Breaking News

13/12/2019

ముంచేస్తున్న నకిలీ విత్తనాలు

మెదక్, డిసెంబర్ 13, (way2newstv.in)
సంగారెడ్డి జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలతో రైతులు నిలువునా మునిగారు. 500 ఎకరాలు తుడిచిపెట్టుకుపోవడంతో లబోదిబోమంటున్నారు. భక్తి, జాదు, రాజా పేరుతో మార్కెట్లోకి వచ్చిన విత్తనాలు అధిక దిగుబడి వస్తుందని చెప్పడంతో నమ్మారు. తీరా పూత, కాత లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయాధికారులను కలిసి మొరపెట్టుకుంటే పరిశీలించి చేతులు దులుపుకున్నారు. కంపెనీలనడిగితే వాతావరణంపై నెపం వేసి తప్పించుకున్నారు. ఇక చేసేది లేక న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని బాధిత రైతులు వేడుకుంటున్నారు.సంగారెడ్డి జిల్లాలో గతంలోకంటే ఈ ఏడాది అధికంగా పత్తి సాగు చేశారు. లక్షా 38వేల 387 హెక్టార్లలో పత్తి సాగైంది. 
ముంచేస్తున్న నకిలీ  విత్తనాలు

అదే సమయంలో నకిలీ విత్తనాల వ్యాపారమూ జోరుగా సాగింది. భక్తి, రాజా విత్తనాలను నూజీవీడు, జాదు విత్తనాలను కావేరి సీడ్స్‌ కంపెనీలు మార్కెట్లోకి తెచ్చాయి.సర్కార్‌ నుంచి విత్తనాలకు సబ్సిడీ లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ప్రయివేటు కంపెనీలదే ఇష్టారాజ్యమైంది. ప్రతి మండలంలోనూ ఏజెంట్లను పెట్టి అధిక దిగుబడి పేరుతో రైతులను నమ్మించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యి టన్నుల విత్తనాల వరకు విక్రయించినట్టు తెలుస్తోంది. సదాశివపేట్‌, కంది, కొండాపూర్‌, న్యాల్‌కల్‌ మండలాల్లో సుమారు 500 ఎకరాలు ఈ విత్తనాలే వాడారు. వాస్తవానికి ఈ యేడు వర్షాలు సకాలంలో కురవకపోవడం, ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటడంతో వర్షధార పంటైన పత్తివైపే రైతులు ఎక్కువ మొగ్గుచూపారు. కానీ నకిలీ విత్తనాల వల్ల పూత, పిందె లేక తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయాధికారులు తగిన జాగ్రత్తలు, పంటల పరిశీలన చేస్తే నష్టపోయేవారం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎకరా పత్తి సాగు చేయాలంటే దుక్కి దున్నడం మొదలుకుని, కూలీలు, ఇతర ఖర్చులు మొత్తం రూ.10వేలు అవుతున్నాయి. ఇక ఒక పత్తి విత్తన ప్యాకెట్‌ రూ.850 పెట్టి కొనుగోలు చేశారు. ఎకరానికి ప్యాకెట్‌న్నర అంటే రూ.12వందల వరకు అవుతుంది. కొండాపూర్‌ మండలం అనంతసాగర్‌కు చెందిన తొంట రవి ఎనిమిదెకరాల్లో భక్తి కంపెనీ పత్తి విత్తనాలు విత్తాడు. చుట్టుపక్కల గ్రామాల రైతులు ఇప్పటికే మొదటివిడత పత్తి తీసి విక్రయించారు. కానీ, రవి చేనులో పంట చేతికి రాకపోతే కాలం లేటయిందిలే అనుకున్నాడు. రెండోసారీ పత్తితీతకు చుట్టుపక్కల గ్రామాల రైతులు సిద్ధమయ్యారు. అయినా రవి పొలంలో కాతగాని పూతగాని లేదు. దీంతో తాను విత్తిన విత్తనాలు నకిలీవని గ్రహించాడు. ఇప్పటికే పెట్టుబడులకు రూ.2లక్షల 40వేల వరకు ఖర్చయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. న్యాల్‌కల్‌ మండలం ముంగి గ్రామానికి చెందిన సైదాబి అనే మహిళారైతు పదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేసింది. సాగు కోసం రూ.3లక్షల వరకు అప్పుచేసింది. చుట్టుపక్కల రైతుల చేలో పంట చేతికొస్తున్నా సైదాబి చేలో పైరు ఎదగలేదు. నకిలీ విత్తనాలే కొంప ముంచాయని రోదిస్తోంది. ఇలా అనంతసాగర్‌లో 36మంది రైతులు భక్తి, జాదు, రాజా విత్తనాలు వాడటంతో 74 ఎకరాల్లో నష్టపోయారు. ఏ ఒక్కరి చేనులోనూ పూత రాలేదు. అక్కడక్కడ వచ్చినా వెంటనే రాలిపోయింది. కంది మండలం చేర్యాల కలివేముల, కాశీపూర్‌ గ్రామాలకు చెందిన ఆగమయ్య, కిష్టయ్య, వెంకటయ్య రూ.10 లక్షలు ఖర్చు చేసి 25 ఎకరాల్లో భక్తి 2 బీటీ విత్తనాలు సాగు చేస్తే ఇక్కడా అదే పరిస్థితి.రాలేదని.. విత్తనాలు విక్రయించిన వ్యాపారుల వద్దకు వెళ్లి అడిగితే 'విత్తనాల్లో ఎలాంటి లోపం లేదు. మీరు యాజమాన్య పద్ధతులు సరిగా పాటించలేదు. వాతావరణం బాగాలేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది' అని చెప్పి చేతులు దులుపుకున్నారు. ఇదే విషయమై అధికారులను కలిస్తే పరిశీలిస్తున్నామని చెప్పారు. వాస్తవానికి అధికారులు పంటల్ని ఎప్పటికప్పుడూ పరిశీలించకపోవడమూ నష్టానికి ఓ కారణంగా చెప్పొచ్చు. రెండేండ్ల కిందట మునిపల్లి మండలంలో నకిలీ విత్తనాలతో వందలాది ఎకరాల్లో పంటలు నష్టపోతే.. అధికారులు దాడులు నిర్వహించి ఆయా డీలర్లపై చర్యలు తీసుకున్నారు. గతేడాది హత్నూర మండలంలో ఓ రాజకీయ పార్టీకి చెందిన ముఖ్య నాయకునికి చెందిన షాపులో నకిలీ విత్తనాలు బయటపడటంతో షాపును సీజ్‌ చేశారు.

No comments:

Post a Comment