Breaking News

11/12/2019

కర్ణాటకలో తిరుగులేని యడ్డీ

బెంగళూర్, డిసెంబర్ 11 (way2newstv.in)
కర్ణాటక ఉప ఎన్నికల్లో 12 అసెంబ్లీ స్థానాల్లో అనూహ్య విజయం సాధించిన బీఎస్ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఉప ఎన్నికల ఫలితాలు యడ్యూరప్ప శిబిరంలో మరింత జోష్ ను పెంచాయి. ఇప్పటి వరకూ అణిగిమణిగి ఉన్న యడ్యూరప్ప ఇక తన విశ్వరూపం చూపించడానికి రెడీ అయిపోతున్నారు. ఉప ఎన్నికల ముందు వరకూ యడ్యూరప్ప పని అయిపోయిందనుకున్నారు. బీజేపీలోనే అనేక మంది యడ్యూరప్పకు ఇక రాజకీయ సన్యాసమేనని భావించారు.కానీ అందరు అంచనాలను తలకిందులు చేస్తూ యడ్యూరప్ప తానేంటో నిరూపించుకున్నారు. తనకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించిన అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను కమలం గుర్తుపైన పోటీ చేసి గెలిపించుకుని తన సత్తా చాటుకున్నారు. 
కర్ణాటకలో తిరుగులేని యడ్డీ

నిజానికి భారతీయ జనతా పార్టీలో నిన్నటి వరకూ యడ్యూరప్ప ఒంటరిగానే కన్పించారు. పార్టీ అధినాయకత్వం సయితం యడ్యూరప్పను అనేక విషయాల్లో కట్టడి చేసింది.చివరకు ముఖ్యమంత్రి పేషీలో సయితం తన అనుకూలురును నియమించుకుని చెక్ పెట్టేందుకు ప్రయత్నించింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా యడ్యూురప్పకు సహకరించలేదన్నది వాస్తవం. అనేకసార్లు కేంద్ర పెద్దలను కలిసినా చివరకు మంత్రి వర్గ విస్తరణలో కూడా యడ్యూరప్ప మాట చెల్లలేదు. మంత్రి వర్గ విస్తరణ ఉప ఎన్నికలకు ముందు చేపట్టాలన్న యడ్యూరప్ప వినతిని కూడా కేంద్ర నాయకత్వం పట్టించుకోలేదు. దీంతో యడ్యూరప్ప అన్ని కోల్పోయిన వాడిలా కన్పించారు.ఉప ఎన్నికల ఫలితాల తర్వాత యడ్యూరప్పలో వేయి ఏనుగుల బలం వచ్చినట్లయింది. కన్నడ రాజ్యంలో తానే రాజునని యడ్యూరప్ప నిరూపించుకున్నారు. మంత్రివర్గ విస్తరణ త్వరలో చేపడతానని, కొత్తగా ఎన్నికయిన వారిలో 11 మందికి మంత్రిపదవులు దక్కుతాయని యడ్యూరప్ప ప్రకటించడం ఆయన ధీమాకు దర్పణం పడుతుంది. ఇక కేంద్ర నాయకత్వం కూడా యడ్యూరప్పను పక్కన పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరి అండా దండా లేకుండానే యడ్యూరప్ప తన స్థానాన్ని పదిలం చేసుకోవడమే ఇందుకు కారణమని చెప్పక తప్పదు.

No comments:

Post a Comment