హైద్రాబాద్, డిసెంబర్ 31, (way2newstv.in)
ఆర్టీసీ గ్రేటర్ జోన్ లోని డ్రైవర్లను ప్రభుత్వ శాఖల్లోని ఇతర విభాగాలకు పంపించేస్తున్నారు. ఇటీవల గ్రేటర్ లో వెయ్యి బస్సులను తగ్గించటంతో అటు డ్రైవర్లు, ఇటు కండక్టర్లు డ్యూటీలు లేకుండా ఉన్నారు. దీంతో వీరిని సర్దుబాటు చేసే క్రమంలో ఇతర ప్రభుత్వ శాఖలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పలు ప్రభుత్వ శాఖల్లో డ్రైవర్ల అవసరం ఉంది. ఇలా అవసరం ఉన్న అన్ని విభాగాల్లో డ్రైవర్లను ఆర్టీసీ నుంచి ఇస్తే బాగుంటుందన్న ఆలోచన చేశారు.ఇప్పటికే తెలంగాణ ఫైర్ డిపార్ట్ మెంట్ కోరటంతో గ్రేటర్ నుంచి 42 మంది డ్రైవర్లను ఆ విభాగానికి బదిలీ చేశారు. ఇలా ఏ ప్రభుత్వ శాఖ కోరినా వారికి డ్రైవర్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 5 వేల మంది డ్రైవర్లు ఉన్నారు.
ఆర్టీసీ డ్రైవర్ల రేషనలైజేషన్
వీరిలోంచి 500 మందిని ఇతర డిపార్ట్ మెంట్లలో డ్రైవర్లుగా అడ్జస్ట్ చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఫైర్ డిపార్ట్ మెంట్ నుంచే కాకుండా పలు శాఖల నుంచి డ్రైవర్లు కావాలంటూ విజ్ఞప్తులు వస్తున్నాయని వారి రిక్రూట్ మెంట్ కు అనుగుణంగా డ్రైవర్లను ఎంపిక చేసి వారికి ఇస్తామని చెబుతున్నారు. డ్రైవర్లను తీసుకున్న విభాగాలే వారికి జీతాలు చెల్లించాల్సి ఉంటుందని గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.డ్రైవర్లను ఇతర ప్రభుత్వ విభాగాలకు పంపిస్తూ అడ్జస్ట్ చేస్తున్నప్పటికీ కండక్టర్ల విషయంలో మాత్రం కన్ ఫ్యూజన్ నెలకొంది. వందల మంది కండక్టర్లను ఎలా వినియోగించుకోవాలో తెలియక ఆర్టీసీ అధికారులు వారిని సెలవులు తీసుకోవాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఏడాది పూర్తవుతుండటంతో ఉన్న సెలవులను వాడుకోవాలని కోరటంతో కొంత మంది కండక్టర్లు డ్యూటీలకు సెలవులు పెడుతున్నారు. మరికొంత మంది కండక్టర్లను బస్టాప్ ల వద్ద ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు వినియోగిస్తున్నారు. ఐతే సంక్రాంతి తర్వాత ఎక్సెస్ గా ఉన్న కండక్టర్లను ఆర్టీసీలోని ఇతర విభాగాల్లో డ్యూ టీలు వేసే అవకాశాన్ని పరిశీలిస్తామని చెబుతున్నారు. కార్గో సేవలకు సంబంధించి కూడా కొంతమంది స్టాఫ్ ను వినియోగిస్తా మని, అర్హత ఉన్న వారిని అడ్మినిస్ట్రేషన్ విభాగంలోనూ సర్దుబాటు చేస్తామని చెబుతున్నారు.ఆర్టీసీలో చాలా కాలంగా పనిచేస్తున్న డ్రైవర్లు సైతం ఇతర విభాగాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రేటర్ జోన్ లో చాలా వరకు ట్రాఫిక్ లో బస్సులు నడపటం, ఒత్తిడితో కూడిన ఉద్యోగం కావటంతో డ్రైవర్లు కూడా ఇక్కడ పనిచేయటాన్ని భారంగా భావిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు మాత్రం సీనియర్ డ్రైవర్లను వేరే విభాగాలకు పంపించాలని భావిస్తున్నారు. జీతం ఎక్కువ ఉన్న వారిని వదిలించుకుంటే భారం తగ్గుతుందన్నది ఆర్టీసీ ఆలోచన. కానీ డ్రైవర్లను కోరుతున్న విభాగాలు కూడా సీనియర్లకు ఉండే జీతాన్ని భరించలేమంటూ.. జూనియర్ డ్రైవర్లనే కోరుతున్నారు. ఇతర ప్రభుత్వ విభాగాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్న డ్రైవర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు.బస్సులు తగ్గించటం కారణంగా డ్రైవర్లు , కండక్టర్ల సంఖ్య ఎక్కువైంది. వీరందరినీ అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా డ్రైవర్లను ఇతర విభాగాలకు కేటాయిస్తున్నాం. గ్రేటర్ పరిధిలోనే 500 మంది డ్రైవర్లను ఇతర ప్రభుత్వ శాఖలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కండక్టర్లను ఇతర విభాగాల్లో సర్దు తాం.
No comments:
Post a Comment