున్నారు? అనేది ఇప్పుడు తెరమీదికి వస్తున్న ప్రశ్నలు. గతంలో స్పీకర్ గా చేసిన దివంగత కోడెల శివప్రసాద్‌కు భిన్నంగా తమ్మినేని సీతారాం పారదర్శకంగా వ్యవహరించాలని అందరూ కోరుకున్నారు. వాస్తవానికి తమ్మినేని సీతారాం కూడా అలానే వ్యవహరిస్తానని సభ ప్రారంభమైన తొలి రోజే చెప్పుకొచ్చారు. అయితే, ఇటీవల కాలంలో చంద్రబాబు స్పీకర్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఆయన పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, తమకు అవకాశం ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సరే… ప్రతిపక్షంలో ఉన్నవారు ఇలాంటి ఆరోపణలు చేయడం కొత్తకాదు.. కాబట్టి వీటిని పరిగణనలోకి తీసుకోకపోయినా.. సభలో కొందరు మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను నిలువరించడంలో మాత్రం స్పీకర్ తమ్మినేని సీతారాం చొరవ తీసుకోకపోవడం విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా ఎంతో సీనియర్‌గా ఉన్న తమ్మినేని సీతారాం ఈ విషయంలో ఎందుకు సభను కంట్రోల్ చేయలేకపోతున్నారన్న ప్రశ్నలు కూడా తలెత్తడం సహజం. అదే సమయంలో తమ్మినేని సీతారాం కూడా కొన్నికొన్ని సార్లు తీవ్ర ఆవేశానికి గురికావడం, విపక్షంపై విరుచుకుపడడం వంటివి కూడా ఆయనకు పరీక్షగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నాలుగేళ్లలో అసెంబ్లీలో రాజకీయం మరింత వేడెక్కడం ఖాయం. ఈ క్రమంలో సభను ఎలా నడిపిస్తారో..? అనే ప్రశ్న వస్తోంది.
No comments:
Post a Comment