Breaking News

14/12/2019

అంగన్ వాడీలకు జియో ట్యాగింగ్

మెదక్, డిసెంబర్ 14, (way2newstv.in)
మెదక్ జిల్లాలో మెదక్‌, రామాయంపేట, నర్సాపూర్‌, అల్లాదుర్గం ప్రాజెక్టు పరిధిలోని ప్రతి కేంద్రాన్ని జియో ట్యాగింగ్‌ చేయనున్నారు. సీడీపీవోతో పాటు సూపర్‌వైజర్లు, కార్యకర్తలకు స్మార్ట్‌ ఫోన్లు ఉండడంతో జియో ట్యాగింగ్‌ను ఏ విధంగా చేయాలనే విషయమై అవగాహన కల్పించారు. తొలుత జియో ట్యాగ్‌లైన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాక కేంద్రం వద్దకు వెళ్లి ఇదివరకు కేటాయించిన సెక్టార్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఆప్షన్‌లో నమోదు చేయాలి. అనంతరం కేంద్రం సొంత భవనమా లేదా అద్దెదా, ఇతర ప్రాంతాల్లో కొనసాగుతోందా వంటి ఆప్షన్‌ అడగగానే నమోదు చేసి చిత్రం-1లో కేంద్రం బోర్డుతో కల్గిన ఛాయాచిత్రాన్ని తీసి, తర్వాత, కేంద్రం లోపల ఉన్న విద్యార్థులు, కార్యకర్త, ఆయా ఉన్న ఛాయాచిత్రాన్ని తీసి అంతర్జాలంలో నమోదు చేయాలి. 
అంగన్ వాడీలకు జియో ట్యాగింగ్

దీంతో సదరు అంగన్‌వాడీ కేంద్రం వివరాలు, ఛాయాచిత్రాలతో నిక్షిప్తమవుతాయి. ఏ సమయంలోనైనా కేంద్రం వివరాలను తెలుసుకునే అవకాశం జియో ట్యాగింగ్‌ ద్వారా కల్గనుంది. అద్దె భవనాల్లో కొనసాగే వాటికి కొత్త భవనాలు మంజూరు చేయడంతో పాటు శిథిలావస్థకు చేరిన కేంద్రాలకు నిధులు మంజూరు చేయించి మరమ్మతులు చేపట్టే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇది పూర్తయితే మారుమూల ప్రాంతంలో కేంద్రం నిర్వహిస్తున్నా ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుంది. దీని వల్ల సమయం కలిసిరానుంది. అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది.అంగన్‌వాడీ కేంద్రాలను జియో ట్యాగింగ్‌ చేయడం వల్ల సమగ్ర వివరాలు తెలుస్తాయని అధికారి పద్మ అంటున్నారు. ఏ కేంద్రం ఎక్కడ ఉందో తక్షణం తెలుస్తుంది. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, కేంద్రం ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. అద్దె లేదా సొంత భవనాల్లో కొనసాగుతున్న విషయం తెలుస్తుంది. తద్వారా కొత్తభవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యే అవకాశం ఉంటుంది. రెండు, మూడురోజుల్లో సిబ్బంది అన్ని కేంద్రాలను జియో ట్యాగింగ్‌ పూర్తి చేయాలన్నారు.

No comments:

Post a Comment